సంజయ్ యాత్రపై దేశమంతా చర్చ

కరీంనగర్, వెలుగు: వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ ని బంపర్ మెజార్టీతో గెలిపించాలని మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ హోటల్ లో మంగళవారం నిర్వహించిన బీజేపీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ సమావేశానికి శివరాజ్ సింగ్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశమంతా చర్చించుకునేలా పాదయాత్ర చేసిన లీడర్ బండి సంజయ్ అని కొనియాడారు. అలాంటి పోరాటయోధుడిని మళ్లీ గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 14%పైగా ఓట్లు వచ్చాయని.. పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య 8కి పెరిగిందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లోనూ రాష్ట్రంలో పదికిపైగా ఎంపీ సీట్లను గెలిపించి సత్తా చాటాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.  

శివరాజ్ సింగ్ పథకాలు భేష్: బండి సంజయ్ 

మధ్యప్రదేశ్ లో గొప్ప గొప్ప సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టినందునే శివరాజ్ సింగ్ చౌహాన్ సుదీర్ఘకాలం పాటు సీఎంగా ఉండగలిగారని బండి సంజయ్ అన్నారు. లాడ్లీ లక్ష్మీ యోజన, ముఖ్యమంత్రి కన్యాదాన్ యోజన, ముఖ్యమంత్రి తీర్థ దర్శన్ వంటి గొప్ప పథకాలతో మధ్యప్రదేశ్ మహిళల ఆదరణను శివరాజ్ సింగ్ పొందారన్నారు. అందుకే ఆ రాష్ట్రంలో బీజేపీ మరోసారి భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిందన్నారు. శివరాజ్ సింగ్ స్ఫూర్తితో ఇప్పుడు తెలంగాణలోనూ పార్టీ క్యాడర్ కష్టపడి పని చేయాలని,10కిపైగా ఎంపీ సీట్లను గెలుచుకోవాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, ఆరెపల్లి మోహన్, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల పార్టీ అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, ప్రతాప రామకృష్ణ, దూది శ్రీకాంత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమదేవి, జిల్లా ఇంచార్జీ మీసాల చంద్రయ్య పాల్గొన్నారు. 

కొండపలకలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర..  

మానకొండూరు నియోజకవర్గం కొండపలక గ్రామంలో నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమానికి శివరాజ్ సింగ్ చౌహాన్, బండి సంజయ్, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా శివరాజ్ సింగ్ మాట్లాడుతూ.. దేశంలోని మారుమూల ప్రజల్లోనూ మార్పు తీసుకురావడంతోపాటు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా ప్రయోజనం కల్పించడమే లక్ష్యంగా వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని ప్రధాని మోదీ ప్రభుత్వం చేపట్టిందన్నారు.