- ఈయూ మిషన్‌లో భాగంగా చెక్, పోలెండ్, స్లొవేకియా నేతల టూర్
- దేశమంతటా కొనసాగిన బాంబు దాడులు
కీవ్: ఉక్రెయిన్‌కు మద్దతుగా యూరోపియన్ యూనియన్ కీలక నిర్ణయం తీసుకుంది. రష్యా ఆక్రమణలో చిక్కుకున్న ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు నాటో సభ్య దేశాలైన చెక్ రిపబ్లిక్, స్లొవేకియా, పోలెండ్ లీడర్లను మంగళవారం పంపాలని నిర్ణయించింది. ఉక్రెయిన్ స్వేచ్ఛ, స్వాతంత్ర్యం విషయంలో ఈయూ మద్దతును తెలియజేయడమే తమ పర్యటన లక్ష్యమని చెక్ ప్రధాన మంత్రి పీటర్ ఫియాలా ట్వీట్ చేశారు. ఈయూ మిషన్‌లో భాగంగా ఆయనతోపాటు స్లొవేకియా ప్రధాని జానెజ్ జాన్సా, పోలెండ్ ప్రధాని మాటెయుస్జ్ మొరావీకి, పోలెండ్ డిప్యూటీ ప్రధాని జార్‌స్లా కక్జిన్‌స్కీ తదితరులు వెళ్లనున్నారు. కీవ్‌ను రష్యా చుట్టుముట్టిన నేపథ్యంలో వీరి పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇండ్లపై వైమానిక దాడులు
సెంట్రల్ కీవ్‌లోని ఇండ్లపై రష్యా సైన్యం వరుసగా వైమానిక దాడులు చేసింది. మంగళవారం తెల్లవారకముందే.. భారీగా బాంబు పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. రష్యన్లు ఆర్టిలరీ స్ట్రైక్స్ చేస్తున్నారని ఉక్రెయిన్ ఆఫీసర్లు చెప్పారు. 15 అంతస్తుల బిల్డింగ్‌పై షెల్లింగ్ జరపడంతో కనీసం ఒకరు చనిపోయారని, పదుల సంఖ్యలో గాయపడ్డారని తెలిపారు. బిల్డింగ్‌లో మంటలు అంటుకున్నాయని, చాలా మంది శిథిలాల కింద చిక్కుకున్నారని, వారిని కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నట్లు వెల్లడించారు. కీవ్‌లో విమానాలను తయారు చేసే ఆంటొనోవ్ ఫ్యాక్టరీపై రష్యన్లు బాంబు దాడులు చేశారని, దీంతో భారీ స్థాయిలో మంటలు చెలరేగాయని, ఇద్దరు చనిపోయారని ఆఫీసర్లు వెల్లడించారు. మికోలైవ్, చెర్నిహివ్, ఖెర్సన్ తదితర ఏరియాల్లోనూ ఎయిర్‌స్ట్రైక్స్ కొనసాగాయి. ఇర్పిన్, హోస్టోమెల్, బుచా తదితర ఏరియాల్లో సోమవారం రాత్రి నుంచి దాడులు మరింత పెరిగాయని కీవ్ రీజియన్ హెడ్ ఒలెక్సీ కులేబా చెప్పారు.
నాలుగో విడత చర్చలు
రష్యా, ఉక్రెయిన్ ప్రతినిధుల మధ్య చర్చలు మళ్లీ మొదలయ్యాయి. నాలుగో విడుత చర్చలు సోమవారం వర్చువల్‌గా ప్రారంభం కాగా, కొన్నిగంటలపాటు జరిగాయి. కానీ ఏ నిర్ణయం తీసుకోకపోవడంతో మంగళవారానికి ‘టెక్నికల్’ వాయిదా వేశారు.
మంటల్లో మరియుపోల్
ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రలో నిలువెల్లా గాయపడింది మరియుపోల్. ఉక్రెయిన్‌లో ఎక్కువ విధ్వంసం జరిగింది ఈ సిటీలోనే. ఇప్పటికీ అక్కడ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. మరియుపోల్ మంటల్లోనే ఉంది. వరుస బాంబు దాడులతో కేవలం ఈ ఒక్క నగరంలోనే 2,200 మంది పౌరులు చనిపోయారని ఉక్రెయిన్ చెబుతోంది. మరో 4 లక్షల మందికి పైగా స్థానికులు నీళ్లు, బువ్వ, కరెంటు లేక అష్టకష్టాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో రష్యా దాడులకు సంబంధించిన శాటిలైట్ ఇమేజీలను మాక్సర్ టెక్నాలజీస్ సంస్థ రిలీజ్ చేసింది. మరియుపోల్ సిటీలో చాలా చోట్ల మంటలు చెలరేగుతుండటం, పలు చోట్ల దట్టమైన పొగలు కమ్ముకోవడం, పెద్దపెద్ద బిల్డింగులు కూలిపోయి ఉండటం వాటిలో కనిపించింది. కీవ్‌కు దగ్గర్లోని మోస్చున్ టౌన్‌లోనూ ఇదే పరిస్థితి. చాలా ఇండ్లు,
బిల్డింగులు దెబ్బతిన్నాయి.
కీవ్‌లో కర్ఫ్యూ
కీవ్‌లో 36 గంటల కర్ఫ్యూ విధించారు. మంగళవారం రాత్రి 8 గంటల నుంచి గురువారం ఉదయం 7 గంటల దాకా ఈ ఆంక్షలు కొనసాగనున్నాయి. ఈ సమయంలో బయట ఎవరూ తిరగడానికి అనుమతి లేదు. రష్యా దాడులు తీవ్రం కావడంతో ఆఫీసర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు చాలా కష్టమైనది, ప్రమాదకరమైనదని మేయర్ క్లిట్స్‌చ్కో అన్నారు. రెండు రోజులూ ఇండ్లు, షెల్టర్లలోనే ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఉక్రెయిన్‌కు ఆయుధాలిస్తం: బైడెన్
వాషింగ్టన్: రష్యా దాడులతో సతమతమవుతున్న ఉక్రెయిన్‌కు అండగా నిలుస్తామని అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ స్పష్టం చేశారు. రష్యాను నిలువరించేందుకు ఆయుధాలను అందజేస్తామని ప్రకటించారు. ఉక్రెయిన్ ప్రజల ప్రాణాలను కాపాడేందుకు డబ్బు, ఆహారం పంపించడంతో పాటు అక్కడి నుంచి వచ్చే శరణార్థులను అక్కున చేర్చుకుంటామని బైడెన్ స్పష్టం చేశారు. కిందటేడాది ఉక్రెయిన్‌కు 1.2 బిలియన్డాలర్ల రక్షణ సాయం చేసినట్లు వివరించారు.