బాధిత మహిళలకు అండగా ఉంటాం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ రహత్కర్

బాధిత మహిళలకు అండగా ఉంటాం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ రహత్కర్
  • వారికి హక్కులు, చట్టాలపై అవగాహన కల్పించాలి

హైదరాబాద్, వెలుగు: దేశంలోని మహిళలకు తాము అండగా నిలుస్తామని జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ రహత్కర్  అన్నారు. మహిళలకు తమకున్న హక్కులు, చట్టాలపై అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. కమిషన్ కు నిత్యం వేల సంఖ్యలో తమ సమస్యల పరిష్కారానికి మహిళలు దరఖాస్తులు చేస్తున్నారని తెలిపారు. సోమవారం బేగంపేటలోని టూరిజం ప్లాజాలో ఏర్పాటు చేసిన మహిళా జన్ సున్వాయి( బహిరంగ విచారణ)లో  చైర్ పర్సన్ విజయ రహత్కర్ పాల్గొని, పలు కేసులు పరిష్కరించారు. 

ఆమె మాట్లాడుతూ.. అన్ని రాష్ర్టాల రాజధానుల్లో  పబ్లిక్ హియరింగ్ కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. గృహహింస కేసులు, సైబర్ నేరాలు, ఆన్ లైన్ వేధింపుల కేసులు, చైల్డ్ కస్టడీ కేసులు, లైంగిక వేధింపులు, అత్యాచారాలు తదితర కేసులు కమిషన్ దృష్టికి వచ్చాయని వివరించారు.  హైదరాబాద్ పరిధిలో  2022 నుంచి 2024 మధ్య నమోదైన కేసుల్లో 30 కేసులను పరిష్కరించి బాధితులకు న్యాయం చేశామన్నారు.  

మహిళా బాధితులకు సంబంధించిన కేసుల్లో అశ్రద్ధ, నిర్లక్ష్యం చూపకుండా వేగంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్​పర్సన్ నేరేళ్ల శారద , మహిళా సంక్షేమ శాఖ డైరెక్టర్  కాంతి వెస్లీ, అడిషనల్  సీపీ విశ్వప్రసాద్ పాల్గొన్నారు.