అడవికి హక్కుదార్లు గిరిజనులే : జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్​ అనంత నాయక్

అడవికి హక్కుదార్లు గిరిజనులే
గిరిజన హక్కుల చట్టాన్ని పకడ్బందీగా అమలుచేయాలి
జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్​ అనంత నాయక్

ఖమ్మం టౌన్, వెలుగు :  అటవీ హక్కుల చట్టాన్ని  పకడ్బందీగా అమలు చేయాలని  జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్​ అనంత నాయక్ ఆదేశించారు.  గిరిజనులే అడవికి హక్కుదారులు అనే  విషయంపై వారికి అవగాహన కల్పించాలని ఆఫీసర్లకు సూచించారు.  మంగళవారం ఖమ్మం పట్టణంలోని ఐడీవోసీ  కాన్ఫరెన్స్​ హాల్​లో కలెక్టర్ వి.పి. గౌతమ్, పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్. వారియర్,  భద్రాచలం ఐటీడీఏ పీవో గౌతమ్ పోట్రూతో కలిసి వివిధ శాఖల అధికారులతో  గిరిజన సంక్షేమంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అనంత నాయక్​ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ర్ట సంక్షేమ పథకాలు, చట్టాలు, పాలసీల ద్వారా కల్పించిన హక్కులపై గిరిజనులకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని చెప్పారు. గిరిజనుల సమస్యలను ఫీల్డ్​ లెవల్​ ఆఫీసర్లు తెలుసుకుని వారికి న్యాయం చేయాలన్నారు.  జిల్లాలో భూమిలేని ఎస్టీ వ్యవసాయ కూలీల వివరాలు తమకు అందించాలని సూచించారు. గిరిజన ఆరోగ్యం, విద్యా, ఉపాధి, ఎస్టీ అట్రాసిటీ కేసులు తదితర విషయాలపై చర్చించారు. సమావేశంలో  స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహాలత మొగిలి, ఖమ్మం మునిసిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి తదితరులు పాల్గొన్నారు.