హైడ్రా పనితీరు సూపర్ : నారాయణ

  • మధ్యతరగతి, పేదల ఇండ్ల  జోలికి వెళ్లొద్దు
  • హైడ్రాపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలి

హైదరాబాద్, వెలుగు: అక్రమ కట్టడాలను కూల్చేస్తున్న హైడ్రా పనితీరు బాగుందని సీపీఐ జాతీయ కార్యదర్శి కే.నారాయణ అన్నారు. ప్రైవేట్​నిర్మాణాలను కాపాడుకునేందుకు ప్రభుత్వ ఆఫీసులను సాకుగా చూపే ప్రయత్నం జరుగుతున్నదని విమర్శించారు. ‘ప్రభుత్వ కార్యాలయాలనూ కూలుస్తారా?’ అని ఎంఐఎం నేత ప్రశ్నించడాన్ని ఆయన తప్పుపట్టారు. ప్రజాప్రయోజనాలకు ఉపయోగపడే ప్రభుత్వ కార్యాలయాలకు, కబ్జాదారులు కట్టిన ఫామ్ హౌస్​లు, ఫంక్షన్ హాళ్లు, విద్యా సంస్థలకు ముడిపెడుతారా? అని ప్రశ్నించారు. 

ఈ అంశంలో ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలని డిమాండ్ చేశారు. సోమవారం హైదరాబాద్​లోని మగ్దుంభవన్​లో ఆ పార్టీ రాష్ట్ర నాయకులు పశ్య పద్మ, బాల మల్లేశ్​తో కలిసి మీడియాతో మాట్లాడారు. హైడ్రా అంశంలో సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని చెప్పారు. మధ్యతరగతి, పేదల ఇళ్ల స్థలాల జోలికి వెళ్లకూడదని, వారి స్థలాలను క్రమబద్ధీకరించాలని, లేకుంటే వారికి ప్రత్యామ్నాయం చూపాలని డిమాండ్ చేశారు. చెరువు స్థలాల్లో ఉన్న వాణిజ్య, వ్యాపార కట్టడాలను తొలగించాలని, కబ్జాలకు పాల్పడిన బడాబాబుల నుంచి డబ్బులు వసూలు చేయాలని కోరారు. 

ఎన్ కన్వెన్షన్ అంశంలో సినీనటుడు నాగార్జున నుంచి కూడా డబ్బులు వసూలు చేయాలన్నారు. ‘హైడ్రా’ పేరుతో అక్రమ కూల్చివేతలు పులి మీద స్వారీ లాంటిదని, భయపడి సీఎం రేవంత్ రెడ్డి పులి మీద నుంచి దిగితే.. ఆ పులి ఆయననే తినేస్తుందని అన్నారు. ప్రధాని మోదీ పాలనలో పెరుగుతున్న నిత్యావసరాల ధరలకు వ్యతిరేకంగా సెప్టెంబర్ 1 నుంచి 7వ తేదీ వరకు దేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు నారాయణ చెప్పారు.