పర్యావరణ విధ్వంసం.. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కీలక అంశం. మొన్నటి కరోనా.. నిన్నటి ఉత్తరాఖండ్ విలయం ఇవన్నీ మనుషుల ప్రాణాలను తీస్తున్నవే. అభివృద్ధి పాట పాడే ప్రభుత్వాలు, అవినీతి, అక్రమాలకు అలవాటుపడ్డ రాజకీయ నాయకులు, కార్పొరేట్లకు పర్యావరణం గురించి పట్టడం లేదు. దీంతో మనుషుల ప్రాణాలకు విలువ లేకుండా పోతోంది. గత అనుభవాల నుంచి మనిషి గుణపాఠాలు నేర్చుకోవడం లేదు.
పకృతి సహజంగా ఇచ్చిన అందాలను మనుషులు చేతులారా నాశనం చేస్తున్నాడు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రయత్నించకుండా దాని చేదు ఫలితాలను, పర్యవసానాలను చవిచూస్తున్నాడు. ఇక అభివృద్ధి పేరు మీద చేస్తున్న విధ్వంసం గురించి చెప్పడానికే వీలు లేకుండా ఉంది. ఉత్తరాఖండ్ లోని చమోలి జిల్లాలో ఈ నెల 7న జరిగిన జల విలయం ఇదే విషయాన్ని వేలెత్తి చూపుతున్నది. రిషి గంగ వద్ద నిర్మాణం పూర్తి చేసుకున్న11 మెగా వాట్ల హైడల్ పవర్ ప్రాజెక్ట్ తనతోపాటు అందులో పని చేస్తున్న ఉద్యోగులను తీసుకుని మునిగింది. ప్రాజెక్టు పూర్తిగా ధ్వంసం అయిపోయింది. దీని కింద నిర్మాణంలో ఉన్న 530 మెగావాట్ల ఎన్టీపీసీకి చెంది న పవర్ ప్రాజెక్ట్ కూడా ధ్వంసం అయింది. ఈ ప్రమాదం రిషి గంగలో మంచు శిఖరం పగలడం వల్ల జరిగింది. ఐస్ లాగ గడ్డ కట్టిన నదిలో వాతావరణంలో వేడి పెరిగి ఈ విలయం జరిగిందని ఎన్విరాన్‌మెంట్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. మొత్తం 250 మీటర్ల టన్నెల్ అంటే పొడవైన సొరంగాల్లో 200 మంది ఉద్యోగులు ఇరుక్కుపోయారు. 16 మందిని రెస్క్యూ టీంలు రక్షించాయి. 16 వరకు శవాలను వెలికి తీశాయి. మరో 175 మంది ఆచూకీ తెలియ లేదు. ఇంకా రెస్క్యూ పనులు సాగుతున్నాయి. ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.4 లక్షలు.. గాయపడ్డ వారికి రూ.50 వేల నష్ట పరిహారం ప్రకటించింది.
2013లోనూ ఇదే తరహాలో
2013లో ఇదే ఉత్తరాఖండ్ లో జరిగిన కేదార్‌నాథ్ సంఘటన నుంచి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏమి నేర్చుకుందనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. అప్పుడు కూడా మెరుపు వరదలు వచ్చి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. వేల కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. ఇలాంటి ఘటనలు జరగడం, అప్పటి కప్పుడు ఏవో చర్యలను ప్రభుత్వాలు ప్రకటించడం కామన్‌గా మారింది. ఆ తర్వాత వాటి గురించి ఎవరూ పట్టించుకోవడం లేదనేది తాజా ఘటన చెబుతున్న సత్యం. ఎప్పటికప్పుడు ప్రజలకు విశ్వాసం కలిగించే విధంగా తీసుకునే చర్యల గురించి ప్రభుత్వాలు, అధికారులు చర్చిస్తారు. అయితే వాటిని ఆచరణలో పెట్టడం మాత్రం ఉండదు.
గుట్టలను, అడవిని నాశనం చేస్తున్నరు
ధౌలీ నది పైన నిర్మించిన హైడల్ ప్రాజెక్ట్ కింద ఎన్టీపీసీ తన ప్రాజెక్టు కడుతున్నది. దీన్ని తపోవన్‌గా పిలుస్తున్నాDhauliganga Riverరు. ఈ డిజాస్టర్ వల్ల 15 గ్రామాల్లో ఆందోళన చెలరేగింది. గ్రామాలకు గ్రామాలు నదిలో మునిగిపోయాయి. ఏడు వరకు బ్రిడ్జీలు కొట్టుకుపోయాయి. వాస్తవానికి బఫర్ జోన్ లో ఈ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారు. రేణిగావ్ గ్రామవాసులు హైడల్ ప్రాజెక్ట్ ను వ్యతిరేకిస్తూ ఎన్నో రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. అయితే వాటిని పట్టించుకోకుండా ప్రాజెక్టు నిర్మాణాన్ని కొనసాగించారు. పర్యావరణ పరిరక్షణ సంస్థలు.. పర్యావరణ ప్రేమికులు కూడా దీనిని వ్యతిరేకించారు. అయినా ప్రాజెక్టు పని మాత్రం ఆగలేదు. 2013 లో ఈ ప్రాజెక్ట్ నిర్మాణదారుడు సొరంగంలో ఇరుక్కుని మరణించాడు. కొద్దికాలం పాటు ఆగిన పనులు, మరో కొత్తవారికి కేటాయించడంతో తిరిగి ప్రారంభం అయ్యాయి. ఈ ప్రాజెక్టు కోసం వేలాదిగా చెట్లను నరికి వేశారు. పదుల సంఖ్యలో అందమైన గుట్టలను ధ్వంసం చేశారు. ఒకవిధంగా చెప్పాలంటే పర్యావరణాన్ని కాపాడుతున్న గుట్టలను, అడవిని నాశనం చేసి ప్రాజెక్టులు కడుతున్నారు.
గతం నుంచి ఏమీ నేర్చుకోవడం లేదు
కేదార్‌నాథ్ ట్రాజెడీ నుంచి ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఏమీ నేర్చుకున్నట్లు కనిపించడం లేదు. ఈ ప్రాంతంలో గతంలో కలపతో ఇండ్ల నిర్మాణం చేపట్టేవారు. కానీ ఇటీవల కాలంలో కలప ఇండ్ల స్థానంలో కాంక్రీట్ ఇండ్ల నిర్మాణం పెరిగింది. మరోవైపు స్థానిక అవసరాల కోసం గుట్టల బ్లాస్టింగ్‌లు విపరీతంగా పెరిగాయి. పర్యావరణ మార్పుల కారణంగా స్నో ఫాల్ సైతం తగ్గింది. హిమాచల్‌ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ లోనూ ఇదే పరిస్థితి ఉంది. అక్కడ కూడా ఇలాగే ప్రాజెక్టులు కడుతున్నారు. 2013లో కేదార్‌నాథ్ సంఘటన తర్వాత ఒక కమిటీ వేయగా ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్స్‌పర్ట్స్ 25 అంశాలపై సిఫారసులు అందజేశారు. ఇందులో గ్రేసియర్ బర్న్‌కు సంబంధించి మ్యాప్.. ట్రాకింగ్.. అంశాలు తెలుసుకునేలా సూచనలు చేశారు. స్నో ఫాల్ ఎంత.. ఎన్ని లేయర్ల గ్రేసియర్ ఉంది. ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయి లాంటి అంశాలు ఇందులో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్‌పర్ట్స్ కమిటీ చేసిన కొన్ని సూచనలను అమలు చేసినప్పటికీ వాటిని పూర్తి స్థాయిలో మానిటరింగ్ చేయలేదు. అసలు వీటన్నింటినీ పక్కన పెట్టిన కారణం వల్లే కావచ్చు ప్రమాదాలు నిరంతరంగా జరగడం మాత్రం తగ్గడం లేదు.
అడవుల నరికివేత ఆపాలి
అభివృద్ధి పేరిట అడవిని నరికేసి గుట్టలను ధ్వంసం చేసే విధానానికి ఇకనైనా స్వస్తి చెప్పాలి. అడవులను, గుట్టలను ధ్వంసం చేయడం మానేసి వాటిని మరింత విస్తరించే ప్రయత్నం చేయాలి. అప్పుడే సమస్య పరిష్కారం అవుతుంది. అయితే దీని కోసం వేర్ల లోతు వరకు వెళ్లాల్సిందే. ఒక ఆపద వచ్చిన తర్వాత దానిపై యాగీ చేసే బదులు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించి ఆపదలు రాకుండా చూసేలా నిర్ణయాలు తీసుకోవాలి. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చూసేందుకు ప్రభుత్వం వెంటనే కృషి చేయాలి. దానికి తగ్గట్టుగా చర్యలు చేపట్టాలి. అలాగే పర్యావరణాన్ని సైతం కాపాడుకోవాలి. అడవిని, గుట్టలను కాంక్రీట్ జంగిల్ చేయ వద్దు. జల్ జమిన్ జంగల్ పహాడ్ లను కాపాడుకుందాం. ఆపద చెప్పిరాదు.. పర్యావరణ విధ్వంసం వల్ల కలిగే ఆపద కూడా అంతే.. హిమాలయాల్లోని మధ్య భూభాగంలో ఉత్తరాఖండ్ ఉంది. ఇక్కడి నుంచే పర్యావరణ పరిరక్షణ మొదలు కావాలి. గుట్టలను చెట్లను కొల్లగొట్టడంపై నిషేధం ఇక్కడి నుంచే ప్రారంభం అవ్వాలి. అప్పుడే అడవులకే కాదు మనుషుల ప్రాణాలకూ
రక్షణ దొరుకుతుంది.
బఫర్ జోన్లలో ప్రాజెక్టులు కడుతున్నరు
తమ రాజకీయ అస్థిత్వం కోసం.. అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం బఫర్ జోన్లలో ప్రాజెక్టులు కడుతున్నారు. మానవ వినాశనం జరుగుతున్నప్పటికీ ఇవి అవసరమా? అనే విషయాన్ని ఆలోచించకపోతే.. మానవుడి మీద ప్రకృతి పగ తీర్చుకోవడానికి నిరంతరం సిద్ధంగా ఉంటుంది. మన దేశంలోని పొలిటికల్ సిస్టమ్, అభివృద్ధి విలువ మనులు ఫ్రాణాలుగా మారింది. ఉత్తరాఖండ్ లో తాజా డిజాస్టర్ ఇదే విషయాన్ని చెప్పకనే చెబుతోంది. ఈ విలయంలో ఎంత మంది చనిపోయారనే దానికి సంబంధించి పక్కా సమాచారం కూడా అధికారుల వద్ద లేదు. రికార్డులు కూడా మునిగిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో ఇంటికిరాని, చేరని వారు, డ్యూటీకి వెళ్లి తిరిగి రాని వారి కుటుంబాల నుంచి వివరాలు తెలుసుకుంటున్నారు. ఈ విలయం వల్ల ప్రాజెక్టుల చుట్టూ నివసిస్తున్న వారి గోస వర్ణనాతీతంగా ఉంది.
– ఎండీ మునీర్, సీనియర్ జర్నలిస్ట్
For More News..