తండాల అభివృద్ధికి కృషి చేస్తా : జాటోతు హుస్సేన్ నాయక్

తండాల అభివృద్ధికి కృషి చేస్తా :  జాటోతు హుస్సేన్ నాయక్
  • జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్ నాయక్ 

అశ్వారావుపేట, వెలుగు: దేశంలో 12 కోట్ల గిరిజనులు నివసిస్తున్న తండాలను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్ నాయక్ అన్నారు. అశ్వారావుపేట మండలంలోని కావడి గుండ్ల, గాండ్ల గూడెం, మల్లాయిగూడెం, రామన్నగూడెంలలో  మంగళవారం ఆయన పర్యటించారు. 9 గ్రామాల్లో ఉన్న గిరిజనులకు రోడ్డు, కరెంట్​సౌకర్యం ఒక నెలలో కల్పిస్తామని పేర్కొన్నారు. సర్వే నంబర్​52 కింద 3,372 ఎకరాల భూమిలో గిరిజనులు సాగు చేసుకోవడం సమస్యగా ఉందని, 15 రోజుల్లో పరిష్కరిస్తామని తెలిపారు. 

బస్సు సౌకర్యం లేని గిరిజన గ్రామాలకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తో మాట్లాడి, వారం రోజుల్లో బస్సు నడిపేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఐటీడీఏ పీవో రాహుల్ మాట్లాడుతూ.. త్వరలో గిరిజన యువత సౌకర్యార్థం దమ్మపేట, అశ్వారావుపేటలో జాబ్ మేళా నిర్వహిస్తామన్నారు. నెలకోసారి దమ్మపేటలో మినీ గిరిజన దర్బార్ నిర్వహించి, గిరిజన సమస్యల పరిష్కరించడానికి కృషి చేస్తామన్నారు. రామన్నగూడెం, మల్లాయిగూడెంలలో జీవ ప్రాజెక్ట్ కమిటీ వారు ఏర్పాటు చేసిన తృణధాన్యాలు, చిరుధాన్యాల స్టాళ్లను పరిశీలించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి జలగం ప్రసాద్ రావు,  ఎఫ్ డీవో దామోదర్ రెడ్డి, ట్రైబల్ వెల్ఫేర్ అధికారి మణెమ్మ, తహసీల్దార్ కృష్ణప్రసాద్, ఏటీడీవో చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు.