హైదరాబాద్ : ఖమ్మంలో నిర్వహించే బహిరంగ సభకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు బయలుదేరి వెళ్లారు. అంతకుముందు బేగంపేట రసూల్ పురా చౌరస్తా వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు విక్టరీ సింబల్ తో అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఆ తర్వాత పార్టీ జెండాను చంద్రబాబు ఆవిష్కరించారు.
ఖమ్మంలో జరిగే టీడీపీ సభకు వనస్థలిపురం మీదుగా వెళ్తుండగా.. చంద్రబాబుకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. పార్టీ నాయకులు గజమాలతో స్వాగతం పలికారు. ఈ క్రమంలో ఉన్నట్టుండి చంద్రబాబుపై గజమాల పడడంతో పెను ప్రమాదం తప్పింది. చంద్రబాబుపై గజమాల పడిన వెంటనే ఆయన వెనుకాలే ఉన్న భద్రతా సిబ్బంది అలర్ట్ అయ్యి.. దాన్ని తీసివేశారు. ఆ తర్వాత అక్కడ కార్యకర్తల సందడిని కంట్రోల్ చేశారు.
మరోవైపు..చౌటుప్పల్ లో కూడా చంద్రబాబుకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. చౌటుప్పల్ లో మాజీ మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి.. నివాళులర్పించారు.
ఇవాళ ఖమ్మంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ పునర్నిర్మాణ సభ నిర్వహిస్తున్నారు. టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కాసాని ముదిరాజ్ ఆధ్వర్యంలో ఈ సభ ఏర్పాటు చేశారు. ఇవాళ సాయంత్రం ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో టీడీపీ సభ కొనసాగనుంది.