NSS DAY: సేవ తోవలో.. సెల్ఫ్ లెస్ సర్వీస్

NSS DAY: సేవ తోవలో..  సెల్ఫ్ లెస్ సర్వీస్

నిస్వార్థమే లక్షణం.. సమాజసేవే లక్ష్యం.  ఎడ్యుకేషన్  ద్వారా సర్వీస్ అంటూ విద్యార్థుల్లో చదువు, విజ్ఞానంతో పాటు సమాజం పట్ల బాధ్యతను, సమస్యల పట్ల అవగాహనను పెంపొందిస్తూ విద్యార్థుల సమగ్ర మూర్తిమత్వానికి, మంచి క్రమశిక్షణకి దారి చూపిస్తూ ప్రజా హృదయపథంలో పయనించే ఆ రథమే జాతీయ సేవా పథకం ‘ఎన్ఎస్ఎస్’.  నేడు సెప్టెంబర్ 24  ఎన్ఎస్ఎస్  డే. జాతీయస్థాయిలో కేంద్ర ప్రభుత్వం యువజన, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ స్థాయి నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు గల విద్యార్థులను వివిధ సామాజిక కార్యక్రమాలలో పాలుపంచుకునే విధంగా ఏర్పాటు చేసిన విభాగమే జాతీయ సేవా పథకం ‘ఎన్ఎస్ఎస్’. 1969 మహాత్మా గాంధీ జన్మ శతాబ్ది సందర్భంగా సెప్టెంబర్ 24న ఈ కార్య క్రమాన్ని ప్రారంభించారు. 55 ఏండ్లుగా ఎన్ఎస్ఎస్ తన సేవల్ని సమాజానికి అందిస్తూ వస్తుంది. విద్యార్థులను సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగం చేస్తూ వారిలో సమగ్ర మూర్తిమత్వాన్ని,  మంచిక్రమశిక్షణను పెంపొందించడమే ప్రధాన లక్ష్యంగా ఇది పని చేస్తున్నది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల్లోనూ ఎన్ఎస్ఎస్  విభాగం  ఎంతోమంది విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్నది.

ఎన్ఎస్ఎస్ లక్ష్యాలు

సమాజ అవసరాలు, సమస్యలను గుర్తించడం విద్యార్థులను సమస్యల పరిష్కారంలో పాల్గొనేటట్టు చేయడం.  క్యాంపులలో సమూహ జీవనం, పనులను పూర్తి చేయడంలో ఒకరికొకరు సాయం చేయడం కోసం అవసరమైన సామర్థ్యాల్ని విద్యార్థుల్లో పెంపొందించడం.  అత్యవసర పరిస్థితులు,  ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనే సామర్థ్యాలను పెంపొందించడం. జాతీయ సమైక్యత, సామాజిక సామరస్యతను పాటించడం.  మొక్కలు, జంతువులు వంటి ఇతర జీవుల పట్ల శ్రద్ధ, దయగా ఉండేటట్లు విద్యార్థులకు నేర్పించడం వంటి అనేక మంచి లక్షణాలని సాధించడానికి ఎన్ఎస్ఎస్ ఏర్పాటు చేయబడింది. కాగా,  ఎన్ఎస్ఎస్ విభాగంలో ప్రధానంగా రెండు క్యాంపులు ఉంటాయి. మొదటిది.. రెగ్యులర్ క్యాంప్ ల ద్వారా సంవత్సరంలో ప్రముఖులు, ప్రత్యేక రోజుల్లో కార్యక్రమాలు నిర్వహించడం.  రెండోది.. స్పెషల్ క్యాంపు ద్వారా విద్యాసంస్థలకు సమీపంలోని గ్రామాలని దత్తత తీసుకొని ఆ గ్రామాల అభివృద్ధికి వారం రోజుల పాటు క్యాంపులు వేసి వివిధ కార్యక్రమాలని చేపట్టడం. 

ఎన్ఎస్ఎస్ మోటో, బ్యాడ్జ్

‘నాట్ మీ బట్ యూ.. నా కోసం కాదు మీ కోసం.. మనమంతా సమాజం కోసం’ అనే మోటోను సూచిస్తుంది. సమాజంలో తన అవసరం ఎప్పుడైనా ఎక్కడైనా ఉంటుందని సూచించేవిధంగా ఎన్ఎస్ఎస్ బ్యాడ్జ్​ ఉంటుంది. ఒడిశాలోని కోణార్క్ సూర్యదేవాలయ రథచక్రాన్ని బ్యాడ్జ్ లో అమర్చారు. రథచక్రంలోని 24 గంటల సమయాన్ని మేం సమాజ సేవకు కేటాయిస్తామన్న సంకేతాన్ని తెలుపుతుంది. బ్యాడ్జీలోని రెడ్ కలర్ యువత శక్తిని, పట్టుదలను తెలియజేస్తుంది. నీలిరంగు మానవ శ్రేయస్సుకు కావలసిన ఏ సహాయాన్ని అయినా ఎక్కడైనా చేయడానికి రెడీగా ఉన్నాం అనే విషయాన్ని తెలుపుతుంది. కాగా,  నేషనల్ ఇంటిగ్రేటెడ్ క్యాంప్ ప్రతి సంవత్సరం దేశంలోని ఏదో ఒక ప్రాంతంలో ఏడు రోజులపాటు నిర్వహిస్తారు.  ప్రతి ఏటా ఒకసారి ఈ ప్రోగ్రాంను నిర్వహిస్తారు. ఈ ప్రోగ్రాంను హిమాలయాల ప్రాంతంలో ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్ చుట్టుపక్కల నిర్వహిస్తారు. అడ్వెంచర్ క్యాంప్ లో భాగంగా మౌంటెన్ ట్రెక్కింగ్, నదిలో సాహసపూరిత పడవ ప్రయాణం, పారాచూట్, స్కేటింగ్ వంటివి ఉంటాయి.  కేంద్ర యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో జనవరి 12 నుంచి 16 వరకు నేషనల్ యూత్ ఫెస్టివల్స్ వివిధ రాష్ట్రాల్లో ప్రత్యేకంగా నిర్వహిస్తారు.  ఎన్ఎస్ఎస్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న ఉత్తమ ప్రతిభ కనబరిచిన వలంటీర్లకు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లకు, ఎన్ఎస్ఎస్ యూనిట్ సెల్​కు, నేషనల్ సర్వీస్ అవార్డ్స్ ఇస్తారు. 

- బాదిని నాగేశ్వర్