జాతీయవాదమంటే మతవాదమా?

ఏ దేశంలోనైనా ప్రతి 25 సంవత్సరాలకు ఒక కొత్త తరం ఏర్పడుతుంది. వారి అవసరాలు, ఆశయాలు, అప్పటి పరిస్థితులకు అనుగుణంగా చట్టాలు మారుతూ ఉండాలి. కానీ మన దేశంలో 70 ఏండ్ల క్రితం ఏర్పరచుకున్న చట్టాలు, సిద్ధాంతాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇప్పటి తరానికి అనువుగా చట్టాలను మార్చకుండా పాత వాటినే కొనసాగించాలని అనుకోవడం సరికాదు. అందువల్ల ప్రజల అవసరాలకు అనుగుణంగా పరిపాలనలో మార్పులు రావాలి. ఈ దిశగా దేశాభివృద్ధికి, సమాజ శ్రేయస్సుకు పాటుపడే పార్టీలకు ప్రజల సపోర్ట్​ ఎప్పుడూ ఉంటుంది.

మనుగడ కోసం ప్రతిపక్షాల ఆరాటం

ఇటీవల దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికలు, బీహార్​ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన బీజేపీ రేసుగుర్రంలా దూసుకుపోతోంది. బీజేపీని అందుకోలేక ప్రతిపక్షాలు తమ మనుగడ కాపాడుకునేందుకు ఆరాటపడుతున్నాయి. గతంలో యూపీఏ కూటమిగా కాంగ్రెస్, లెఫ్ట్​ పార్టీలు, కొన్ని ప్రాంతీయ పార్టీలు వంతులవారీగా అధికారాన్ని పంచుకుని దేశాన్ని పాలించాయి. సమాజాన్ని వివిధ వర్గాలుగా, సంఘాలుగా విడదీసి వారి సంక్షేమమే తమ పరమావధిగా పేర్కొంటూ దేశ ప్రగతిని తుంగలో తొక్కి బ్రిటిష్​ వారి తరహాలో విభజించి పాలించు సిద్ధాంతంతో దేశ సమైక్యతను దెబ్బ తీసేందుకు ప్రయత్నించాయి. మతాల వారీగా, కులాల వారీగా దినసరి ఖర్చులకు, ధార్మిక యాత్రలకు ప్రభుత్వ ధనాన్ని ఖర్చు చేస్తున్నట్టు చెబుతూ మెజారిటీ నిధులతో తమ జేబులను నింపుకున్నాయి. బొగ్గు మొదలుకుని స్పెక్ట్రమ్​ వరకూ రకరకాల ఆర్థిక కుంభకోణాలకు, నేరాలకు పాల్పడి పీకల్లోతుల్లో మునిగిపోయాయి. ఆ నాడు ప్రభుత్వంలో ఉన్న చాలా మంది నాయకులు ఇప్పుడు బెయిల్​పై బయట తిరుగుతూ తమ మీడియా సంస్థల ద్వారా శ్రీరంగ నీతులు చెబుతున్నారు. మరికొంతమంది మానవ హక్కుల చట్టాల రక్షణ పేరుతో ఫైవ్​ స్టార్​ హోటల్​ సౌకర్యాలను అనుభవిస్తున్నారు.

జాతీయోద్యమ స్ఫూర్తిని దెబ్బ తీసే కుట్ర

మొదటిసారి అటల్​బిహారీ వాజ్​పేయి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో చాలా తక్కువ కాలం పనిచేసింది. ఆ తర్వాత కాలంలో సూడో సెక్యులరిజం ముసుగులో, శుత్రువు శత్రువు మిత్రుడనే సిద్ధాంతాలతో ప్రాంతీయ, తోక పార్టీలతో ఏర్పడిన ప్రభుత్వం గతి తప్పిన రాజకీయాలతో ఎక్కువ కాలం నిలవలేకపోయింది. మతపరంగా ఓట్లు వేయించుకుంటూ, జాతీయోద్యమ స్ఫూర్తిని, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగనిరతిని దెబ్బ తీసే ప్రయత్నాలు ఎక్కువగా సాగాయి. దాంతో దేశభక్తి గురించి మాట్లాడితే అవమానంగానూ, దేశ రక్షణపై ఆందోళన చెందితే తెలివితక్కువతనంగానూ మారింది. తమకు తెలియకుండానే తమ పక్కనున్న వారు కూడా తమకు శత్రువనే తలంపు ప్రజల్లో ఏర్పడి అనుమానం పెరిగిపోయింది. దీన్ని ఆసరాగా చేసుకుని ప్రాంతాలవారీగా రాజకీయ పార్టీలు ఏర్పడి అధికారం చేపట్టి తమ ఆస్తులకు రక్షణ ఏర్పాట్లు చేసుకున్నాయి.

మోడీ నాయకత్వంలో అవినీతి లేని పాలన

ఇటువంటి దశలో నరేంద్రమోడీ నాయకత్వంలో జాతీయ భావనే ముఖ్య ఉద్దేశంగా, నిష్పక్షపాత, సత్పరిపాలనే ధ్యేయంగా ఆత్మవిశ్వాసంతో ఎన్డీయే ప్రభుత్వం వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చింది. పాలనలో ఎక్కడా అవినీతి మరకలేని నిజాయితీ పాలన అందించడంతో దేశ ప్రజలకు ఎంతో ఊరట కలిగింది. ఆర్టికల్​ 370 రద్దుతో రావణ కాష్టంలా కాలుతున్న కాశ్మీర్​ సమస్య పరిష్కారానికి మార్గం సుగమమైంది. ట్రిపుల్​ తలాక్​ రద్దు, సిటిజన్​షిప్​ చట్టం, అయోధ్యలో రామాలయ నిర్మాణం ప్రారంభించడం, పాకిస్తాన్​పై సర్జికల్​ స్ట్రయిక్స్​ చేయడం, చైనా నక్కజిత్తులు చిత్తు చేసి తోక ముడిచేలా సైనిక చర్య తీసుకోవడం లాంటి నిర్ణయాలకు ప్రజలు పూర్తి మద్దతు తెలిపారు. కరోనా నేపథ్యంలో తీసుకున్న లాక్​డౌన్​ ప్రక్రియ వల్ల కోట్ల మంది విలువైన ప్రాణాలు కాపాడగలిగారు. వ్యాక్సిన్​ తయారీకి తీసుకున్న చర్యలు, ఆత్మనిర్భర్​ భారత్​ వంటి ఆర్థిక ఉద్దీపనలు ప్రజలను బీజేపీకి మరింత దగ్గర చేశాయి. దేశప్రజలకు సంబంధించిన విధివిధానాలను చట్టాలుగా చేసే దేవాలయం లాంటి కొత్త పార్లమెంట్​ భవనాన్ని ప్రారంభించడం ఎంతో సంతోషకరం. మోడీ సర్కారు నిర్ణయాలను ప్రజలు కూడా స్వాగతిస్తున్నారు.

పాత సిద్ధాంతాలను మార్చుకోవాలి

జాతీయవాదమే లక్ష్యంగా బీజేపీ పని చేయడం చీకటిలో కొట్టుమిట్టాడుతున్న ప్రజలకు ఒక కాంతి దీపంలా కనిపించింది. అందుకే ప్రజలందరూ దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి మోడీ సర్కార్​కు మద్దతు తెలుపుతున్నారు. ఇలాంటి సిద్ధాంతాలతో ఏ పార్టీ పనిచేసినా ప్రజల మద్దతు ఎప్పుడూ ఉంటుంది. ఇలా పని చేయకపోవడం వల్లే 150 ఏండ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్​ పార్టీ ఇప్పుడు నీరసించిపోయింది. జాతీయవాదానికి మతతత్వం అనే రంగు పులిమిన ప్రతి రాజకీయ పార్టీకి ఇలాంటి గతే పడుతుంది. ఇప్పటికైనా ప్రతిపక్షాలు తమ పాత సిద్ధాంతాలు, ఆలోచనలకు స్వస్తి చెప్పి నేటి సమాజానికి ఉపయోగపడే చట్టాలను రూపకల్పన చేయడంలో ప్రభుత్వానికి సహకరించి.. ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

కొత్త చట్టాలు రావాల్సిందే

ఇప్పుడు దేశంలోని అన్ని వర్గాల ప్రజల్లో ఆర్థికంగా, సామాజికంగా ఎన్నో మార్పులు వచ్చాయి. వాటిని దృష్టిలో పెట్టుకుని కొత్త చట్టాలు చేయడం ఎంతో అవసరం. ప్రస్తుతం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఆ దిశగా చర్యలను తీసుకుంటూ దేశాన్ని అభివృద్ధిపథంలో నడిపించటానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తోంది. ప్రధాని మోడీ అందిస్తున్న పాలనకు దేశంలోని వివిధ పార్టీలు కూడా మద్దతు తెలుపుతున్నాయి. అయితే దేశంలోని కొందరు సూడో మేధావులకు ఇది నచ్చడం లేదు. ధనిక వర్గాలకు వత్తాసు పలుకుతూ అర్థంపర్థం లేకుండా ప్రభుత్వాన్ని విమర్శించే వారిని బడుగు వర్గాల రక్షకులుగానూ, వీర యోధులుగానూ.. ప్రభుత్వానికి మద్దతు తెలిపే వారిని వెన్నెముక లేని పలాయనవాదులుగా వక్రభాష్యం చెబుతున్నారు.

– జన్నాభట్ల నరసింహ ప్రసాద్, నాగారం, కీసర మండలం, మేడ్చల్​ జిల్లా

For More News..

అమెరికాపై సైబర్ అటాక్స్..

కస్టమ్స్‌‌ ఆఫీసర్ల కస్టడీ నుంచి రూ.1.10 కోట్ల విలువైన బంగారం గాయబ్

కరోనా నాశనానికి.. 33 డిగ్రీలు.. 30 నిమిషాలు!

ఓఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అమ్మకానికి పీఎం ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌