
- వ్యవసాయ శాఖలో అందరూ దొంగలే తయారయ్యారని ఫైర్
వెంకటాపురం, వెలుగు: ‘ఏజెన్సీలో గిరిజనుల సమస్యలపై పని చేసే ఆఫీసర్లే ఉండండి.. లేదంటే ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్లిపోండి’ అని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో పర్యటించారు. చిరుతపల్లి గ్రామంలో మొక్క జొన్న సాగు చేసి నష్టపోయి సూసైడ్ చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శించారు. అనంతరం ఆశ్రమ పాఠశాలలో ఆఫీసర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతానికి ఎన్నో ఏండ్ల నుంచి నిధులు మంజూరు చేస్తున్నా, అభివృద్ధికి నోచుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.
గిరిజనుల పక్షాన పని చేయాల్సిన కొందరు ఆఫీసర్లు గిరిజనేతరులకు అండగా ఉంటున్నారని, అలాంటి ఆఫీసర్లపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అధికారులు తమకు వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని, లేదంటే ఆయా శాఖలకు పంపించాలే తప్ప రోజుల తరబడి తిప్పించుకోవడం సరైంది కాదన్నారు. ఏజెన్సీలో మల్టీ నేషనల్ కంపెనీలు దోపిడీ చేస్తున్నాయని, అగ్రిమెంట్ పేరుతో విచ్చలవిడిగా వ్యవసాయం చేస్తున్నాయని పేర్కొన్నారు.
మొక్కజొన్న బీటీ సీడ్, విత్తన ఉత్పత్తి చేస్తున్న సమాచారం వ్యవసాయ శాఖ వద్ద లేకపోవడం, వెంకటాపురం మండలంలో 1,200 ఎకరాలు అధికారులకు తెలియకుండా ఎలా సాగు చేస్తారని ప్రశ్నించారు.వ్యవసాయ శాఖలో అందరూ దొంగలే తయారయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొక్కజొన్న సాగు చేసి నష్టపోయిన రైతులకు ఆయా కంపెనీల నుంచి రూ.90 వేలు పరిహారం చెల్లించేలా కంపెనీలతో కలెక్టర్ చర్చలు జరిపారని చెప్పారు.
మొక్కజొన్న సాగుకు సంబంధించిన పూర్తి నివేదికను నెల రోజుల్లో ఇవ్వాలని కలెక్టర్ ను ఆదేశించారు.కలెక్టర్ దివాకర మాట్లాడుతూ వెంకటాపురం మండలంలో గిరిజనేతురులు ఆక్రమించుకున్న ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. ఏటూరునాగారం ఐటీడీఏ పీవో చిత్ర మిశ్రా, ఆర్డీవో వెంకటేశ్వర్లు, డీఎఫ్వో రాహుల్ కిషన్ జాదవ్, డీఏవో సురేశ్, తహసీల్దార్ లక్ష్మీనరసయ్య, సివిల్ సప్లై ఆఫీసర్ ఫైజన్ హుస్సేన్ పాల్గొన్నారు.