పద్నాలుగేళ్ల ఉద్యమకాలంలో కేసీఆర్ ఏం చెప్పినా తెలంగాణ సమాజం విన్నది. ఎందుకంటే... అది ఉద్యమం. ఒక రకంగా యుద్ధం! నాయకుడు చెప్పిందల్లా వినటం, విన్నది విన్నట్టు పాటించడం యుద్ధనీతిలో భాగం. మిగతా సమయాల్లో ఎందుకు వింటారు? అదీ విశ్వాసం సన్నగిల్లిన తర్వాత...ఉహూ, వినరుగాక వినరు! ఇప్పుడదే సంక్లిష్ట పరిస్థితిని భారత్ రాష్ట్ర సమితి (నాటి తెలంగాణ రాష్ట్ర సమితి) అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఎదుర్కొంటు న్నారు. అయినా సరే... ‘జనం నా మాట వినాల్సిందే!’ అన్నట్టు ఎన్నికల తాజా సభల్లో ఆయన మాట్లాడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మాయమాటలు విని మోసపోయి, ఓటర్లు తప్పుడు నిర్ణయం తీసుకున్నారనే అర్థం వచ్చేలా ఆయన మాట్లాడుతున్నారు.
ఏడాది తిరక్కుండానే తాము మళ్లీ అధికారంలోకి వస్తామనే వ్యాఖ్యలు కేసీఆర్ చేస్తున్నారు. అపార రాజకీయ అనుభవం, వ్యూహ చతురత, మనో నిబ్బరం, మాటకారితనం..వంటి నైపుణ్యాలున్న కేసీఆర్ ఏమిటి? ఇలా మాట్లాడుతున్నారు? అనిపించవచ్చు. ఇటీవల ఆయన మాటలు వింటే, ఆశ్చర్యం ఏమీ లేదు! కానీ, అది ఆయన నైజమే కాదు ఇప్పుడు అవసరం కూడా! ఏం చేసైనా పార్టీని బతికించుకోవాల్సిన అత్యవసర పరిస్థితిని ఇప్పుడాయన ఎదుర్కొంటున్నారు. ఏమిటా పరిస్థితి? అది ఎందుకొచ్చింది! గత, వర్తమానాల్ని అన్వయిస్తూ. ‘వాస్తవికత’ గీటురాయిపై పరిశీలిద్దాం!
జనం తీర్పే ప్రామాణికం?
లోక్‌సభ ఎన్నికల ముంగిట్లో బీఆర్‌ఎస్ రాజకీయపరమైన జీవన్మరణ పోరు చేస్తోంది. తెలంగాణలో 17 లోక్‌సభ నియోజకవర్గాలకు గాను మెజారిటీ స్థానాల్లో ప్రధాన పోటీ కేంద్ర, రాష్ట్ర పాలకపక్షాలైన బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్యే ఉందని ‘పీపుల్స్‌పల్స్’ తదితర సర్వే సంస్థలకు చేరుతున్న క్షేత్ర సమాచారం. తెలంగాణ ఏర్పడ్డ నుంచీ పదేండ్లు పాలించి, ఇటీవల శాసనసభ ఎన్నికల్లో ఓటమిపాలైన బీఆర్‌ఎస్ ఈ ఎన్నికల్లో దీటైన పోటీ ఇచ్చేలా కోలుకోలేకపోతోంది. అవకాశవాద
రాజకీయాల్లో పార్టీ నుంచి నిష్క్రమణలు పెరిగి బీఆర్‌ఎస్ కొంత కకావికలమైంది.
2004 అంటే, పార్టీ పుట్టాక తొలి ఎన్నికల్లో.. కేసీఆర్ కుటంబం పోటీలో లేని మొదటి ఎన్నిక ఇది! 2004 నుంచి మొదలెట్టి 2009, 20014, 2018, 2019 ప్రతి ఎన్నికలో కుటుంబ సభ్యులు పోటీ చేస్తూనే ఉన్నారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం ఏ ఒక్కరూ బరిలో లేరు. 8 నుంచి 12 సీట్లు తమకు వస్తాయని కేసీఆర్ చెబుతున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు చెదిరిపోకుండా భరోసా కల్పించడానికి చెప్పే మాటలే తప్ప క్షేత్రంలో అంత సీన్ లేదు. అది ఆయనకూ తెలుసు! అందుకే, ‘12 సీట్లు ఇవ్వండి ప్రజల పక్షాన నిలిచి పోరాడుతాం’ అని ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇవ్వకుంటే పోరాడరా? ప్రజాపక్షాన నిలవరా? ఇది నాలాంటి వాళ్లు అడిగే చిలిపి/గడుసు ప్రశ్న కాదు. ప్రజాస్వామ్య వ్యవస్థ నిర్మాణమే అలా ఉంటుంది. విపక్షంలో గెలిచి ప్రజాతీర్పును వంచించి, ‘అభివృద్ధి’ సాకు చూపి పాలకపక్షం పంచన చేరడం ప్రజాప్రతినిధులకు రివాజైంది. కానీ, విపక్షంలో ఉండీ ప్రజా సమస్యలపై పోరాడుతూ, తోవతప్పకుండా ప్రభుత్వాన్ని గాటనబెట్టే ప్రతిపక్ష బాధ్యతగా ప్రజాతీర్పును స్వీకరించిన పార్టీలు, నాయకులు గతంలో కోకొల్లలు! ‘మమ్మల్ని దింపేసి పోరాడమంటే ఎట్లా?’ అని కేసీఆర్ జనాన్ని ప్రశ్నిస్తున్నారు. దింపినందుకే కదా పోరాడాలి! దింపకుంటే, మూడో సారి అధికారంతో జనం భుజాలపై ఎక్కి స్వారీ చేస్తారే తప్ప పోరాటం ఎందుకు చేస్తారు? ఎవరిపైన? ఇది ప్రజల మౌలిక ప్రశ్న!
నేల విడిచి సాము!
అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా.. డిసెంబరు 3న ఓట్ల లెక్కింపు ఉంటే, 4న మంత్రివర్గ సమావేశమని ముందే ప్రకటించారు కేసీఆర్! అది ఆత్మ విశ్వాసమా? అతి విశ్వాసమా? ప్రజల విజ్ఞతకే వదలాలి. 100 సీట్లు తమకు వచ్చితీరుతాయని నాడు బల్లగుద్ది చెప్పారు. పోలింగ్‌కు ముందు ఓటరు ఆలోచనలు, నిర్ణయాలను తమ మాటలతో ప్రభావితం చేయజూసే శకంలో ఉన్నాం, భిన్నంగా ఆలోచించలేం, ఆశించలేం!
కానీ, పగటి కలలకు, పచ్చి వాస్తవాలు పొసగనప్పుడు ఏమిటి పరిస్థితి? తర్వాత వచ్చే ఫలితాలను, నాయకులు ముందు చెప్పిన మాటల్ని జనం పోల్చి చూస్తారు కదా! మాటల్లో విశ్వసనీయత సడలి, పలుచనవుతామనే భావన నాయకులకు ఉండదా? ఉండొద్దా! ఎప్పుడో ఒకప్పుడు నిజాలైతే తెలిసి రావాలిగా! ‘అన్నీ చేశాం, ఎన్నికల్లో హామీ ఇవ్వని వరాలూ తీర్చాం, రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా నిలిపాం..’ అన్న వాళ్లు దారుణంగా ఓడిపోయినపుడు, ఎందుకు ప్రజాతీర్పు అలా వచ్చింది? సమీక్షించుకున్నారా? లేదు. తూతూ మంత్రపు పై మెరుగు మాటలే తప్ప, తప్పెక్కడ జరిగిందో వాస్తవిక సమీక్ష, ఆత్మపరిశోధనే జరగలేదు.
జన విధేయతే కుదురు!
ప్రజాస్వామ్యంలో పాలకులు ప్రజలకు అధిపతులుగా కాకుండా విధేయులుగా ఉండాలి. అన్నిసార్లూ ఎదుటివారి మాటలే వినాలని ఏముంటుంది? ఎప్పుడో ఒకప్పుడు ప్రజలు సొంతంగా ఆలోచిస్తారు. ఉమ్మడి రాష్ట్రంలో తీరని కోరికలు, నెరవేరని ఆకాంక్షలు ప్రత్యేక రాష్ట్రంలో ఈడేరాయా? అని జనం ప్రశ్నించుకుంటారు. తీరలేదని భావించారు కనుకే, బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని దించారు. ఎన్నికల్లో ఓటు ద్వారా కాంగ్రెస్‌కు పట్టం కట్టారు. రేపు, కాంగ్రెస్ ప్రభుత్వం మెరుగైన పాలన ఇవ్వట్లేదని, బీఆర్‌ఎస్ సర్కారు కన్నా అధ్వానమే అని భావిస్తే వారినీ దించేస్తారు.
అంతే తప్ప, కేసీఆర్ మాటలు వినో, బీజేపీ ఆరోపణలు నమ్మో మాత్రం కాదు. ప్రజలకు ఆ భావన కలిగేలా వాస్తవాలను వారి దృష్టికి తీసుకువెళ్లడం ప్రతిపక్ష పార్టీలుగా బీఆర్‌ఎస్, బీజేపీల బాధ్యత! అందుకోసమే వారు పని చేస్తున్నట్టు ప్రజలకు నమ్మకం, విశ్వాసం కలిగించాలి తప్ప, అధికారం కోసం అర్రులు చాచినట్టు ఉండొద్దు. ఏ వక్రమార్గమైనా పట్టి, ఏడాదిలో మళ్లీ మేమే గద్దెనెక్కుతాం అంటే దాన్ని ప్రజలెట్లా స్వీకరిస్తారో చూడాలి, ఆలోచించాలి. పార్టీ నాయకులు, శ్రేణులు చెదిరిపోకుండా, పట్టి ఉంచడానికి పనికివస్తాయనేది సంకుచిత ఆలోచన! ప్రజాస్వామ్యంలో అది తప్పుడు సంకేతమిస్తుంది.
ప్రజలిచ్చే మరో అవకాశం వరకు వేచి చూడాలి, జనహితంలో ఉద్యమించాలి. కలిసివచ్చే ఇతర శక్తులతో సమైక్యంగా పనిచేయాలి. ఆ స్వభావం బీఆర్‌ఎస్ నేత అలవర్చుకోవాలి. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో కమ్యూనిస్టులతో చేయి కలిపి, ఆ మేర లబ్ధి పొందారు. మున్ముందూ కలిసే పనిచేస్తామని అప్పట్లో ప్రకటించారు. ఏమైందో ఆ బంధం బెడిసింది. కొనసాగి వుంటే నల్గొండ, ఖమ్మం తదితర జిల్లాల్లో లబ్ధి చేకూరేది. ఇతర పార్టీలతో కలిసి పనిచేయలేని తత్వం బీఆర్‌ఎస్ నేతకు కొత్తకాదు. ఈ స్వభావం 2004 ఎన్నికల నుంచి కూడా ఉందని పలుమార్లు రూఢీ అయింది. అదే సమయంలో బీజేపీతో వారిది లాలూచీ కుస్తి అనే ప్రచారం జనంలో ఇంకా ఉంది.
ప్రతీకను నిలుపుకుంటారా?
పార్టీ పేరు మారినా, పేరులో తెలంగాణ పదం తిరిగి వెనక్కి వచ్చినా, రాకపోయినా..తెలంగాణ అస్తిత్వానికి కేసీఆర్ ఒక ప్రతీక. రాజకీయ వ్యవస్థగా తన శక్తుల్ని పునరేకీకరణ చేసుకొని, ఏ రూపంలోనైనా ప్రజలకు ఆయన సేవలందించాలని తెలంగాణ సమాజం కోరుకుంటోంది. అదెలా? అన్నది, నేలవిడిచిన సాము వదిలి, కేసీఆర్ తేల్చుకోవాల్సిందే!
ఉట్టి వదిలేసి స్వర్గానికి నిచ్చెనా..?
కాంగ్రెస్ మాయమాటల్ని నమ్మి ప్రజలే తప్పుజేశారని తేల్చేశారు. తమను గెలిపిస్తే మంచి నిర్ణయం, ఓడిస్తే తప్పుడు నిర్ణయం అంటే ఎలా? ప్రజల గుండెల్లో తాను, తన గుండె చీలిస్తే తెలంగాణ ఉన్నట్టు కేసీఆర్ చెబుతున్నారు. ‘అది ఒకింత నిజమే, కానీ, ఇప్పుడు కాదు, ఒకప్పుడు’ అని తెలంగాణ సమాజం అంటోంది. 2004 ఎన్నికల్లోనే కాకుండా 2006, 2008 తెలంగాణ కోసం టీఆర్‌ఎస్ పదవుల్ని తృణప్రాయంగా ఎప్పుడు రాజీనామాలు చేసి వచ్చినా, అదే సమాజం ఆయన్ని, ఆయన మనుషుల్ని అక్కున చేర్చుకుంది.
పోరుగడ్డ తెలంగాణ ఆ ఉద్యమ పార్టీకి ఊపిరిపోసి, ప్రతిసారీ ఆశీర్వదించి ప్రతినిధులను అన్ని చట్టసభలకు పంపింది. బదులుగా వారేం చేశారు? రెండోసారి గెలిచి అధికారం స్థిరమనుకొని, పార్టీ పేరులోంచి ‘తెలంగాణ’ మాటనే తీసేశారు. ఉట్టి వదిలేసి స్వర్గానికి ఎగిరే సన్నాహాల్లో పడ్డారు. మహారాష్ట్రలో పాగా అని, కర్ణాటక మా పొరుగు రాష్ట్రమే అని, ఆంధ్రాలో అరంగేట్రం అని, పంజాబ్‌లో రైతులని, ఢిల్లీలో బాధితులనీ..నేల విడిచి సాము చేయలేదా! దక్షిణాది రాజకీయ ప్రయోగాలేవీ ఉత్తరాదిన క్లిక్ అయిన చరిత్ర లేదు. ఏమైంది? కడకు, రాష్ట్రం బయట (ఆ మాటకొస్తే లోపల కూడా) ఎక్కడ ఏమైనా మిగిలిందా? ఓ నిట్టూర్పు తప్ప!
దిలీప్ రెడ్డి,
పొలిటికల్ అనలిస్ట్, పీపుల్స్‌పల్స్ రీసెర్చ్ సంస్థ,