
- రైతులకు మేలు చేసే నిర్ణయాలు తీసుకుందాం..
- జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి
నిజామాబాద్, వెలుగు: పసుపు రైతుల మాటున రాజకీయాలు చేయడం ఆపాలని నేషనల్ టర్మరిక్ బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి కోరారు. మంగళవారం నగరంలోని వేణుమాల్ కన్వెన్షన్ సెంటర్లో పసుపు బోర్డు ఆధ్వర్యంలో ట్రేడర్లు, రైతులతో జరిగిన మీటింగ్లో ఆయన మాట్లాడారు. ప్రధాని మోదీ ఆలోచన మేరకు సంక్రాంతి పండగ రోజు జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటైందన్నారు. ఓపెనింగ్ ఈవెంట్‌ను కలెక్టరేట్లో చేయాలని కలెక్టర్ రాజీవ్‌గాంధీని కోరగా స్పందించలేదన్నారు.
అందుకే హోటల్లో ఏర్పాటు చేయాల్సి వచ్చిందని, కొందరు లీడర్లు రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పసుపు ఎన్ని విధాల వాడే వీలుందో రీసెర్చ్ చేస్తామన్నారు. దేశంలో 7 లక్షల ఎకరాల్లో పసుపు సాగవుతుండగా 2 లక్షల ఎకరాల పంటతో మహారాష్ట్ర టాప్‌లో ఉందన్నారు. తరువాత ఒడిశా, తమిళనాడు, ఏపీ ఉన్నాయన్నారు. సమావేశంలో బోర్డు సెక్రటరీ భవానీ, రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, అదనపు కలెక్టర్ అంకిత్ తదితరులు పాల్గొన్నారు.