![దేశవ్యాప్తంగా కులగణన చేయాలి: MP ఆర్.కృష్ణయ్య](https://static.v6velugu.com/uploads/2025/02/nationwide-caste-census-should-be-done_l6pBft7x0C.jpg)
- చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి: ఆర్.కృష్ణయ్య
- కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి
- పార్లమెంట్‌లో వెంటనే బీసీ బిల్లు పెట్టాలని డిమాండ్
- ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఓబీసీ నేషనల్ సెమినార్
న్యూఢిల్లీ, వెలుగు: పార్లమెంటులో వెంటనే బీసీ బిల్లు ప్రవేశపెట్టాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. అలాగే, దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు. దేశంలో 50 శాతానికి పైగా ఉన్న బీసీల కోసం ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో తాము డిమాండ్ చేస్తున్నామని గుర్తుచేశారు. గురువారం ఢిల్లీలోని ఏపీ/తెలంగాణ భవన్‌లోని గురజాడ కాన్ఫరెన్స్ హాల్‌లో ఓబీసీ నేషనల్ సెమినార్ జరిగింది.
ఈ సెమినార్‌కు బీసీ సంక్షేమ సంఘం నేతలు బోను దుర్గా నరేశ్, గుజ్జ కృష్ణ ఆధ్యక్షతన వహించారు. ఈ కాన్ఫరెన్స్‌కు ఎంపీలు ఆర్.కృష్ణయ్య, మల్లు రవి, ఈటల రాజేందర్, బీద మస్తాన్ రావు, పార్థసారథి, నాగరాజు, అంబిక, లక్ష్మీనారాయణ, పుట్ట మహేశ్ యాదవ్, ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. అలాగే 36 కుల సంఘాలు, 28 బీసీ సంఘాలు, 18 ఉద్యోగ సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ కాన్ఫరెన్స్‌లో భాగంగా 13 తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు.
76 ఏండ్లుగా అన్యాయం..
అన్ని రాజకీయ పార్టీలు బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారని ఆర్.కృష్ణయ్య మండిపడ్డారు. రాజ్యాధికారంలో వాటా ఇవ్వకుండా.. 76 ఏండ్లుగా బీసీలకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. జెండాలు మోసుకుంటూ, జిందాబాద్ నినాదాలు ఇచ్చేందుకు బీసీలను వాడుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, బీజేపీ బీసీ వర్గానికి చెందిన మోదీని ప్రధాన మంత్రిగా చేసిందన్నారు. ఇటీవల నలుగురు గవర్నర్లు బీసీ వర్గానికి చెందిన వారిని నియమించిందని చెప్పారు.
జాతీయ బీసీ కమిషన్‌కు రాజ్యాంగబద్ధ హోదా ఇచ్చారన్నారు. ఇక, బీసీలకు చట్ట భల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించి బీసీలకు సామాజిక న్యాయం కల్పించాల్సి ఉందని పేర్కొన్నారు. వీటితో పాటు దేశంలో వెనకబడిన ఓబీసీ వర్గాల కోసం కేంద్ర బడ్జెట్‌లో బీసీలకు రూ.51 వేల కోట్లు కేటాయించాలని కేంద్రాన్ని కోరారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఇటీవల చేపట్టిన కుల గణనను ఆర్.కృష్ణయ్యతో పాటు బీజేపీ ఎంపీలు తప్పుబట్టారు.