విశ్లేషణ: రైతు మెడపై విపత్తుల కత్తి

ఆరుగాలం కష్టపడి వ్యవసాయం చేసే రైతు మెడపై విపత్తుల కత్తి ఎప్పుడూ వేలాడుతూనే ఉంటోంది. ఏటా వ్యవసాయ రంగంపై ప్రకృతి వైపరీత్యాల ప్రభావం పెరిగిపోతూనే ఉంది. మారిన కాల పరిస్థితులు, రుతుపవనాల కారణంగా అకాల వర్షాలు, వడగళ్ల వానలు, ఇతర ప్రకృతి విపత్తులు రైతులను నిండా ముంచుతున్నాయి. ఇటీవల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​లలో అకాల వర్షాల కారణంగా లక్షలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. పెట్టుబడి కోసం తెచ్చిన అప్పులు తీర్చలేక ఎంతో మంది రైతులు లబోదిబోమంటున్నారు. మరికొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రైతులకు పరిహారం చెల్లించాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. కానీ, రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎటువంటి బీమా పథకాన్నీ అమలు చేయడం లేదు. కేంద్రం అమలు చేస్తున్న ఫసల్​ బీమా యోజనను కూడా రాష్ట్రంలో వర్తింపజేయడం లేదు. దీంతో పంట నష్టపోయిన రైతులకు ఎటువంటి పరిహారం అందక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు.

వ్యవసాయం గిట్టుబాటు కాక చాలా మంది రైతులు తమ భూములను పడావు పెట్టడమో లేదంటే కౌలుదారుకు అప్పగించి దూరంగా పోయి బతకడమో చేస్తున్నారు. భూమి సొంతదారుడైనా, కౌలుదారుడైనా పంట పండితేనే రైతు సంతోషంగా ఉంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఏ పంట పండించాలన్నది రైతుకు తట్టడం లేదు. తడి పంట పండించినా, మెట్ట పంట పండించినా రైతులు నష్టపోతున్నారు. పంట పండితే కొనేవాడు లేడు, కొనేవాడు ఉంటే గిట్టుబాటు ధర లేదు, ఇదీ వరి పండించిన రైతుల పరిస్థితి. ఇక మెట్ట పంట పండిస్తే కోతుల బెడద రైతులను ఇబ్బందులకు గురిచేస్తోంది. వీటికి తోడు విపత్తుల చీడ, వ్యవస్థాగత లోపాలు రైతన్నలకు ఊపిరి ఆడనీయడం లేదు. భారీ వర్షాలు, తెగుళ్ల తాకిడికి వారి జీవితాల్లో చీకట్లు అలుముకుంటున్నాయి. ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా మొత్తంగా లక్షల ఎకరాల్లో మిర్చి, వరి, వేరుశనగ, మినుములు, మొక్కజొన్న, మామిడి వంటి పంటలకు నష్టం జరిగినట్లు వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ఇందులో ఒక్క మిర్చి పంటకే 50 వేల ఎకరాలకుపైగా నష్టం జరిగినట్లు తెలుస్తోంది. పెద్ద ఎత్తున నష్టం జరిగి దీన స్థితిలో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో రైతును ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది.

పంట నష్టం వివరాల సేకరణలో నిర్లక్ష్యం

2021లో దేశవ్యాప్తంగా ప్రకృతి వైపరీత్యాల కారణంగా 1.24 కోట్ల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. అధిక వర్షాలు, అకాల వర్షాలు, తుపానులు, వరదలు, వడగళ్ల వాన తదితర కారణాల వల్ల కలిగిన నష్టాలను గుర్తించడంలో వ్యవసాయ శాఖ అధికారుల అలసత్వం కారణంగా రైతులకు పంట నష్టపరిహారం అందకుండా పోయింది. రైతాంగం ఎంత మొర పెట్టుకున్నా క్షేత్రస్థాయిలో చాలాచోట్ల వివరాల సేకరణకు అధికార యంత్రాంగం మొండికేస్తోంది. దీంతో బాధితులకు అందాల్సిన తక్షణ సాయానికి గండి పడుతోంది. పంట నష్టం జరిగినప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలించి, నష్టపరిహారాన్ని అంచనా వేసి, రైతుల వారీగా వివరాలు సేకరించాల్సి ఉన్నా అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. పంట నష్టపోయినప్పుడు రైతన్నలను మానవతా దృక్పథంతో ఆదుకోవడం ప్రభుత్వాల కనీస బాధ్యత అని రాష్ట్ర హైకోర్టు స్పష్టం చేసింది.ఆర్థికంగా నష్టపోతున్న చిన్న, 
సన్నకారు రైతులకు పరిహారం అందించాలని సూచించింది. 

రైతులకు ముందస్తు హెచ్చరికలు లేవు

ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు రైతులు ముందస్తు చర్యలు చేపట్టడానికి వీలుగా వాతావరణ శాఖ గానీ, ప్రభుత్వ పరంగా గానీ సరైన సూచనలు అందడం లేదు. దీంతో ముందస్తు చర్యలు లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. పంటలకు బీమా రక్షణ కల్పిస్తామని గతంలో ప్రభుత్వాలు ప్రకటించాయి. 2016, 2017లో దేశవ్యాప్తంగా సాగు భూమిలో 28.33 శాతంగా బీమా పరిధిలో ఉంటే.. 2019–20 నాటికి అది 24.80 శాతానికి తగ్గిపోయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. 2016 నుంచి 2021 మధ్య ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన(పీఎంఎఫ్ బీవై), వాతావరణం ఆధారిత పంటల బీమా పథకం(ఆర్​డబ్ల్యూబీసీఐఎస్) కింద బాధితులకు అందాల్సిన రూ.3,381 కోట్లు ఇంకా పెండింగ్​లోనే ఉన్నాయి. 2017 నుంచి 2020 మధ్య బీమా కంపెనీలు రిజెక్ట్ చేసిన పీఎంఎఫ్​బీవై క్లైమ్ ల సంఖ్య పది రెట్లు పెరిగింది. పంటల బీమా అమలులో పారదర్శకత లేమిని గతంలోనే పార్లమెంటరీ స్థాయి సంఘం ఎత్తిచూపింది. ఆయా పథకాలకు కేటాయింపులు ఇతోధికంగా రైతులకు గరిష్ట లబ్ధిని చేకూర్చాలని సూచించింది. ప్రతి ఏటా విపత్తుల కారణంగా గాలిలో దీపాలవుతున్న రైతుల జీవితాలకు బీమాతో ధీమా కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. పంటల బీమా పైకం చెల్లించలేక రైతులు ఇబ్బందిపడుతున్న సమయంలో ప్రభుత్వమే అన్ని రకాల పంటలకు బీమా చెల్లించాల్సిన అవసరం ఉంది. దేశంలో ఆహారభద్రతకు రైతు శ్రేయస్సే పునాది. అందుకుగాను అన్ని ప్రాంతాలకు, అన్ని పంటలకూ వర్తించేలా పంటల బీమాను బలోపేతం చేయాలన్న స్వామినాథన్ కమిటీ సిఫార్సులకు ఆచరణ రూపం ఇవ్వడం అత్యవసరం. 

ఉమ్మడి ప్రణాళిక ఉండాలె

ఆరుతడి పంటలు ఎక్కువగా పండించాలని రైతులకు ఆశ ఉన్నప్పటికీ సరిపోను విత్తనాలు దొరకక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రభుత్వ పరంగా విత్తన విక్రయ కేంద్రాలు లేకపోవడం, ఉన్నా రైతులకు కావలసిన విత్తనాలు దొరకక పోవడం వల్ల ఏదో ఒక పంట వేసి నష్టపోవడం కంటే పడావు పెట్టింది మేలని భావిస్తున్న రైతులు.. కూలి పనులకు పోతున్నారు. పండ్ల తోటల్లో కూడా ఈసారి పెద్దగా కాతా పూతా లేదు. మామిడి పూర్తిగా దెబ్బతిన్నది. జనవరి నెలాఖరు వరకు మామిడి పూత బాగా రావాల్సి ఉన్నా ఇప్పటివరకు ఏ చెట్టు కూడా పూత రాలేదు. దీనికి ప్రధాన కారణం వాతావరణ మార్పులే అని రైతులు, వ్యవసాయ నిపుణులు భావిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రకృతి వైపరీత్యాలతోపాటు ప్రభుత్వ ఆదేశాల వల్ల రైతులు తమ భూమిని పడావు పెట్టి రోజు కూలీగా మారుతున్నారు. ఆరుతడి పంటలు వేస్తే చాలావరకు నష్టపోయారు. కానీ ప్రకృతి వైపరీత్యాలు, మరోవైపు కోతుల బెడద ఆరుతడి పంటలపై ప్రభావాన్ని చూపుతోంది. కాబట్టి రైతులు అప్పోసప్పో చేసి పంటలు వేస్తే పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదు. విపత్తుల కారణంగా పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వపరంగా నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలి. వారిని ఇబ్బందులకు గురిచేసే నిర్ణయాలను పక్కన పెట్టాలి. అప్పుడే వారు ఎటువంటి భయం లేకుండా సాగు చేయగలుగుతారు. వ్యవసాయ మౌలిక వసతులను అభివృద్ధి చేస్తూ, స్థానిక అవసరాలు, ఎగుమతి అవకాశాలు, నేల స్వభావానికి తగినట్లుగా జాతీయ సేద్య ప్రణాళికతో ప్రభుత్వాలు ముందుకు రావాలి. రైతుల సమస్యలను పరిష్కరించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఒక నిర్ధిష్టమైన ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలి. 

భూములు పడావు పెడుతున్నరు

విపత్తుల కారణంగా రైతులు పంటలు వేసేందుకు జంకుతున్నారు. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం వరి వేయవద్దని, ఆరుతడి పంటలను సాగు చేయాలని రైతులకు సూచించింది. ఈ పరిణామాల నేపథ్యంలో యాసంగి సాగు భారీగా తగ్గిపోయింది. ఇప్పటిదాకా మూడొంతుల సాగు భూమి పడావుగా కనబడుతోంది. మరోవైపు రాష్ట్రంలో రైతులు సరిపడా విత్తనాలు దొరకక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మెట్ట సాగులో రైతులు ఎక్కువగా వేసే పొద్దుతిరుగుడు విత్తనాలు ఎక్కడా దొరకడం లేదు. 2021 ఆర్థిక సంవత్సరం యాసంగిలో 68.14 లక్షల ఎకరాల్లో పంటలు సాగైతే.. ఈసారి ఇప్పటివరకు 19.07 లక్షల ఎకరాల్లోనే సాగు చేస్తున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. నిరుడు జనవరి చివరి వారం వరకు 37.82 లక్షల ఎకరాల్లో వరి పంట వేస్తే.. ఈసారి ఇప్పటి వరకు 7.64 లక్షల ఎకరాల్లో మాత్రమే వరి సాగవుతున్నట్లు అధికారులు అంచనా వేశారు. అదేవిధంగా ఇతరత్రా ఆరుతడి పంటలు 11.43 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగవుతున్నాయి. యాసంగిలో వరికి ప్రత్యామ్నాయంగా పల్లి, శనగ, జొన్నలు, సజ్జలు, సిరి ధాన్యాలు, నువ్వులు, మినుములు, కందులు, పెసలు వేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. చిరుధాన్యాలు 2.98 లక్షల ఎకరాలు, ఆయిల్ సీడ్స్ 3.61 లక్షల ఎకరాలు, ఇతర పంటలు 68 వేల ఎకరాల్లో సాగవుతున్నాయి. ఇలా ఎంత సాగు చేసినా వరికి ప్రత్యామ్నాయంగా వేసే పంటలు 11.43 లక్షల ఎకరాలకు మించలేదు. 

- డాక్టర్ రక్కిరెడ్డి ఆదిరెడ్డి, కాకతీయ యూనివర్సిటీ