జాతీయ పార్టీ డ్రామాకు తాళం పడింది

జాతీయ పార్టీ డ్రామాకు తాళం పడింది

‘మహారాష్ట్ర  ప్రజలారా.. బీజేపీ,  కాంగ్రెస్​కు ఓటు వేయకండి.  ప్రాంతీయ పార్టీలకే  ఓటు వేయండి.  ప్రాంతీయ పార్టీలను  బలోపేతం చేయండి.  బీజేపీని  నిలువరించే  దమ్ము  కాంగ్రెస్​కు లేదు.  ఉత్తరప్రదేశ్,  బెంగాల్​లో  బీజేపీని ప్రాంతీయ  పార్టీలే  అడ్డుకున్నాయ్’ అని బీఆర్ఎస్​ వర్కింగ్  ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.  దేశ రాజధానిలో   కేటీఆర్  చేసిన ఈ వ్యాఖ్యలతో  మరోసారి జాతీయ పార్టీలపై  తీవ్ర చర్చ జరుగుతున్నది.  

కేసీఆర్  పార్టీ 2001 ఏప్రిల్ 27 నుంచి 2022 అక్టోబరు 5 వ తేదీ వరకూ  ప్రాంతీయ పార్టీగా ఉన్నది.  రెండు దశాబ్దాల అనంతరం బీఆర్ఎస్ పేరిట జాతీయ పార్టీగా ప్రకటించారు.  కేటీఆర్  కథనం ప్రకారం.. మహారాష్ట్ర,  జార్ఖండ్​లలో ప్రాంతీయ పార్టీలను గెలిపించాలి. అయితే,  బీఆర్ఎస్  తరఫున ఆ రాష్ట్రాల్లో  బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి తమ పార్టీ బృందాలను ఏర్పాటు చేసి ఎందుకు పంపించలేదో  కేటీఆర్ వివరణ ఇవ్వలేదు.  

దేశంలోని ప్రాంతీయ పార్టీలకు మద్దతుగా నిలబడాలనుకున్నప్పుడు,  బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో  కలబడాలనుకున్నప్పుడు తమ పార్టీ జాతీయ పార్టీనో,   ప్రాంతీయ పార్టీనో  ప్రజలకు స్పష్టంగా వివరించవలసిన అవసరం ఉన్నది.  జాతీయ పార్టీలపై పోరాడాలనుకున్నప్పుడు, జాతీయ స్పృహ, దార్శనికత ఉండాలి.  జాతీయ పార్టీగానే  బీఆర్ఎస్  ఆ  రెండు  పార్టీలతో  తలపడాలి.  అపుడు జాతీయ పార్టీగా చెప్పుకొని, ఓడిపోయాక ఇపుడు ప్రాంతీయ పార్టీగా నాలుక మడతేసి చెప్పుకోవడం రాజకీయంగా  బీఆర్​ఎస్​ తన పరువును తానే బజారుకు ఎక్కించుకుందనడంలో సందేహం లేదు.

దేశమంతా  తన రాక కోసం  నిరీక్షిస్తున్నట్టు,  తాను  మినహా  ఈ దేశానికి  మరొక గొప్ప  నాయకుడు  దొరకడని ఊహాలోకాల్లో  విహరించిన కేసీఆర్  జాతీయ పార్టీని  స్థాపించారు.  ఆయన  అత్యాశ,  తన నాయకత్వ  ప్రతిభ గురించి  మితిమీరిన  విశ్వాసం బీఆర్ఎస్​ కొంప ముంచింది.  అసలుకే  ఎసరు పెట్టింది. 

జాతీయపార్టీ  స్థాపన జరిగిన  రెండేండ్లకే   తెలంగాణ   మైదానంలో  39 సీట్లకు  పరిమితమై అధికారానికి  దూరమైపోయింది.    తనను ఓడించినందుకు   ప్రజలపై  మనసులో కక్ష పెట్టుకొని  ఎర్రవల్లి  ఫార్మ్ హౌస్​ నుంచి  ఆయన  వెలుపలికి  రావడం లేదు.   తెలంగాణ  గ్రౌండ్​లో  కేటీఆర్,  హరీశ్​రావు హల్​చల్​ చేస్తున్నారు.  ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డిని వెంటాడటమే  తమ కర్తవ్యంగా  పని చేస్తున్నారు.  బావ బామ్మర్దులు ఎంతగా  చెమటోడ్చినా ఇంకా  నాలుగేండ్లు  ఎన్నికల కోసం ఎదురుచూడక తప్పదు.  

కేటీఆర్, హరీశ్​ రావుల ప్రాంతీయ వాదం

  ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ జరిగింది.'అబ్​ కీ బార్  కిసాన్  సర్కార్ ' నినాదంతో దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తెస్తామని, భూకంపం పుట్టిస్తామంటూ కేసీఆర్ గర్జించారు.  పార్టీ మార్పు తర్వాత మునుగోడు  ఉప ఎన్నికల్లో  బీఆర్ఎస్  తొలి విజయం సాధించింది.   ఇక ఆ తర్వాత 2023 డిసెంబర్​లో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ   బొక్కబోర్లాపడి   ప్రతిపక్ష  స్థానంలోకి వెళ్ళిపోయింది.  

పార్లమెంటు  ఎన్నికల్లో  ఒక్క స్థానం కూడా గెలవకపోవడం,  పలుచోట్ల మూడో స్థానానికి పరిమితం కావడం  కేసీఆర్ పార్టీకి సంబంధించి ఒక ట్రాజెడీ.  ఈ ప్రభావంతో  పొరుగు రాష్ట్రాల్లో  విస్తరణపై  కేసీఆర్  వెనుకడుగు వేశారని అర్థమవుతున్నది.   అధికారంలో  ఉన్నప్పుడు  కేసీఆర్ కలిసిన, లేదా ఆయనను  కలిసిన  ఇతర  రాష్ట్రాల సీఎంలు,  మాజీ సీఎంలు,  జాతీయ,  ప్రాంతీయ పార్టీల నాయకులంతా కేసీఆర్  అధికారం కోల్పోగానే  మొహం చాటేశారు.  

దీంతో జాతీయ రాజకీయాల్లో  కేసీఆర్  ప్రస్తుతం ఏకాకి.  బీఆర్ఎస్  పేరు  కలిసి రాలేదని,  పార్టీ పేరును తిరిగి  'తెలంగాణ రాష్ట్ర సమితి'గా  మార్చాలని  పార్టీ  శ్రేణులు,  నాయకులు  డిమాండ్  చేస్తున్నారు.  కానీ ఇప్పటికిప్పుడు పార్టీ పేరు మార్చడానికి చట్టం ఒప్పుకునేటట్లు లేదు. మొత్తంమీద ‘తెలంగాణ’ వాదాన్ని జారవిడుచుకున్న రాజకీయ నిరుద్యోగులుగా బీఆర్​ఎస్ ​నాయకులు మారిపోయారు.

బీజేపీని బలోపేతం చేసిన బీఆర్ఎస్​

బీఆర్ఎస్ ముందున్న సవాళ్లును పరిశీలిస్తే... తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దింపి, మధ్యంతర ఎన్నికలు తీసుకువచ్చి తాము అధికారంలోకి రావడం.   దేశవ్యాప్తంగా  తమ  ప్రధాన శత్రువు ఎవరో తేల్చుకోవడం.  ఈ  రెండు  సవాళ్లను  అధిగమించడం బీఆర్ఎస్​కు  అంత  సులభమైన వ్యవహారం కాదు.   రేవంత్​ను  సీఎం పదవి  నుంచి  దించివేయాలన్న  కేసీఆర్,   కేటీఆర్   కోరిక   నెరవేరడం అసాధ్యం.    

ఇక జాతీయ స్థాయి  రాజకీయాల్లో  బీఆర్ఎస్​కు  విలన్  ఎవరు?   బీజేపీతో   కొంతకాలం  తెరవెనుక  స్నేహం నడిపి,  తెలంగాణలో  ఆ పార్టీ  బలపడడానికి  పరోక్షంగా,  ప్రత్యక్షంగా కేసీఆర్ కారణం.  రెండు జాతీయపార్టీలలో  కాంగ్రెస్  పార్టీ  సెక్యులర్  పార్టీగా,   ప్రజాస్వామిక  పార్టీగా  ప్రజల్లో  ఒక భావన ఉన్నది.  

కాంగ్రెస్,  బీజేపీలకు  సమదూరం  పాటించడమూ  కష్టమే.  అందువల్ల  కాంగ్రెస్,  బీజేపీలలో  తన  ప్రధాన  శత్రువును  ఎంపిక చేసుకోవడం  కేసీఆర్ కు  ఇబ్బందికరంగా  తయారయ్యింది.  తెలంగాణ  రాజకీయ  బలాబలాల రీత్యా  కాంగ్రెస్​తో   నిరంతరం  యుద్ధం  చేయవలసిందే.  అదే  సమయంలో   బీజేపీతో  జాతీయస్థాయిలో  యుద్ధం  చేయవలసిందే.  

అధికారలేమితో బీఆర్​ఎస్​ నాయకుల్లో  మనోవ్యధ

‘రేవంత్ రెడ్డిపై  ప్రజల్లో  వ్యతిరేకత  కనిపిస్తోంది.  సొంత పార్టీలోనే  ఆయనపై  వ్యతిరేకత  ఉన్నది’ అని ఆరోపిస్తూ  కేటీఆర్  తరచూ   ట్వీట్​ ల   రూపంలో  నిప్పులు  చెరుగుతున్నారు.  అయితే,  రేవంత్ రెడ్డి  వ్యవహారశైలి,  పాలనా పద్ధతులపై  అంతర్గతంగా ఎవరికి  ఎలాంటి  అభిప్రాయం ఉన్నా,  ఇప్పట్లో  సీఎంకు  వ్యతిరేకంగా  రాజకీయాలు నడిపే  ధైర్యం, తెగువ  కనిపించడం లేదు.  అదృష్టవంతుడిని  చెరిపేవాడు,  దురదృష్టవంతుడ్ని బాగు చేసేవాడు ఉండరు  అనే సామెత ఉంది.  

కాంగ్రెస్ నాయకులు  అధికారాన్ని జాగ్రత్తగా  కాపాడుకుంటూ, రెండో టర్మ్ లోనూ  గెలిచే  వ్యూహాలను ఇప్పటినుంచే రచించవలసి ఉన్నది. ఎందుకంటే  అధికార లేమితో   తీవ్ర మనోవ్యధకు లోనవుతున్న  ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధికారం కోసం అర్రులు చాస్తున్నది.  రైతన్నల పక్షాన నిలబడి, గర్వంగా జైల్లోకి నడుచుకుంటూ వెళ్తా  అని కేటీఆర్ తొడ గొడుతున్నారు.  కేటీఆర్  లేదా  కేసీఆర్  లేదా మరెవరయినా  ఎంతగా  రెచ్చగొట్టినా సీఎం రేవంత్ రెడ్డి ఆ  ట్రాప్​లో  పడేరకం కాదు.  

క్యాడర్​లో గందరగోళం

బీఆర్ఎస్  పార్టీ  శ్రేణులను  కేటీఆర్   గందరగోళంలో  పడేశారన్న చర్చ కొనసాగుతోంది.  తాను   వర్కింగ్   ప్రెసిడెంట్​గా  ఉన్న  బీఆర్ఎస్  పార్టీ  జాతీయ పార్టీగా  కేసీఆర్   ప్రకటించిన  సంగతి  కేటీఆర్  మరచిపోయారేమో!    బీఆర్ఎస్  ప్రాంతీయవాద  జాతీయ పార్టీయా?   లేక  జాతీయ వాద  ప్రాంతీయ పార్టీయా?  అన్న అంశంపై  బీఆర్ఎస్ లో  స్పష్టత  కరువైంది.  

దేశంలో  గుణాత్మక మార్పు  తీసుకొస్తానంటూ  భారత రాష్ట్ర సమితిని  ఏర్పాటు చేశారు.  ఆంధ్రప్రదేశ్,  మహారాష్ట్ర  తదితర రాష్ట్రాల్లో  తమ స్థానిక యూనిట్​లను  కేసీఆర్  ఏర్పాటు చేశారు. కానీ,మహారాష్ట్ర ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయడం లేదని ప్రజల నుంచి ఆ పార్టీ ఎదుర్కొంటున్న ప్రశ్న.

జైలు కెళితే సానుభూతి వస్తుందా?

బీఆర్ఎస్   పాలనలో   లెక్కకు  మించి  జరిగిన  అక్రమాల్లో  ఎవరి పాత్ర ఏమిటో,  ఎవరి  వాటా ఏమిటో,   ప్రజాధనాన్ని ఎవరెవరు ఎట్లా కొల్లగొట్టారో   దర్యాప్తులో  బయటపడే  విషయాలు,  ఆధారాల  ప్రాతిపదికన చట్టపరమైన చర్యలు  తీసుకోవాలని సీఎం భావిస్తున్నారు.   అరెస్టయి జైలుకు వెడితే  సానుభూతి  వస్తుందని  బీఆర్ఎస్  నాయకులు  అనుకుంటున్నారు.  కానీ,  కేసీఆర్  పరివారంపైన అలాంటి జాలి,  దయ  ప్రజల్లో  ఇంకా కలగలేదు.    

కేటీఆర్   అరెస్టు అయినా ఒకటీ,  రెండు రోజులు  మీడియాలో  హడావుడి  మినహా  పెద్దగా  ప్రజల్లో  స్పందన రాకపోవచ్చు.  కానీ,  బీఆర్ఎస్  నాయకులు మళ్ళీ  అధికారంలోకి  రావడం కోసం  తొందర పాటు  చర్యలకు,  దుందుడుకు  చర్యలకు  పాల్పడుతున్నట్టు పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

– ఎస్.కే. జకీర్, సీనియర్ జర్నలిస్ట్-