- నేషనల్ ఎస్సీ, ఎస్టీ కమిషన్కు రాష్ట్ర కమిషన్ చైర్మన్ విజ్ఞప్తి
హైదరాబాద్, వెలుగు : ఎస్సీ, ఎస్టీలపై అత్యాచారాలు, దాడులు చేస్తున్న నిందితులకు బెయిల్ ఇవ్వొద్దని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య.. జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్కు విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఢిల్లీలోని నేషనల్ ఎస్సీ కమిషన్ కార్యాలయంలో చైర్మన్ కిశోర్ మక్వానా, నేషనల్ ఎస్టీ కమిషన్ కార్యాలయంలో సభ్యుడు హన్సర్సింగ్ ఆర్యాను కలిశారు. దళిత, గిరిజనుల రక్షణకు తెచ్చిన ప్రత్యేక చట్టానికి 41 సీఆర్పీని వర్తింప చేయవద్దని కోరారు.
ఈ మేరకు వినతిపత్రం అందించారు. ఎస్సీ, ఎస్టీ చట్టానికి 41 సీఆర్పీ వర్తింపచేయవద్దని ప్రధాని మోదీ, కేంద్ర సామాజిక, న్యాయశాఖ మంత్రిత్వ శాఖల దృష్టికి తీసుకువెళ్తానని, సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేస్తామని కిశోర్ మక్వానా హామీ ఇచ్చినట్టు వెంకటయ్య తెలిపారు. 4 రోజులపాటు ఢిల్లీలోనే పర్యటిస్తామని, కేంద్ర సామాజిక, న్యాయ శాఖ మంత్రితోపాటు ప్రధానిని, అధికారులను కలుస్తామని చెప్పారు. వెంకటయ్య వెంట కమిషన్ సభ్యులు జిల్లా శంకర్, లక్ష్మీ నారాయణ, ప్రవీణ్, రామ్ బాబు నాయక్, నీలా దేవీ ఉన్నారు.