
మార్చి మొదలైందో లేదో పూర్తవకముందే ఎండలు దంచి కొడుతున్నాయి. బయట ఉన్నా, ఇంట్లో ఉన్నా ఉక్కపోతతో తిప్పలు తప్పట్లేదు. అందుకే పోయినేడు మూలకేసిన కూలర్లను బయటికి తీస్తున్నరు. ఏసీలకు సర్వీస్ చేయిస్తున్నరు. కానీ.. అవేవీ లేకున్నా ఇంటిని చల్లగా మార్చుకోవచ్చు అంటున్నరు ఎక్స్పర్ట్స్. ఇంటిని చల్లబరిచేందుకు ప్రత్యేకంగా కొన్ని రకాల మొక్కలు ఉన్నయ్. వాటిని ఇంటికి తెచ్చుకుంటే ఏసీలతో పనిలేదని పర్యావరణ నిపుణులు చెప్తున్నారు. ఇవి ఇంటిని చల్లగా ఉంచడమే కాకుండా గాలిని శుద్ధి చేసి..ఆక్సిజన్‌ను పెంచుతాయి. పైగా కరెంట్ బిల్లుల మోత కూడా తగ్గుతుంది. ఇంతలా మేలు చేసే ఆ మొక్కలేంటంటే..
మనీప్లాంట్
మల్లె తీగలా అల్లుకొని, పైకి ఎగబాకే ఈ మనీ ప్లాంట్‌ను చాలామంది గుమ్మం ముందు పెంచుకుంటారు. మరికొందరు ఇంటి లోపల కూడా పెట్టుకుంటారు. ఈ చెట్టు పెంచితే డెకరేషన్ చేసినట్టు ఇల్లంతా అందంగా కనిపిస్తుంది. ఇది ఇంటిని చల్లగా మారుస్తుంది. గాలిని ఫిల్టర్ చేసి కాలుష్యాన్ని తగ్గించేస్తుంది. దీన్ని ఇంట్లో పెంచుకోవడం వల్ల స్వచ్ఛమైన, తాజా గాలిని పీల్చుకోవచ్చు.
స్నేక్‌ప్లాంట్
ఇది అచ్చం పాములాగే ఉంటుంది. ఈ మొక్కలో నీటి శాతం ఎక్కువ. వేడి గాలిని పీల్చుకుంటుంది. కిటికీ దగ్గర ఈ మొక్కలను ఉంచితే.. వాటి గుండా వచ్చే గాలి చల్లగా మారుతుంది. ఇది ఇంటికి అందాన్ని ఇవ్వడమే కాదు.. ఇంట్లోవాళ్లకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తుంది. స్నేక్ ప్లాంట్ పగటి పూట గాలిని శుద్ధి చేసి.. రాత్రి సమయాల్లో ఆక్సిజన్ విడుదల చేస్తుంది. దీని వల్ల గాలిలోని టాక్సిన్లు తొలగిపోతాయి. ఈ మొక్క ఇంట్లో పెంచుకోవడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గి, హాయిగా నిద్ర పడుతుందని నిపుణులు చెప్తున్నారు.
బాంబూ పామ్..
బాంబూ పామ్ మొక్కను ఎక్కువగా ఇల్లు, ఆఫీసుల్లో అలంకరణ కోసం పెంచుతుంటారు.ఈ మొక్క ఏ ఇంట్లో ఉంటే ఆ ఇల్లు చాలా అందంగా కనిపిస్తుంది. దీనికి ఉండే పెద్ద పెద్ద ఆకుల వల్ల చల్లదనం పెరుగుతుంది. విష వాయువుల్ని పీల్చుకునే గుణం కూడా వీటికి ఉంటుంది.
రబ్బరు మొక్క
రబ్బర్ మొక్కకు పెద్ద పెద్ద ఆకులు ఉంటాయి. ఆకులు పెద్దగా ఉండటం వల్ల ఇది ఎక్కువ చల్లదనాన్నిస్తుంది. ఈ మొక్క ఉండే నేల మరీ తడిగా, మరీ పొడిగా లేకుండా జాగ్రత్త పడాలి. తరచూ నీరుపోస్తుండాలి. ఈ మొక్క నీటిని తక్కువగా తీసుకుంటుంది. అయితే, ఈ మొక్కను మంచి నేలలో, తక్కువ వెలుతురు పడే ప్రదేశంలో పెంచాలి.
స్పైడర్ ప్లాంట్
ఇది ఎక్కడైనా హాయిగా పెరుగుతుంది. ఇంట్లో చల్లదనం పెంచి, వేడిని తగ్గిస్తుంది. ఈ మొక్క కూడా ఇంటికి ఆకర్షణీయంగా ఉంటుంది. దీన్ని ఇండోర్‌లో పెంచుకోవచ్చు. ఈ మొక్క ఇంట్లో ఉంచడం వల్ల గాలిలోని మలినాలు తొలగిపోతాయి. వీటిని సంరక్షించడం చాలా సులువు. వీటికి నీటి అవసరం కూడా తక్కువే. చిన్న చిన్న కుండీల్లో కూడా పెంచుకోవచ్చు.
కలబంద
ఈ రోజుల్లో కలబంద మొక్క లేని ఇల్లంటూ ఉండదు. కలబందను ఆయుర్వేదంలో ఎక్కువగా వాడుతుంటారు. కాస్మొటిక్స్ తయారీలోనూ వాడుతున్నారు. నీటితోనిండిన ఈ మొక్క గాలిలో వేడిని బాగా తగ్గిస్తుంది.చాలామంది దీని ఆకుల నుంచి తీసిన జెల్నుముఖం, జుట్టు సంరక్షణ కోసం ఉపయోగిస్తారు.జీర్ణ సమస్యలు ఉన్నవారు కలబంద రసంతాగుతుంటారు. ఇలా ఆరోగ్యానికి ఎంతోమేలు చేసే కలబంద ఇంట్లో టెంపరేచర్లను కూడా తగ్గిస్తుంది. ఇది గాలిలోని టాక్సిన్లను తొలగించి
శుద్ధి చేస్తుంది.
అరెకా తాటి చెట్టు
దీన్ని అరెకా పామ్ అని కూడా అంటారు. ఈ మొక్కచూడటానికి చాలా అందంగా ఉంటుంది. ఇది కాస్త ఎక్కువ స్థలాన్ని తీసుకుంటుంది. దీన్ని మొదట నేలలో పాతి, కాస్త పెరగ్గానే కుండీల్లోకిమార్చుతారు. ఇది కూడా చెడుగాలిని స్వచ్ఛంగా మారుస్తుందని నాసా పరిశోధనలో తేలింది. అరెకా చెట్టు అత్యంత ప్రజాదరణ పొందిన లివింగ్ రూమ్ మొక్కల్లో ఒకటి. ఈ మొక్క గాలిని చల్లగా, తేమగా ఉంచడంలో సాయపడుతుంది. సమ్మర్‌లో ఈ మొక్క వేడి నుంచి ఉపశమనం కల్పిస్తుంది. ఇంటి వాతావరణాన్ని చల్లబరుస్తుంది. అంతేకాకుండా స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను అందిస్తుంది.
బోస్టన్ ఫెర్న్ మొక్క
ఇంటిని చల్లగా ఉంచడానికి ఫెర్న్ మొక్కలను కూడా నాటుకోవచ్చు. కలుషిత గాలిని శుభ్రపరచడం ఇవి చేసే ముఖ్యమైన పని. దీనివల్ల ఉక్కపోత సమస్య నుంచి ఉపశమనం దొరుకుతుంది. ఇది గాలిలోని తేమను నిలుపుకోవడంలో సాయపడుతుంది. దీంతో, ఇంటిని చల్లగా ఉంచుతుంది. గాలిలో టాక్సిన్స్‌ను తొలగించి స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను అందిస్తుంది. ఈ మొక్కకు ఎండ తగలకుండా చూసుకోవాలి.
పోథోస్
దీన్ని డెవిల్స్ ట్రీ అని కూడా పిలుస్తుంటారు. దీన్ని పెంచేందుకు ప్రత్యేక శ్రద్ద పెట్టాల్సిన అవసరం లేదు. దానంతట అదే పెరుగుతుంది. ఆకులు హృదయం ఆకారంలో ఉంటాయి. ఇది కూడా ఇంటిని చల్లబరుస్తుంది. దీని ఆకులు పెద్దగా ఉంటాయి. అందువల్ల చల్లదనాన్ని ఎక్కువగా అందిస్తుంది.
చైనీస్ ఎవర్‌గ్రీన్
పెద్ద పెద్ద ఆకులతో చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఇది ఎప్పటికీ ఆకుపచ్చగా ఉంటూ చల్లదనాన్ని ఇస్తుంది. నీటిని సైతం తక్కువగా తీసుకుంటుంది. ఈ మొక్క వేడి గాలులను పీల్చుకొని వాతావరణాన్ని చల్లబరుస్తుంది.
పీస్ లిల్లీ
పీస్ లిల్లీ మొక్క బాగా పెరిగితే ఆకులు పెద్దగా అవుతాయి. ఇది తక్కువ టైంలోనే ఇంట్లోని గాలిని చల్లబరుస్తుంది. కాకపోతే ఈ మొక్క మీద ఎక్కువగా ఎండ పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది కూడా గాలిలోని మలినాలు తొలగించి ఎయిర్ క్వాలిటీని పెంచుతుంది.
బెంజమిన్ ఫైకస్
చిన్న చిన్న కుండీల్లో ఈ మొక్కలను పెంచొచ్చు. ఇవి ఇంట్లో ఎన్ని ఎక్కువ ఉంటే... అంత చల్లగా ఉంటుంది. తక్కువ నీటిని తీసుకుని ఎక్కువ చల్లదనాన్ని
ఇస్తాయి.