పదేండ్లు అగ్రి వర్సిటీని సొంత ఎస్టేట్​గా మార్చారు : హుస్సేన్

పదేండ్లు అగ్రి వర్సిటీని సొంత ఎస్టేట్​గా మార్చారు : హుస్సేన్
  • పాత వీసీపై నేషనల్ ఎస్టీ కమిషన్​ మెంబర్ హుస్సేన్ ఫైర్ 

హైదరాబాద్, వెలుగు:  అగ్రికల్చర్​వర్సిటీలోని ఎస్టీ ప్రొఫెసర్లకు, ఉద్యోగులకు ప్రమోషన్లలో తీవ్ర అన్యాయం జరిగిందని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్​ హుస్సేన్ నాయక్ అసంతృప్తి వ్యక్తం చేశారు.  గతంలో పని చేసిన వీసీ వర్సిటీని పదేండ్ల పాటు సొంత ఎస్టేట్​గా మార్చుకున్నారని విమర్శించారు. అగ్రికల్చర్​ వర్సిటీ భూములు వందల ఎకరాలు కబ్జాకు గురవుతున్నా పట్టించుకోలేదని ఆరోపించారు. సెంట్రల్​ కమిషన్​ నుంచి నోటీసు పంపించి  గతంలో పని చేసిన వీసీ హయాంలో జరిగిన ట్రాన్స్​ఫర్లు, ప్రమోషన్లు, కబ్జాలన్నింటిపైనా విచారణ కోరుతామని హుస్సేన్​ నాయక్​ప్రకటించారు.  

గురువారం హుస్సేన్ నాయక్ అగ్రికల్చర్​ యూనివర్సిటీని సందర్శించారు. ఆయనకు కొత్త వీసీ ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య పూల బోకే ఇచ్చి స్వాగతం పలికారు. వర్సిటీ ఆడిటోరియంలో ఎస్టీ ఉద్యోగులు, విద్యార్థులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎస్టీ ఉద్యోగులకు ప్రమోషన్లలో అన్యాయం జరిగిందనీ, ఎస్టీ ప్రొఫెసర్లు, సిబ్బందిని దూర ప్రాంతాలకు ట్రాన్స్​ఫర్​ చేశారని కమిషన్​ దృష్టికి వర్సిటీ సిబ్బంది తీసుకువచ్చారు.  దీనిపై హుస్సేన్ ​మాట్లాడుతూ.. ఎస్టీ ఎంప్లాయిస్​కు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదన్నారు.సెంట్రల్ కమిషన్​ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి  నోటీసు పంపించి పాత వీసీపై విచారణ కోరుతామన్నారు. 

కొత్త వీసీ ప్రొఫెసర్​అల్దాస్ జానయ్య మాట్లాడుతూ.. తాను మూడు నెలల క్రితమే వీసీగా బాధ్యతలు స్వీకరించానని తెలిపారు. తన సారథ్యంలో వర్సిటీ డైమండ్​ జూబ్లీ ఉత్సవాల్ని ఘనంగా నిర్వహించామన్నారు. టీచింగ్​, నాన్​ టీచింగ్​ సిబ్బంది, విద్యార్థుల సమస్యలను  దశలవారీగా పరిష్కరించడానికి అన్ని చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. వర్సిటీ ఎస్టీ ఉద్యోగులు, సిబ్బంది సమస్యలు, ప్రమోషన్లను చక్కదిద్దే పనిలో ఉండాలని వీసీని ఎస్టీ కమిషన్​సభ్యుడు హుస్సేన్​ నాయక్​ ఆదేశించారు.