నేడు జాతీయ క్రీడా దినోత్సవం.. ఆటలతోనే స్ట్రాంగ్​ నేషన్​

నేడు జాతీయ క్రీడా దినోత్సవం.. ఆటలతోనే స్ట్రాంగ్​ నేషన్​

కేంద్ర ప్రభుత్వం అసాధారణ దూర దృష్టి ఫలితంగా  క్రీడలు ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి. క్రీడా మంత్రిత్వ శాఖ జాతీయ క్రీడ ప్రాధికారిక సంస్థ ఆధ్వర్యంలో అమలు పరుస్తున్న ఖేలో ఇండియా, టార్గెట్ ఒలింపిక్ పోడియం పథకం (టాప్స్) , ఫిట్ ఇండియా వంటి వివిధ కార్యక్రమాల ద్వారా క్రీడా వసతులు మెరుగుపడి అత్యధిక సంఖ్యలో క్రీడాకారులు ప్రత్యేక శిక్షణ పొందుతున్నారు. జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో ప్రపంచ శక్తిగా ఎదుగుతున్నారు. కానీ దేశ జనాభా మన క్రీడా ప్రతిభతో పోలిస్తే ఇప్పటిదాకా సాధించిన ప్రగతి గోరంతే.. సాధించాల్సింది కొండంత ఉంది. అలాగే క్రీడా సంఘాల్లో  రాజకీయాల వల్ల ఎందరో ప్రతిభావంతులైన క్రీడాకారుల భవిష్యత్తు పాడవుతున్నది.

వినూత్న కార్యక్రమాలు..

 మన క్రీడాకారుల అత్యుత్తమ ప్రదర్శనలతో మనల్ని శక్తివంతమైన దేశంగా ప్రపంచం ముంగిట నిలబెట్టడానికి కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ అనేక వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. దేశంలోని క్రీడాకారులు జాతీయ వేదిక పై తన నైపుణ్యం ప్రదర్శించడంతోపాటు తదుపరి శిక్షణకు ఎంపిక అయ్యే అవకాశం కల్పించడంలో  2016లో క్రీడల శాఖ ప్రవేశపెట్టిన ఖేలో ఇండియా కార్యక్రమం అందుకు సహాయపడుతున్నది. క్రీడాకారులకు శిక్షణ సమయంలో ఉపకార వేతనంతో పాటు మంచి భోజన వసతి, క్రీడా పరికరాలు, అత్యాధునిక క్రీడా సముదాయాలలో శిక్షణ  పొందడానికి ఈ పథకం వరంలా మారింది. 

దేశంలోనే నలుమూలల నుంచి ఎంపికైన క్రీడాకారులకు ఒకే చోట శిక్షణ ఇవ్వడం ద్వారా వారి సంస్కృతి సాంప్రదాయాల పట్ల  పరస్పర గౌరవభావం పెంపొందే  విధంగా ఒకే భారతం, -శ్రేష్ట భారతం అనే భావనకు ఈ క్రీడా భారతం పథకం బలం చేకూరుస్తుంది. అలాగే క్రీడలతో పాటు శరీర దారుఢ్యం ప్రతి పౌరుడికి ఒక జీవన విధానంగా ఉండాలని ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం 2019లో ‘ఫిట్ ఇండియా’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘దారుఢ్యం నిమిత్తం అర్ధగంట నిత్యం’ అనే నినాదం ఆధారంగా ఏడాది పొడవునా వివిధ కార్యక్రమాల ద్వారా క్రీడల పట్ల ప్రజలకు అవగాహన కలిగిస్తున్నది. ఫ్రీడమ్ రన్, సుదృఢ భారత్ క్విజ్, క్విట్ ఇండియా స్కూల్ వీక్ వంటి కార్యక్రమాల్లో లక్షలాది మంది విద్యార్థులు పాలుపంచుకుంటున్నారు. అలాగే 2014లో  ప్రవేశపెట్టిన టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీం ద్వారా మన క్రీడా వ్యవస్థలో పలుమార్పులు చోటు చేసుకున్నాయి. 

మాజీ క్రీడా దిగ్గజాలతో మిషన్ ఒలింపిక్ సెల్ తీసుకువచ్చారు. ఈ ఏడాది జరిగే ఆసియా క్రీడలతో పాటు, ప్యారిస్ (2024) లాస్ ఏంజిల్స్ (2028)లలో జరిగే ఒలింపిక్స్ లక్ష్యంగా ఈ సెల్ పని చేస్తుంది. పథకాలు తెచ్చే అవకాశం ఉన్న క్రీడాకారులను గుర్తించి వారికి తగిన ప్రపంచ స్థాయి శిక్షణ ఇచ్చే అవకాశాన్ని టాప్స్ పథకం కల్పిస్తుంది. 2023 ఫిబ్రవరిలో ఇన్వెస్ట్ ఇండియా ఇచ్చిన నివేదిక ప్రకారం ఆసియాలో మూడవ అతిపెద్ద క్రీడా పరికరాల తయారీదారిగా భారత్ నిలిచింది. క్రీడా పరిశ్రమ దేశంలో దాదాపుగా 5 లక్షల మంది కార్మికులకు ఉపాధి కల్పిస్తూ ఆర్థివృద్ధికి తోడ్పడుతున్నది.

వికసిస్తున్న క్రీడోదయం...

జాతీయ క్రీడా ప్రాధికారిక సంస్థ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా వివిధ శిక్షణ కేంద్రాలలో శిక్షణ పొందుతున్న క్రీడాకారులు ప్రస్తుతం జాతీయ అంతర్జాతీయ స్థాయిలలో ఆసియా క్రీడలు, ఒలింపిక్ క్రీడల్లో  తమ సత్తా చాటుతున్నారు. టోక్యో ఒలింపిక్స్ లో వెయిట్ లిఫ్టింగ్, బ్యాడ్మింటన్, బాక్సింగ్, హాకీ, రెజ్లింగ్, అథ్లెటిక్స్ ల్లో  భారత్ కు పతకాలు దక్కాయి. అథ్లెటిక్స్ లో భారత్ కు నీరజ్ చోప్రా మొట్టమొదటి స్వర్ణ పతకం అందించడం శుభ పరిణామం. టోక్యో ఒలింపిక్స్ లో ఈశాన్యం నుంచి మీరా రజతం పొందడం,

 మణిపూర్, అస్సాం, సిక్కిం లాంటి రాష్ట్రాల్లో  క్రీడా మౌలిక వసతులు గణనీయంగా మెరుగుపడటం భారత్​లో క్రీడల అభివృద్ధికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.  దేశంలో క్రీడా మౌలిక వసతులు మరింతగా కల్పిస్తే  క్రీడాకారుల శిక్షణ పై ఎక్కువ దృష్టి సారిస్తే ఇంకా ఎక్కువగా ఆశించిన ఫలితాలు సాధించవచ్చు. ఆటల నుంచి రాజకీయాలను పక్కన పెడితే నూతన క్రీడాభారతం ఆవిష్కృతమవుతుంది.

అంకం నరేష్,  సోషల్​ ఎనలిస్ట్​