గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేయాలి : జాటోత్ హుస్సేన్ నాయక్

గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేయాలి : జాటోత్ హుస్సేన్ నాయక్

మహబూబాబాద్, వెలుగు: గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక కార్యచరణ అమలు చేయాలని జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్ జాటోత్ హుస్సేన్ నాయక్ కోరారు. శుక్రవారం మహబూబాబాద్​ కలెక్టరేట్​లో ఆఫీసర్లతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. జిల్లాలో క్షేత్రస్థాయిలో అధికారులు అంకితభావంతో పనిచేసి గిరిజన, బడుగు, బలహీన వర్గాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించాలని సూచించారు. ఐటీడీఏ ఏటూరునాగారం పరిధిలో మహబూబాబాద్ జిల్లా ప్రాంతం భాగస్వామ్యం ఉన్నందున గిరిజన గ్రామాల అభివృద్ధికి ప్రాజెక్టు డైరెక్టర్ పూర్తి సహకారం అందించాలని కోరారు.

కేసముద్రం మండలం తిమ్మపేటలో 30 మంది గిరిజనుల భూసమస్య వెంటనే పరిష్కరించాలన్నారు. జిల్లాలో నేషనల్ గ్రీన్ ఫీల్డ్ హైవే పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. దంతాలపల్లిలో డంపింగ్ యార్డు సమస్యను పరిష్కరించాలన్నారు. నెల్లికుదురు మండలంలో వరదలు, భారీ వర్షాల నేపథ్యంలో చెరువులు కట్టలు తెగిపోయాయని వాటి మరమ్మతు పనులపై ఆరా తీశారు. గూడూరు మండలంలోని పలు గ్రామాల్లో ఫారెస్ట్, భూ సమస్యలు పరిష్కరించలన్నారు. అంతకుముందు జిల్లా కేంద్రంలోని డీఎఫ్​వో  ఆఫీస్ ఆవరణలో "అమ్మ పేరు మీద ఒక చెట్టు" పథకం కార్యక్రమంలో మొక్కను నాటారు. సమావేశంలో కలెక్టర్​ అద్వైత్​ కుమార్​ సింగ్, జిల్లా ఎస్పీ సుధీర్ రామ్ నాథ్​ కేకన్,  ఐటీడీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ చిత్ర మిశ్రా, అడిషనల్​ కలెక్టర్లు లెనిన్ వత్సల్ టోప్పో, కె.వీర బ్రహ్మచారి తదితరులు పాల్గొన్నారు.