ఉగ్రదాడి ‘నేషనల్ తోహీద్ జమాత్’ పనే: శ్రీలంక

శ్రీలంకలో ఆత్మాహుతి దాడులకు పాల్పడింది ‘నేషనల్ తోహీద్ జమాత్ (ఎన్ టీజే)’ అనేముస్లిం టెర్రరిస్టు సంస్థ అని శ్రీలంక అధికారికంగా ప్రకటించింది. ఈ సంస్థ ఎవరికీ పెద్దగా తెలియదు. కిందటేడాదిలోనే ఇది ఉనికిని చాటుకుంది. అప్పట్లో సెంట్రల్‌ శ్రీలంకలోని మావనెల్లాలోని బౌద్ధాలయాల్లో బుద్ధుడి విగ్రహాలను ధ్వంసం చేసి మిలిటెన్సీలో కొత్త ఎంట్రీ ఇచ్చింది. విగ్రహాల ధ్వంసం వంటి కార్యకలాపాలకు పాల్పడే ఈ టెర్రరిస్టు సంస్థ… పక్కాప్రణాళిక ప్రకారం మూడు చర్చీలు, మూడు లగ్జరీ హోటళ్లపై దాడులు చేసి 290 మంది ప్రాణాలుతీయడానికి తెగబడగలదా అనే ప్రశ్న తలెత్తింది.

జాగ్రత్తగా గమనిస్తే శ్రీలంకలో పేలుళ్లకు , 1993, 2006, 2008లలో జరిగిన ముంబై వరుస పేలుళ్లకు పోలికలు కనిపిస్తాయి. ముంబైలో కూడా ఒకేసారి వేర్వేరు ప్రాంతాల్లో జరిగాయి. 1993లో 257 మంది, 2006లో 209 మంది, 2008లో174 మంది ముంబైలో మిలిటెంట్లకు బలయ్యారు. శ్రీలంక దాడులు కూడా అదే తరహాలో జరిగాయి. 2008నాటి 26/11 ఘటనలో విదేశీయులు ఎక్కువగా ఉండే ఖరీదైన హోటళ్లను టెర్రరిస్టులు టార్గెట్ చేసుకున్నారు. శ్రీలంకలోనూ మూడు లగ్జరీ హొటళ్లపై ఆత్మాహుతి దాడులు జరిగాయి. దీంతో ఎన్టీజే సంస్థకు ‘లష్కర్ ఏ తోయిబా (ఎల్‌ఈటీ)’ వంటి టెర్రరిస్టుల అండదండలు ఉన్నాయా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పటివరకు అందిన వివరాలనుబట్టి శ్రీలంక తౌహీద్‌ జమాత్‌ (ఎస్‌ఎల్ టీజే) చీలిక వర్గంగా ఎన్టీజేని గుర్తించారు. ఎస్‌ఎల్టీజే సెక్రటరీ అబ్దుల్‌ రజిక్‌ గతంలో యాంటీ బుద్ధిస్ట్‌ క్యాంపెయిన్‌ నడిపి వార్తల్లోకి ఎక్కాడు.