- గడియారం గుర్తును అజిత్ పవార్ ఉపయోగించుకోవచ్చని తీర్పు
న్యూఢిల్లీ: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) వ్యవస్థాపకుడు శరద్ పవార్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ గడియారం గుర్తును అజిత్ పవార్ వర్గం ఉపయోగించుకోవచ్చని తీర్పు చెప్పింది. గత ఏడాది జులైలో అజిత్ పవార్ ఎన్సీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలతో వేరు కుంపటి పెట్టారు. అనంతరం ఆయన డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. కొంతకాలం తర్వాత ఎన్నికల సంఘం ఎన్సీపీ గుర్తు గడియారంను అజిత్ పవార్ గ్రూపునకు కేటాయించింది.
శరద్ పవార్ వర్గాన్ని "నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ శరత్ చంద్ర పవార్" అని పిలుచుకోవడానికి, అలాగే ‘‘బూరుగ ఊదుతున్న వ్యక్తి’’ గుర్తును ఉపయోగించుకోవడానికి అనుమతించింది. అయితే, ఇది ఓటర్లను గందరగోళానికి గురిచేస్తుందని, అజిత్‌పవార్ వర్గానికి కొత్త గుర్తు ఇవ్వాలని లోక్‌సభ ఎన్నికలకు ముందు శరద్‌పవార్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్‌పై గురువారం జస్టిస్ లు సూర్యకాంత్, దీపాంకర్ దత్తా, ఉజ్జల్ భుయాన్ తో కూడిన బెంచ్ విచారణ చేపట్టింది.
గడియారం గుర్తును అజిత్ పవార్ వర్గమే ఉపయోగించుకోవచ్చని తీర్పు చెప్పింది. అయితే, గతంలో తాము ఇచ్చిన ఆదేశాలను అజిత్ పవార్ వర్గం పాటించాలని ఆదేశించింది. శరద్పవార్వర్గానికి ఎలాంటి ఇబ్బందికర పరిస్థితిని సృష్టించకూడదని సూచించింది. తమ ఆదేశాలను ఉల్లంఘిస్తే, సుమోటోగా తీసుకొని ధిక్కార చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.