మనిషి సృష్టించిన మార్పులతోనే ప్రకృతి విపత్తులు

మనిషి సృష్టించిన మార్పులతోనే ప్రకృతి విపత్తులు

ప్రస్తుత దశాబ్దంలో, గత దశాబ్దాలతో పోల్చినప్పుడు ప్రకృతి వైపరీత్యాలు గణనీయంగా పెరిగాయి. ఈ దశాబ్దంలో అధిక ఉష్ణోగ్రతలు, తీవ్రమైన వరదలు, కరువులు, తుపానులు వంటి విపత్తులు ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకున్నాయి. ఇది ప్రపంచ వ్యాప్తంగా కేవలం ప్రకృతి శక్తుల ప్రభావం మాత్రమే కాకుండా, మనిషి సృష్టించిన మార్పుల కారణంగా కూడా అవుతున్నాయి.

ఈ దశాబ్దంలో వాతావరణ మార్పులు ప్రకృతి వైపరీత్యాలకు ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. పారిశ్రామిక విప్లవం తర్వాత నుంచి, గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాలు గణనీయంగా పెరిగాయి. దీంతో భూగోళం యొక్క ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. 2020- – 30 మధ్యకాలం, ప్రపంచంలోని చాలా దేశాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తుంది. ఉదాహరణకు, 2023లో ప్రపంచంలోని అనేక దేశాలు రికార్డు స్థాయి వడగాల్పులను ఎదుర్కొన్నాయి. తీవ్రమైన వరదలు, తుఫానులు ప్రభావితం చేస్తున్నాయి.

కరుగుతున్న మంచు వలయాలు

ఈ దశాబ్దంలో గ్రీన్​లాండ్, అంటార్కిటికా మంచు వలయాలు వేగంగా కరుగుతున్నాయి. ఇది సముద్ర మట్టాలు పెరుగుదలకు దారితీస్తోంది. దాంతో తీరప్రాంతాల్లోని నగరాలు భారీ వరదల బారిన పడుతున్నాయి. ఉదాహరణకు, పాకిస్తాన్, చైనాలో 2022లో జరిగిన వరదలు గత దశాబ్దాలతో పోలిస్తే తీవ్రంగా నమోదు అయ్యాయి. ఇంకా అట్లాంటిక్, పసిఫిక్ మహాసముద్రాల్లో ఏర్పడిన తుఫానులు వాటి విధ్వంసక రీతి, మునుపటి దశాబ్దాల కంటే
 తీవ్రంగా వుంది.

నాశనమవుతున్న అమెజాన్​ అడవులు

ప్రస్తుత దశాబ్దంలో కరువు కూడా విపరీతంగా పెరిగింది. కొన్ని ప్రాంతాల్లో వర్షపాతం తక్కువగా ఉండడం వల్ల ఆర్థిక సంక్షోభం కూడా ఏర్పడుతోంది. ఆఫ్రికా ఖండంలో ఉన్న సాహెల్ ప్రాంతం తీవ్రంగా కరువు బారిన పడింది. అక్కడ ప్రజలు ఆహార కొరతతో బాధపడుతున్నారు. అమెజాన్ అడవుల నాశనం జరిగింది.  ప్రపంచంలోని అతి పెద్ద అరణ్యం అయిన అమెజాన్ ఇటీవల కాలంలో అతి పెద్ద అగ్నిప్రమాదాలకు గురైంది. అడవుల నాశనం వాతావరణంపై నేరుగా ప్రభావం చూపుతుండటం, ఆక్సిజన్ ఉత్పత్తి తగ్గడం వంటి సమస్యలను ఈ దశాబ్దంలో అధికంగా చూశాం.  

సీఓపీ సదస్సు

వాతావరణ మార్పులను నియంత్రించడానికి కర్బన ఉద్గారాలను తగ్గించడం, పునరుత్పాదక శక్తులపై దృష్టి పెట్టడం వంటి పరిష్కార మార్గాలను అనుసరించాలి. అంతర్జాతీయస్థాయిలో అనేక దేశాలు సీఓపీ26 వంటి సదస్సుల్లో తమ లక్ష్యాలను వెల్లడించాయి. సీఓపీ26 అంటే 26వ వాతావరణ మార్పుల సదస్సు అనే అర్థం. ఇది 2021 నవంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో స్కాట్లాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని గ్లాస్గో నగరంలో జరిగింది. ఈ సదస్సు ‘ యునైటెడ్​ నేషన్స్​ ఫ్రేమ్​వర్క్​ కన్వెన్షన్ ఆన్​ క్లైమెట్​ చేంజ్’ ఆధ్వర్యంలో జరిగింది.

సీఓపీ26 ముఖ్య లక్ష్యాలేమిటంటే..

 సీఓపీ26  ప్రధాన లక్ష్యం పారిస్ ఒప్పందం కింద ఉన్న లక్ష్యాలను సాధించడమే. ప్రపంచ ఉష్ణోగ్రత పెరుగుదలను 1.5ఓసీ లోపల పరిమితం చేయడం, ప్రపంచం పారిస్ ఒప్పందంలో నిర్ణయించినట్లుగా, పరిశ్రమల ప్రాప్తికి ముందు స్థాయితో పోల్చి భూగోళం ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్ లోపల పెరగకుండా నిరోధించేందుకు చర్యలు తీసుకోవాలి. వాతావరణ మార్పుల ప్రభావాలను పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎక్కువగా ఎదుర్కొంటున్నాయి. వీటికి తగినంత నిధులను కేటాయించి, వారికి అవసరమైన సాంకేతిక సహాయం అందించడమే లక్ష్యం.

ప్రతిపాదనలు

అడవుల పరిరక్షణ చేపట్టాలని నిర్ణయించాయి.100కి పైగా దేశాలు 2030 నాటికి అడవుల నాశనాన్ని ఆపడానికి అంగీకరించాయి. ఈ ఒప్పందం ద్వారా అడవుల అభివృద్ధి, పునరుద్ధరణకు ప్రాధాన్యం ఇవ్వబడింది. బొగ్గు  పై పరిమితి విధించుకోవాలనుకున్నాయి. 40కి పైగా దేశాలు కర్బన ఉద్గారాలకు ప్రధాన కారణమైన బొగ్గు వాడకాన్ని తగ్గించాలని ప్రతిపాదించాయి. 

పునరుత్పాదక శక్తులకు మరింత నిధుల కేటాయింపు, పరిరక్షణ పథకాలను వేగవంతం చేయడం. COP26 విజయవంతంగా ముగిసినప్పటికీ, ఈ సదస్సుపై కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. అభివృద్ధి చెందిన దేశాలు, పేద దేశాలకు అవసరమైన విధంగా సహాయం చేయడంలో విఫలమయ్యాయని విమర్శలు వచ్చాయి. ఇంకా, కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను అమలు చేయడంలో రాజకీయాలు జోక్యం చేసుకున్నాయనే అభిప్రాయాలు ఉన్నాయి.

- డా. చిట్యాల రవీందర్