- 4 రోజులుగా రాష్ట్రాన్ని కమ్మేసిన మబ్బులులని విజ్ఞప్తులు
- సీజన్ ప్రారంభంలోనే కోలుకోలేని దెబ్బ
- ఏళ్ల తరబడి పెండింగ్లోనే గీత కార్మికుల సమస్యలు
- కొత్త ప్రభుత్వమైనా డిమాండ్లు నెరవేర్చా
హనుమకొండ/ఎల్కతుర్తి, వెలుగు : గీత కార్మికులపై ప్రకృతి పగబట్టినట్టుంది. మారిన వాతావరణంతో ఈసారి సీజన్ మొదట్లోనే పెద్ద దెబ్బ తగిలింది. మిగ్ జాం తుపాన్ కారణంగా నాలుగు రోజులుగా రాష్ట్రాన్ని మబ్బులు కమ్మేశాయి. చాలా చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ముసురుకు తాళ్లు, ఈదుళ్లు మెర వేయడం సాధ్యం కావట్లేదు. చల్లబడిన వాతావరణం, మబ్బుల కారణంగా గెలల్లో మచ్చలు ఏర్పడి ఎండిపోతున్నాయి. కాగా సీజన్ దగ్గర పడటంతో గీత కార్మికులు ఇరవై రోజులుగా మెర వేస్తూ వచ్చారు.
ఒక్క తుపానుతో వారి శ్రమంతా తుడిచి పెట్టుకుపోయింది. ఏటా ఏదో ఒక రూపంలో తమకు ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ప్రభుత్వం ఏండ్లుగా తమ సమస్యలను పెండింగ్పెట్టిందని, కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ప్రభుత్వమైనా న్యాయం చేయాలని కోరుతున్నారు.
లక్షల మందికి ఇదే జీవనాధారం
తెలంగాణలోని పల్లెల్లో తాటి, ఈత కల్లును ప్రకృతి ప్రసాదంగా భావిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా కల్లు గీత కార్మికులకు సంబంధించి మొత్తం 4,366 సొసైటీలు, 3,709 టీఎఫ్టీలు ఉన్నాయి. వీటిలో 2లక్షల18వేల107 మంది సభ్యత్వం తీసుకొని గీత వృత్తిని కొనసాగిస్తున్నారు. వీరిపై ఆధారపడి దాదాపు 75 లక్షల మంది జీవనం సాగిస్తున్నట్లు అధికారుల అంచనా.
కాగా, వాతావరణం అనుకూలిస్తే ఏడాది పొడవునా తాటి, ఈత కల్లు పారుతుంది. గాలి వీచే విధానాన్ని బట్టి ఒక్కో తాటిచెట్టు రోజుకు రెండు నుంచి ఐదు లీటర్లకుపైగానే కల్లు పోస్తుంది. ఆకాశంలో మబ్బులు పట్టినా, గాలి వీచే దిశ మారినా గెలల్లో మచ్చలు ఏర్పడి ఎండిపోతాయి. కల్లు దిగుబడి తగ్గిపోతుంది. అందుకే పల్లెల్లో ‘గాలి తీరు గౌడు’ అనే నానుడి వినిపిస్తుంటుంది.
సీజన్ 4 నెలలు మాత్రమే..
నవంబర్ మొదటి వారం నుంచి తెలంగాణలో నాపతాళ్లు, పోద్దాళ్లు, ఈత కల్లు సీజన్ మొదలవుతుంది. ఏడాదిలో నాలుగు నెలలు మాత్రమే దొరికే పోద్దాళ్ల కల్లుకు మస్త్ డిమాండ్ ఉంటుంది. ఉత్తరం దిశగా వీచే చల్లని గాలులు పోద్దాళ్లు, నాపతాళ్లకు అనుకూలం. తాటిచెట్ల గెలలు ప్రారంభమైన తర్వాత వాటి నుంచి కల్లు రావాలంటే సుమారు వారం నుంచి 15 రోజుల సమయం పడుతుంది.
రోజూ ఒక్కో చెట్టును రెండు లేదా మూడు సార్లు ఎక్కి గెలలను మెర వేయాల్సి ఉంటుంది. అందుకు వాతావరణం కూడా సహకరించాలి. ఇంత కష్టపడి కల్లు గీసినా ఒక్కో కార్మికుడు రోజుకు రూ.500 నుంచి రూ.వెయ్యి వరకు సంపాదించడం కష్టమే. గతేడాది చెట్లు సమయానికి గెలలు వేయక, ఆ తర్వాత మాండూస్ తుపాన్ కారణంగా తీవ్ర నష్టం వాటిల్లింది. ఈసారి మిగ్జాం తుపాన్ కారణంగా నాలుగైదు రోజుల నుంచి ఆకాశం మేఘావృతమై, ముసురు వానలు పడుతున్నాయి. దీంతో పోద్దాళ్లు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. వాతావరణ మార్పుల కారణంగా గెలలు నుంచి కల్లు పారకపోగా, మచ్చలు ఏర్పడి ఎండిపోతున్నాయి. రాష్ట్రమంతా ఇదే పరిస్థితి ఉంది.
బీఆర్ఎస్ సర్కార్ మొండి చేయి
కులవృత్తులకు పెద్దపీట వేస్తున్నామని చెప్పుకొంటూ వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం తమను పట్టించుకోలేదని గీత కార్మికులు మండిపడుతున్నారు. ఏటా సుమారు 200 మంది గీత కార్మికులు తాటి చెట్ల పై నుంచి జారిపడి చనిపోతున్నారు. 500 మందికి పైగా గాయాల పాలవుతున్నారు. గీత కార్మికుల రక్షణ కోసం చర్యలు చేపట్టాలని ఎన్నోసార్లు ఆందోళనలు చేసినా పట్టించుకోలేదని చెబుతున్నారు. సేఫ్టీ మోకులు ఇవ్వాలని కార్మికులు డిమాండ్చేసినా గత బీఆర్ఎస్చొరవ తీసుకోలేదు.
కార్మికులకు టూ వీలర్వెహికల్స్, బీమా, రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం, బడ్జెట్లో రూ.100 కోట్లు కేటాయిస్తామని మునుగోడు ఎలక్షన్ టైమ్ లో అప్పటి మంత్రి కేటీఆర్హామీలు గుప్పించారు. తర్వాత పట్టించుకోలేదు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన నీరా కేఫ్హైదరాబాద్ కే పరిమితం అయ్యాయి. కనీసం సిటీ శివారు దాటలేదు. 560 జీవో ప్రకారం ప్రతి సొసైటీకి 5 ఎకరాల భూమి ఇస్తామని చెప్పినా, ఇప్పటికే రాష్ట్రంలో చాలా సొసైటీలకు సంబంధించిన భూములు కోర్టు కేసుల్లో చిక్కుకున్నాయి.
ఈజీఎస్ ద్వారా ఈత, తాటి మొక్కలు నాటినట్లు చూపించారు. కానీ ఎక్కడా చెట్లు పెరిగిన దాఖలాలు లేవు. విచ్చలవిడిగా బెల్టు షాపుల ఏర్పాటుతో కల్లుకు సరైన ఆదరణ పోతోందని గీత కార్మికులు వాపోతున్నారు.
కొత్త ప్రభుత్వంపై కొండంత ఆశలు
కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ప్రభుత్వమైనా తమ డిమాండ్లను పరిష్కరించాలని గీత కార్మికులు కోరుతున్నారు. వృత్తిలో ప్రమాదాల నియంత్రణకు సేఫ్టీ మోకులు ఇవ్వాలని, సంఘాలకు 5 ఎకరాల భూమి, బడ్జెట్లో రూ.5 వేల కోట్లు కేటాయించాలని డిమాండ్చేస్తున్నారు. అలాగే తాడి కార్పొరేషన్ ని బలోపేతం చేయడానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
కల్లుకు మార్కెట్, నీరా, తాటి, ఈత ఉత్పత్తుల పరిశ్రమలు ఏర్పాటు, వృత్తి పని చేసే వారికి టూవీలర్స్, ప్రమాద బాధితులకు ఎక్స్ గ్రేషియాను రూ.10 లక్షలకు పెంచడం, గీతన్న బీమా అమలు చేయడంతో పాటు ఏజెన్సీ ఏరియాలోని సొసైటీలను పునరుద్ధరించి సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని కోరుతున్నారు.
బాటిల్కల్లు కూడా రావట్లే
నెల రోజులుగా నాలుగు పోద్దాళ్లు ఎక్కుతున్న. మబ్బులకు గెలలన్నీ మాడిపోతున్నయ్. డైలీ నాలుగు చెట్లు ఎక్కినా ఒక్క బాటిల్ కల్లు కూడా రావడం లేదు. వచ్చిన కొద్దిపాటి కల్లు రుచి ఉండడం లేదు. సరైన వాతావరణం లేక తాళ్లు దెబ్బ తింటున్నయ్. పూట గడవక ఇబ్బంది పడాల్సి వస్తోంది. ప్రభుత్వం గీత కార్మికులను ఆదుకోవాలి.
-బుర్ర వివేక్ గౌడ్, ఎల్కతుర్తి
వాతావరణం మారకుంటే కష్టమే
గీత కార్మికులకు పోద్దాళ్ల సీజన్ చాలా ముఖ్యమైనది. తుపాన్ ప్రభావంతో వాతావరణం అనుకూలించడం లేదు. నాలుగు రోజులుగా మబ్బులు కమ్మేయడంతో చెట్ల నుంచి కల్లు పారుతలేదు. గెలకు మచ్చలు ఏర్పడి ఎండిపోతున్నాయి. రాబడి లేదు. చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇంకొన్ని రోజులు ఇలాగే ఉంటే సీజన్ మొత్తం తుడిచిపెట్టుకుపోయినట్టే. -
గోడిశాల రాజన్నగౌడ్, ఎల్కతుర్తి