- వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన క్రీడాకారులు
హనుమకొండ, వెలుగు : హనుమకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియం (జేఎన్‌ఎస్)లో 34వ నేషనల్ సీనియర్స్ సెపక్ తక్రా ఛాంపియన్ షిప్ 2024–25 పోటీలు శుక్రవారం అట్టహాసంగా ప్రారంభం అయ్యాయి. తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోటీలకు పురుషుల విభాగంలో 28, మహిళల విభాగంలో 23 కలిపి మొత్తం 53 టీమ్స్ హాజరయ్యారు.
వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు, డిస్ట్రిక్ట్ ఒలింపిక్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అజీజ్‌ఖాన్, బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, భూపాలపల్లి అధ్యక్షురాలు కీర్తి రెడ్డి హాజరై పోటీలను ప్రారంభించారు. టీమ్ ఈవెంట్, రేగు ఈవెంట్, డబుల్, క్వాట్ ఈవెంట్లలో పోటీలు జరిగాయి. కార్యక్రమంలో తెలంగాణ సెపక్ తక్రా అసోసియేషన్ ప్రెసిడెంట్ పేరిక సురేశ్‌కుమార్, ఆల్ ఇండియా ఫెడరేషన్ సీఈవో యోగేందర్‌సింగ్, ప్రతినిధులు ఎస్‌ఆర్.ప్రేమ్‌రాజ్ పాల్గొన్నారు.
విజేతలు వీరే..
పోటీల్లో భాగంగా మొదటి రోజు రేగు ఈవెంట్ నిర్వహించారు. మహిళల విభాగంలో ఎస్‌ఎస్‌బీ టీమ్‌తో ఉత్తరప్రదేశ్ జట్టు తలపడగా ఎస్‌ఎస్‌బీ గెలిచింది. అస్సాం, బిహార్ మధ్య జరిగిన పోరులో బీహార్, నాగాలాండ్, తెలంగాణ గేమ్‌లో నాగాలాండ్ గెలిచాయి. తర్వాత ఎస్‌ఎస్‌బీ, బీహార్ టీమ్ పోటీలో ఎస్‌ఎస్‌బీ, హరియాణా, మణిపూర్ పోటీలో మణిపూర్, హరియాణా, నాగాలాండ్ ఆటలో నాగాలాండ్, మణిపూర్, తెలంగాణ పోటీలో మణిపూర్ జట్టు విజయం సాధించింది.
పురుషుల విభాగంలో మహారాష్ట్రతో జరిగిన పోరులో ఎస్‌ఎస్‌బీ, తెలంగాణతో పోటీపడిన ఢిల్లీ టీమ్స్ గెలిచాయి. తర్వాత తమిళనాడుపై అస్సాం, ఉత్తర్‌ప్రదేశ్‌పై మణిపూర్, తమిళనాడుపై ఎస్‌ఎస్‌బీ, అస్సాంపై మహారాష్ట్ర గెలుపొందాయి. అనంతరం తెలంగాణపై ఉత్తరప్రదేశ్, అసోంపై ఎస్‌ఎస్‌బీ, మహారాష్ట్రపై తమిళనాడు, తెలంగాణపై మణిపూర్, మణిపూర్‌పై ఢిల్లీ జట్లు విజయం సాధించాయి.