- గోదావరి, కావేరి అనుసంధానంపై చర్చించనున్న అధికారులు
హైదరాబాద్, వెలుగు: నదుల అనుసంధానంపై ఈ నెల 19న నేషనల్ వాటర్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎన్‌డబ్ల్యూడీఏ) స్పెషల్ కమిటీ మీటింగ్ నిర్వహించనుంది. కేంద్రం ప్రతిపాదించిన అన్ని నదుల అనుసంధాన ప్రాజెక్టులు ఎలాంటి అడ్డంకులు లేకుండా ముందుకు సాగుతున్నా.. గోదావరి, కావేరి లింక్‌పై మాత్రం చర్చలు ముందుకుసాగడం లేదు. ఆ ప్రాజెక్టులో భాగమైన అన్ని రాష్ట్రాలూ వారికి తోచిన డిమాండ్లు చేస్తుండటంతో, స్పెషల్ కమిటీ మీటింగ్‌ను నిర్వహించేందుకు గత సమావేశంలో ఎన్‌డబ్ల్యూడీఏ నిర్ణయించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో తాజాగా గురువారం ఈ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు ఎన్‌డబ్ల్యూడీఏ వెల్లడించింది. గోదావరి, కావేరి అనుసంధానంతో పాటు ఇతర నదుల అనుసంధానంపైనా మరోసారి చర్చించనున్నారు. ఈ సమావేశంలో ఆయా రాష్ట్రాల ఇరిగేషన్ మంత్రులు, సెక్రటరీలు పాల్గొననున్నారు. ఇచ్చంపల్లి వద్ద నిర్మించ తలపెట్టిన ఈ ప్రాజెక్టు నుంచి సగం వాటా ఇవ్వాలని ఇప్పటికే ఎన్‌డబ్ల్యూడీఏకి తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇరిగేషన్ నీటి కోసం కర్నాటక, దమనగంగ గోదావరి లింకింగ్‌పై మహారాష్ట్ర, ముంపు సమస్య తీర్చేలా ప్రాజెక్టు ఎత్తు తగ్గింపుపై ఒడిశా, పోలవరం నుంచి చేపట్టాలని ఏపీ పేచీలు పెట్టాయి.
ఇటు కేరళ, తమిళనాడు కూడా తమకు వాటాలు కావాలని అడుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే గురువారం నిర్వహించనున్న సమావేశంలో ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికార వర్గాలంటున్నాయి. ఇక, అదే రోజు యాన్యువల్ జనరల్ మీటింగ్‌నూ ఎన్‌డబ్ల్యూడీఏ నిర్వహించనుంది. వివిధ రాష్ట్రాల మంత్రులతో సమావేశం నిర్వహించనున్నారు. మరోవైపు, ఈ నెల 3న జరిగిన మీటింగ్‌కు సంబంధించిన మినిట్స్‌ను ఎన్‌డబ్ల్యూడీఏ విడుదల చేసింది.