జాతీయవాదం బలపడుతున్నది

మన దేశంలో మతాల మధ్య విభజనతో కుహనా సెక్యులర్  ప్రేరేపిత రాజకీయాలు నెరిపే స్థితి నుంచి నేడు వాస్తవాలను తెలియజేసి దేశానికి సర్వ ఆమోదయోగ్య నిర్ణయాలు జరుగుతున్నాయి. గతంలో కొన్ని అపోహలతో పక్కదారిలో ఆలోచించినవారు కూడా నేటి ప్రభుత్వ నిర్ణయాలను సమర్థిస్తున్నారు. వాటికి ‘పీఎఫ్ఐ’ పై నిషేధం విధించడమే ఉదాహరణ. ఆధారాలతో సహా ఎన్ఐఏ పీఎఫ్ఐ కుట్రలు తేటతెల్లం చేయడాన్ని దేశంలో చాలా మంది ఆహ్వానించ పరిణామంగానే చూస్తున్నారు. కుల, మత, జాతి, ప్రాంతాలకు అతీతంగా ‘జాతీయత వాదం’ వైపు మొగ్గు చూపుతున్న వారి సంఖ్య పెరుగుతున్నది. దేశం ప్రథమం అనే వైఖరిలో సర్వ మతాల ఆరాధకులకు ‘భారతీయత’ భావనలో మాధుర్యమైన భిన్నత్వంలో ఏకత్వం అనే సారాంశాన్ని ఆకళింపు చేసుకోవడం వల్ల సాధ్యం అయింది. ఈ మార్పుకు కారణం, వాస్తవాలను ‘సర్వ వ్యాప్తితో సర్వ స్పర్శి’ అనే ప్రాథమిక సూత్రంతో సున్నితమైన అంశాల్లో నిర్ణయం తీసుకొనేముందు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరే.  గతంలో పీఎఫ్ఐ పైన నిషేధం వంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఆయా వర్గాల నుంచి రాని ఆమోదం ఇప్పుడు వచ్చింది. కుహనా లౌకిక వాదుల ప్రచారం తప్పు అని గడిచిన 8 ఏండ్ల మోడీ పాలనలో తేలిపోయింది.

అంతర్గత ముప్పు

దేశంలో ప్రజా శాంతికి, మత సామరస్యానికి భంగం కలిగిస్తూ పీఎఫ్ఐ మిలిటెన్సీకి మద్దతు ఇస్తున్నట్లు ఎన్ఐఏ తేల్చింది. పీఏఫ్ఐ కార్యకర్తలు కొన్ని అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థల్లో చేరిన వాస్తవం సాక్ష్యాలతో సహా నిరూపించింది. పీఎఫ్ఐ అనేక క్రిమినల్, టెర్రరిస్ట్ కార్యకలాపాల్లోనూ పాలు పంచుకున్నది. దేశ సార్వభౌమాధికారం పట్ల పూర్తి అగౌరవాన్ని చూపుతున్నది. దేశం వెలుపలి నుంచి నిధులు, సైద్ధాంతిక మద్దతుతో దేశ అంతర్గత భద్రతకు అది పెను ముప్పుగా మారింది. పీఎఫ్ఐ దాని కేడర్ హింసాత్మక, విధ్వంసక చర్యల్లో పాల్గొన్న ఆధారాలు వివిధ కేసుల్లో అనేకం ఉన్నట్లు పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఇతర విశ్వాసాలను సమర్థించేవారిపైన పాశవికదాడులు, ప్రముఖ వ్యక్తులు, ప్రజా ఆస్తులు, స్థలాలను లక్ష్యంగా చేసుకుని విధ్వంసం చేయడానికి పేలుడు పదార్థాలను పొందడం వంటి కార్యక్రమాలు వెలుగులోకి వచ్చాయి. శాంతి భద్రతలకు భంగం కలిగించి బీభత్స వాతావరణాన్ని సృష్టించడం దానికి అలవాటే. కేంద్ర ప్రభుత్వం తక్షణమే దాని అరాచకాలకు అడ్డుకట్టవేయకపోతే, అనుబంధ సంస్థలు దేశంలో విధ్వంసాన్ని, అరాచకాన్ని సృష్టించే అవకాశాలు పెరిగేవి.

కొత్త ఆలోచనలు

జాతీయ వాదంతో సేవ చేస్తున్న ఆర్ఎస్ఎస్ ను దేశ వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించి నిషేధానికి గురైన సంస్థలతో పోలుస్తున్న కుహనా లౌకిక వాదులు ఒకటి గుర్తించాలి. గతానికి  భిన్నంగా  వాస్తవాలకు దగ్గరగా ముస్లిం మత పెద్దలు, అజ్మీర్ దర్గా పెద్దలు జాయ్నూల్ అబిదీన్ ఆలీ ఖాన్, కేరళలోని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, ఇతర అనేక మంది మైనారిటీ మేధావులు కేంద్రప్రభుత్వ నిర్ణయాన్ని ఆహ్వానించడం నూతన భారత ఆవిష్కరణకు నాంది. భవిష్యత్ మత ప్రాతిపదిక సంతుష్టీకరణ రాజకీయాలకు చెల్లుచీటి దిశగా దేశ అభివృద్ధి మాత్రమే ప్రాతిపదికగా ప్రజల ఆలోచనలు మొదలయ్యాయి.

ముస్లిం పెద్దలతో ఆర్ఎస్ఎస్​ చీఫ్ చర్చలు

ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఇప్పటికీ లాలూ ప్రసాద్ యాదవ్ వంటి వారు మైనార్టీలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా అకారణంగా ఆర్ఎస్ఎస్ ను నిషేధించాలనే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలకు కొన్ని రోజుల ముందే మతసామరస్యంతో సోదరులుగా భారతీయులందరూ కలిసిమెలిసి జీవించాలని ఆర్ఎస్ఎస్​ చీఫ్​ మోహన్ భగవత్ ప్రకటించారు. ఢిల్లీలో కస్తూర్బాగాంధీ మార్గ్ లో ప్రసిద్ధమైన మసీదులో ‘ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్’ పెద్దలు ఉమర్ అహ్మద్ ఇల్యాసీతో  కలిసి అనేక అంశాలపై చర్చలు జరపారు. మేధావులైన మాజీ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్, మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎస్.వై. ఖురేషీ, ఆలీఘడ్ ముస్లిం యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్, లెఫ్టినెంట్ జనరల్ జహీర్ ఉద్దీన్ షా,రాష్ట్రీయ లోక్ దళ్​ఉపాధ్యక్షులు షాహీద్ సిద్దిఖీ తదితరులతోనూ మాట్లాడి అనేక అంశాలపై అపోహలను తొలగించారు. పరస్పర విశ్వాసంతో చర్చించుకోవడం పరిశీలిస్తే ఎవరి నిబద్ధత ఏమిటో అర్థం చేసుకోవచ్చు. కాలం చెల్లిన లాలూ, దిగ్విజయ్ సింగ్, శశిథరూర్ లాంటి నేతలు ఇంకా కుహనా లౌకికవాదం పేర మైనార్టీల సంతుష్టీకరణ రాజకీయాలతో ఓటు బ్యాంకు కోసం ప్రయత్నిస్తున్నారు. కానీ నేడు వాస్తవాలు తెలుసుకుంటున్న మైనార్టీలు అలాంటి వారికి బుద్ధిచెప్పడానికి సిద్ధమవుతున్నారు. అందుకు ఎంతో సమయం పట్టదు. ప్రతి భారతీయుడి డీఎన్ఏ ఒక్కటే అని నమ్మే సంస్థను ఏవిధంగా ప్రజల మనసు నుంచి అసత్య ప్రచారంతో దూరం చేయగలరు?

పీఎఫ్ఐ ఓ విద్వేష సంస్థ

పాపులర్ ​ఫ్రంట్​ఆఫ్​ ఇండియా(పీఎఫ్ఐ)పై నిషేధం విధిస్తూ 27 సెప్టెంబర్ 2022 న కేంద్రహోం శాఖ  విడుదల చేసిన గెజిట్ పరిశీలిస్తే అనేక విషయాలు తెలుస్తాయి. నిషేధం విధించడానికి ముందు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) పీఎఫ్​ఐపై,  దాని ఉప సంస్థలపైన లోతుగా దర్యాప్తు చేసిన విషయం ఇక్కడ గమనించాలి. సమగ్రమైన సమాచారాన్ని అన్ని కోణాల నుంచి సేకరించినట్టు అర్థమవుతున్నది. యువత, విద్యార్థులు, మహిళలు తదితర సమాజంలోని బలహీన వర్గాలతో పీఎఫ్ఐ తన అనుబంధ సంస్థలను సృష్టించాలని చూస్తున్నది. దాని సభ్యత్వాన్ని విస్తరించాలనే ఏకైక లక్ష్యంతో దాని పరిధిని, నిధుల సేకరణ సామర్థ్యాన్ని పెంచుకుంటున్నదని తేలింది. పీఏఫ్ఐ దాని అనుబంధ సంస్థలు బహిరంగంగా సామాజిక, -ఆర్థిక, విద్య, రాజకీయ సంస్థగా సాగుతున్నది. కానీ వారు ఒక నిర్దిష్టమైన విధానంతో ఒక వర్గాన్ని ర్యాడికలైజ్ చేయడానికి రహస్య ఎజెండాను కొనసాగిస్తున్నట్లు తేలింది. పరిశోధనలో దేశ సమగ్రత, సార్వభౌమత్వం, భద్రతకు విఘాతం కలిగించే కార్యకలాపాల నిర్వహణలో పీఎఫ్ఐ దాని అనుబంధ సంస్థల మధ్య స్పష్టమైన సంబంధాలను కలిగి ఉన్నట్లు ఎన్ఐఏ గుర్తించింది. 

- లంకా దినకర్, సోషల్​ ఎనలిస్ట్