జాతీయ పేదరికపు సూచీ .. తెలంగాణ జాబ్స్​ స్పెషల్​

జాతీయ పేదరికపు సూచీ .. తెలంగాణ జాబ్స్​ స్పెషల్​

దేశంలో పేదరికం అంచనాలను నీతి ఆయోగ్​ చేపడుతుంది. ఇందుకోసం నేషనల్​ మల్టీ డైమెన్షనల్​ పావర్టీ ఇండెక్స్​ ద్వారా దేశంలో పేదరికం అంచనా వేస్తోంది. నేషనల్​ ఫ్యామిలీ హెల్త్​ సర్వే–5 ప్రకారం 2019–21కి గాను పేదరికం అంచనాలను ఇటీవల నీతి ఆయోగ్​ విడుదల చేసింది. తాజా నివేదిక ప్రకారం దేశంలో 13.5 కోట్ల మంది పేదరికం నుంచి విముక్తి పొందారు. పేదరికమూ 24.85 శాతం నుంచి 14.96 శాతానికి తగ్గింది.

నేషనల్​ మల్టీ డైమెన్షనల్​ పావర్టీ ఇండెక్స్(ఎంపీఐ)​–2023ను జులై 11న నీతి ఆయోగ్​ విడుదల చేసింది. ఈ నివేదికను జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఐదో రౌండ్​(2019–21)ను ఆధారంగా రూపొందించారు. మొత్తం 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 707 జిల్లాల్లో 12 సూచికల ఆధారంగా నేషనల్​ మల్టీ డైమెన్షనల్​ పావర్టీ ఇండెక్స్​ తయారు చేశారు.

13.5 కోట్ల మందికి విముక్తి

ఎంపీఐ నివేదిక ప్రకారం భారతదేశంలో పేదల శాతం 2015–16లో 24.85శాతం నుంచి 2019–21లో 14.96 శాతానికి తగ్గి 9.89 శాతం పాయింట్ల క్షీణతను నమోదు చేసింది. ఈ లెక్కన 2021లో 13.5 కోట్ల మందికి పేదరికం నుంచి విముక్తి లభించింది. ఈ ఐదేళ్లలో ఎంపీఐ విలువ 0.117 నుంచి 0.066శాతానికి తగ్గింది. పేదరిక తీవ్రత 47.14శాతం నుంచి 44.39 శాతానికి తగ్గింది. తద్వారా ఐక్యరాజ్య సమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యం 1.2 (పేదరికాన్ని 2030 నాటికి కనీసం సగానికి తగ్గించడం)ను ముందుగానే సాధించే దిశగా భారత్​ పురగమిస్తోందని నీతి ఆయోగ్​ తెలిపింది. పారిశుద్ధ్యం, పాఠశాల విద్య, పోషకాహారం, వంట ఇంధన తదితర సౌకర్యాలను ప్రభుత్వం మెరుగుపరచడంతో ఈ పురోగతి సాధ్యమైందని నీతి ఆయోగ్​ పేర్కొంది.

బహుముఖ పేదరిక సూచీ ప్రకారం పేదలు గ్రామీణ ప్రాంతాల్లో 2015–16లో 32.59 శాతం ఉండగా 2019–21 నాటికి 19.28 శాతానికి తగ్గారు. పట్టణ ప్రాంతాల్లో చూస్తే పేదరికం 2015–16లో 8.65శాతం ఉంటే 2019–21 నాటికి 5.27శాతం ఉంది.

జాతీయ బహుముఖ పేదరిక సూచీలో 12 సూచికల్లో జీవన ప్రమాణాలు మెరుగుపడటానికి ప్రధాన కారణం దేశంలో అమలు చేస్తున్న లక్షిత విధానాలు, పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు. ముఖ్యంగా స్వచ్ఛ భారత్​ మిషన్​, జల్​ జీవన్​ మిషన్​, పోషణ్​ అభియాన్​, సమగ్ర శిక్షా అభియాన్, ప్రధాన మంత్రి సహజ బిజిలీ హర్​ ఘర్​ యోజన్​, ప్రధాన మంత్రి ఉజ్వల యోజన​, ప్రధాన మంత్రి జనధన్​ యోజన, ప్రధాన మంత్రి ఆవాస్​ యోజన ఇతర పథకాలు బహుముఖ పేదరి సూచీ మెరుగుదలకు ప్రముఖ పాత్ర వహించాయి.

బిహార్​ టాప్​

నేషనల్​ మల్టీ డైమెన్షనల్​ పావర్టీ ఇండెక్స్​–2023 ప్రకారం అత్యధికంగా పేదరికాన్ని తగ్గించిన రాష్ట్రాల్లో బిహార్​ మొదటి స్థానంలో ఉంది. ఆ రాష్ట్రంలో నేషనల్​ ఫ్యామిలీ హెల్త్​ సర్వే –4 (2015–16) ప్రకారం 51.89శాతం పేదలు ఉండగా ఎన్​ఎఫ్​హెచ్​ఎస్​–5 (2019–21) నాటికి 33.76శాతానికి తగ్గింది. దీని ప్రకారం 18.13శాతం పేదలు తగ్గారు. బిహార్​ తర్వాతి స్థానాల్లో మధ్యప్రదేశ్​ (–15.94శాతం), ఉత్తరప్రదేశ్​ (–14.75శాతం), ఒడిశా (–13.65శాతం), రాజస్తాన్​ (–13.56శాతం) ఉన్నాయి. సంఖ్యాపరంగా పరిశీలిస్తే ఉత్తరప్రదేశ్​లో అత్యధికంగా 3.43కోట్ల ప్రజలు పేదరికం నుంచి బయటపడగా,  ఆ తర్వాతి స్థానాల్లో బిహార్​ (2.25 కోట్లు), మధ్యప్రదేశ్​ (1.36కోట్లు) ఉన్నాయి.

  • రాష్ట్రాల మొత్తం జనాభాలో తలల లెక్కింపు పద్ధతి ప్రకారం పేదల శాతాన్ని పరిశీలించగా అత్యధికంగా పేదలు 2019–21లో బిహార్​లో 33.76శాతం ఉన్నారు. 2015–16లో  51.89శాతం ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో 2019–21లో జార్ఖండ్​ (28.81శాతం), మేఘాలయా (27.79శాతం), ఉత్తరప్రదేశ్​ (22.93శాతం), మధ్యప్రదేశ్​ ఉన్నారు.
  • రాష్ట్రాల మొత్తం జనాభాలో తలల లెక్కింపు పద్ధతి ప్రకారం అతి తక్కువ పేదలు ఉన్న రాష్ట్రాల్లో కేరళ 0.55% గోవా 0.84%, తమిళనాడు 2.20%, సిక్కిం 2.60%, పంజాబ్​ 4.75 శాతం ఉన్నారు.

తెలంగాణలో అంచనాలు

  • నేషనల్​ మల్టీ డైమెన్షనల్​ పావర్టీ ఇండెక్స్​ –2023 ప్రకారం సంఖ్యాపరంగా ఎక్కువ మంది పేదరికం నుంచి విముక్తి పొందిన రాష్ట్రాల్లో తెలంగాణ 14వ స్థానంలో నిలిచింది. నిష్పత్తిపరంగా కూడా 14వ స్థానంలో ఉంది. ఈ ఐదేళ్లలో తెలంగాణలో పేదరికం నుంచి 7.30శాతం మంది విముక్తి పొందారు. రాష్ట్రంలో 2015–16లో తలల లెక్కింపు పద్ధతి ప్రకారం పేదరికం 13.18శాతం ఉండగా, 2019–21లో 5.88శాతం ఉంది. పేదరికం సాంద్రత 2‌‌015–16లో 43.29శాతం కాగా 2019–21లో 40.85శాతం. ఎంపీఐ 2015–16లో 0.057శాతం కాగా 2019–21లో 0.024శాతం.
  • గ్రామీణ ప్రాంతంలో తలల లెక్కింపు పద్ధతి ప్రకారం 2015–16లో 19.51శాతం ఉంటే 2019–21లో 7.51శాతం ఉంది. గ్రామీణ ప్రాంతంలో పేదరిక సాంద్రత 2015–16లో 43.33శాతం ఉండగా 2019–21లో 40.88శాతం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఎంపీఐ విలువ 2015–16లో 0.085శాతంగా ఉండగా 2019–21లో 0.031శాతంగా ఉంది.
  •  పట్టణ ప్రాంతాల్లో తలల లెక్కింపు పద్ధతి ప్రకారం పేదరికం 2015–16లో 4.92శాతం ఉండగా, 2019–21లో 2.73శాతం ఉంది. పట్టణ ప్రాంతాల్లో పేదరిక సాంద్రత 2015–16లో 43.06శాతం ఉంటే 2019–21లో 40.70శాతం ఉంది. పట్టణ ప్రాంతాల్లో ఎంపీఐ విలువ 2015–16లో 0.021శాతంగా ఉండగా 2019–21లో 0.011శాతంగా ఉంది.
  • పేదల శాతం అత్యధికంగా ఉన్న జిల్లాలు: కుమ్రంభీం ఆసిఫాబాద్​ (16.59శాతం), జోగులాంబ గద్వాల్​ (15.37శాతం), ఆదిలాబాద్​ (14.24శాతం), వికారాబాద్​ (12.50శాతం), కామారెడ్డి (11.90శాతం). అత్యల్పంగా పెద్దపల్లి (2.17శాతం), వరంగల్​ అర్బన్ (2.41శాతం), కరీంనగర్​ (2.50శాతం), హైదరాబాద్​ (2.52శాతం), జనగాం (2.91శాతం) .

ఇంటర్నేషనల్​ మల్టీ డైమెన్షనల్​ పావర్టీ ఇండెక్స్​

యూనైటెడ్​ నేషన్స్​ డెవలప్ మెంట్​ ప్రోగ్రామ్​ – యూఎన్డీపీ), ఆక్స్​ఫర్డ్​ పావర్టీ అండ్​ హ్యూమన్​ డెవలప్ మెంట్​ ఇనిషియేటివ్​ (ఓపీహెచ్ఐ)లు కలిసి ఇంటర్నేషనల్​ మల్టీ డైమెన్షనల్​ పావర్టీ ఇండెక్స్​ –2023 నివేదికను జులై 11న విడుదల చేశాయి. అన్​స్టాకింగ్​ గ్లోబల్​ పావర్టీ: డేటా ఫర్ హై ఇంప్లికేషన్​ ఉపశీర్షికతో 110 దేశాలకు సంబంధించి ఎంపీఐని రూపొందించారు.

41 కోట్ల మందికి విముక్తి

  • ఇంటర్నేషనల్​ మల్టీ డైమన్షనల్​ పావర్టీ ఇండెక్స్​ – 2023 ప్రకారం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో ఒకటైన భారత్​లో పేదరికం గణనీయంగా తగ్గుముఖం పట్టింది. 15ఏళ్ల వ్యవధి(2005–06 నుంచి 2019–21)లో 41.5కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని నివేదిక వెల్లడించింది.
  •  2005–06 నుంచి 2019–21 మధ్య భారత్​లో పేదరికం సగం తగ్గిందని నివేదిక వివరించింది. భారత్​లో 2005–06లో 55.1శాతం మంది పేదలు ఉండగా, 2019–21 నాటికి వారి సంఖ్య 16.4శాతానికి తగ్గిపోయిందని యూఎన్​ఓ నివేదిక పేర్కొంది.

2005–06లో భారత్​లో 64.5కోట్ల మంది పేదరింలో ఉన్నారు. ఈ సంఖ్య 2015–16 నాటికి 37 కోట్లకు, 2019–21 నాటికి 23 కోట్లకు తగ్గింది. ఇదే సమయంలో సరైన పౌష్టికాహారం అందుబాటులో లేని ప్రజల సంఖ్య 44.3శాతం  నుంచి 11.8శాతానికి తగ్గిపోయిందని వెల్లడించింది. శిశు మరణాలు 4.5శాతం నుంచి 1.5శాతానికి తగ్గిపోయాయని నివేదిక పేర్కొంది. పారిశుద్ధ్య సదుపాయాలు అందుబాటులో లేని వారి సంఖ్య 50.4శాతం నుంచి 11.3శాతానికి తగ్గిందని తెలిపింది. ఎక్కువ మందికి తాగునీరు, విద్యుత్​ వంటి సౌకర్యాలను కల్పించడంలో భారత్​ గణనీయమైన ప్రగతి సాధించిందని కొనియాడింది. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో ఒకటైన పేదరికం నిర్మూలన దిశగా వేగవంతమైన పురోగతిని సాధించగలమని ఈ గణాంకాలు చాటుతున్నట్లు నివేదిక తెలిపింది. పేద రాష్ట్రాలు, గ్రూపులు అత్యంత వేగవంతమైన పురోగతిని నమోదు చేశాయని యూఎన్​ఓ నివేదిక పేర్కొంది.  

ప్రపంచవ్యాప్తంగా 110 కోట్ల మంది పేదలు

ఇంటర్నేషనల్​ మల్టీ డైమెన్షనల్​ పావర్టీ ఇండెక్స్​ – 2023 ప్రకారం 110 దేశాల్లోని 610 కోట్ల మంది జనాభాలో 110 కోట్ల మంది తీవ్ర పేదరికంలో ఉన్నారు. వారిలో 84శాతం మంది గ్రామీణులే. 110 కోట్ల మందిలో 56 కోట్ల మంది 18ఏళ్ల లోపు వారే. మొత్తం పేదల్లో సబ్​ సహారా ఆఫ్రికాలో 53.4కోట్లు, దక్షిణాసియా 38.9కోట్ల మంది ఉన్నారు. ప్రతి ఆరుగురు పేదల్లో ఐదుగురు ఇక్కడివారే. మూడింట రెండొంతుల మంది పేదలు మధ్య ఆదాయ దేశాల్లో నివసిస్తున్నారు. ఈ దేశాల్లో పేదరిక నిర్మూలన చర్యలు ముఖ్యమని యూఎన్​ఓ అభిప్రాయపడింది. పేదరికం తగ్గుదలపై కరోనా పరిస్థితుల ప్రభావాన్ని అంచనా వేయాల్సి ఉంది.

చైనాలో పేదరికం భారీగా తగ్గినట్లు నివేదిక వెల్లడించింది. చైనాలో 2‌010 నుంచి 2014 మధ్య 6.9కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడినట్లు తెలిపింది. ఇండోనేషియాలో 2012 నుంచి 2017 మధ్య 80 లక్షల మంది పేదరికం నుంచి బయటకు వచ్చినట్లు పేర్కొంది.