నిజామాబాద్: తెలంగాణలోని నిజామాబాద్ లో జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే.. జాతీయ పసుపు బోర్డు చైర్ పర్సన్‌గా నిజామాబాద్‌కు చెందిన పల్లె గంగారెడ్డి నియమితులయ్యారు. అంకాపూర్ గ్రామానికి చెందిన రైతు పల్లె గంగారెడ్డి ప్రస్తుతం బీజేపీలో సీనియర్ నేతగా, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం 2025, జనవరి 13న ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే.. నిజామాబాద్‌లో ఏర్పాటు చేయనున్న జాతీయ పసుపు బోర్డు ప్రారంభోత్స తేదీని కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని.. 2025, జనవరి 14వ తేదీన ఉదయం 10 గంటలకు నిజామబాద్‌లోని నిఖిల్ సాయి ఇంటర్నేషనల్ హోటల్లో జాతీయ పసుపు బోర్డు ప్రారంభోత్స కార్యక్రమం జరగనుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని లోక్ సభ ఎన్నికల సందర్భంగా ప్రధాని మోడీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. హామీ ఇచ్చిన మేరకు పసుపు బోర్డు కేంద్ర ప్రధాన కార్యాలయాన్ని నిజామాబాదులోనే ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఎక్కువ విస్తీర్ణంలో పసుపును పండించే తమ రాష్ట్రంలోనే పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని పెట్టాలని మహారాష్ట్ర ప్రభుత్వం అక్కడి బీజేపీ నాయకులు తీవ్రస్థాయిలో కేంద్ర ప్రభుత్వం మీద తీవ్ర ఒత్తిడిని తెచ్చినా ఇచ్చిన మాట కోసం నిజామాబాదులోనే బోర్డ్ కేంద్ర కార్యాలయం ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రభుత్వం అనౌన్స్ చేసింది. నిజామాబాద్‌లో పసుపు బోర్డు ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. స్థానిక బీజేపీ ఎంపీ అర్వింద్ సక్సెస్ అయ్యారని బీజేపీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పసుపు బోర్డు రానుండడంతో ప్రపంచ పసుపు హబ్‌గా నిజామాబాద్ మారనుంది.
ALSO READ | రేషన్ కార్డులోని ప్రతి ఒక్కరికి 6 కిలోల సన్న బియ్యం ఫ్రీ: మంత్రి ఉత్తమ్
నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, నిర్మల్ జిల్లాల్లో కూడా విరివిగా ఏర్పాటు కానున్న పసుపు శుద్ధి కర్మాగారాలు, ప్రాసెసింగ్, ప్యాకింగ్ యూనిట్లు. పసుపుతో పాటు స్థానిక ఇతర వ్యవసాయ ఉత్పత్తుల అనుబంధ పరిశ్రమలు కూడా ఏర్పాటయ్యే అవకాశం ఉంది. పసుపు బోర్డు ఏర్పాటుతో జిల్లాలో రవాణా సౌకర్యాలు, ప్రత్యేక గూడ్స్ రైళ్ల రాకపోకలు పెరగనున్నాయి. దీంతో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పారిశ్రామికంగా అభివృద్ధి చెందనుందని స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పసుపు బోర్డు కేంద్ర కార్యాలయం ఏర్పాటుతో యువతకు పెరగనున్న ఉద్యోగ, ఉపాధి అవకాశాలు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో జిల్లా వ్యాప్తంగా పసుపు రైతులు, బీజేపీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.