ప్రకృతి వనాలు పడావ్‍.. నీళ్లు, నిర్వహణ లేక ఎండిపోతున్న మొక్కలు​ 

  •     జిల్లాలో 910 పల్లె, 33 పట్టణ ప్రకృతి వనాలు
  •     గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో లక్షల రూపాయలు వృథా 
  •     వేసవిలో ప్రజలకు ఆహ్లాదం అందని ద్రాక్షే..

ఆదిలాబాద్, వెలుగు : ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం పల్లెలు, పట్టణాల్లో ప్రకృతి వనాలు ఏర్పాటు చేసింది. కానీ ఎవరూ పట్టించుకోకపోవడంతో వీటి పరిస్థితి అధ్వానంగా మారింది. సరైన నిర్వహణ, అధికారుల పర్యవేక్షణ లేక మొక్కలు ఎండిపోతున్నయ్. పచ్చదనమేమోగానీ ప్రకృతి వనాలు ఉన్న ప్రాంతాలు బీడు భూమిని తలపిస్తున్నాయి. మొక్కలు దెబ్బతినకుండా కంచెలు, బోర్డులు ఏర్పాటు చేశారే తప్ప ఆ మొక్కలను బతికించుకునేందుకు నీళ్లు మాత్రం పోయడం లేదు.

కనీసం ఎండిపోయినవాటి స్థానాల్లో వేరే మొక్కలు నాటకపోవడంతో ప్రకృతి వనాలు కనుమరుగవుతున్నాయి. వేసవి మొదలవడంతో చాలా మంది సాయంత్రం పూట ఆహ్లాదం కోసం ఊరి బయట ఉండే ప్రకృతి వనానికి వెళ్తే అక్కడ మొక్కలే కనిపించడం లేదు. సరిగ్గా నిర్వహించలేనప్పుడు ఎందుకు ఏర్పాటు చేశారని 
జనం ప్రశ్నిస్తున్నారు.

లక్షలు పెట్టి లక్షణంగా వదిలేశారు..

ఆదిలాబాద్​ జిల్లాలో 468 గ్రామ పంచాయతీల పరిధిలో మొత్తం 912 పల్లె ప్రకృతి వనాలను గత బీఆర్​ఎస్​ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. చాలా గ్రామల్లో స్థలం లేకపోవడంతో ఊరికి దూరంగా ఉన్న కొండలు, గుట్టలు, అటవీ ప్రాంతాల్లో ప్రకృతి వనాలను నాటి నేతలు ఏర్పాటు చేశారు. ఉపాధి హామీ నిధుల కింద ఒక్కో పల్లె ప్రకృతి వనానికి రూ.6 లక్షల నిధులు మంజూరు చేశారు. లక్షలు పెట్టి ఏర్పాటు చేసినప్పటికీ నిర్వహణ గాలికొదిలేయడంతో నిధులు వృథా అయ్యాయి.

కొన్నిచోట్ల పల్లె ప్రకృతి వనాల చుట్టూ కంచె ఏర్పాటు చేయకపోవడంతో పశువులు సంచరించి నాటిన  మొక్కలను తినేశాయి. వనాల నిర్వహణకు ప్రత్యేక నిధులు కూడా విడుదల చేయలేదు. అటు పంచాయతీల్లో నిధుల కొరత కారణంగా వనాలు నిర్వహణ భారంగా మారి పట్టించుకోకపోవడంతో పడావ్​గా మిగిలిపోయే పరిస్థితికి వచ్చాయి.

పట్టణాల్లో పచ్చదనం కరువు

ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలో 33 పట్టణ ప్రకృతి వనాలు ఏర్పాటు చేసి దాదాపు 25 వేల మొక్కలు నాటారు. ప్రతి ప్రకృతి వనానికి రూ. 2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఖర్చు చేశారు. అయితే కొంత కాలంగా ఈ ప్రకృతి వనాలపై మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా జనాలకు ఉపయోగ పడకుండా పోతున్నాయి. సగం వనాల్లో 60 శాతం మొక్కలు ఎండిపోయాయి.

చాలా చోట్ల కేవలం కర్రలు మాత్రమే దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం ఎండలు దంచికొడుతుండ డంతో మొక్కలు బతికుండాలంటే నిత్యం నిత్యం నీరు పోయాల్సి ఉన్నప్పటికీ అధికారులు మాత్రం ఏమాత్రం పట్టించుకోవడంలేదు. ఫలితంగా ప్రకృతి వనాల లక్ష్యం నీరుగారుతోంది.