- వేలిముద్ర డెబిట్ కార్డును తీసుకొస్తున్న నాట్‌వెస్ట్ బ్యాంకు
మొట్టమొదలు మాగ్నటిక్ స్ట్రిప్‌తో ఏటీఎం కార్డులు వచ్చేవి. సెక్యూరిటీ కోసమని దానికి ఇప్పుడు చిప్‌లు తగిలించారు. ఇప్పుడు మరింత భద్రత కోసం మరో కొత్త ఫీచర్ రాబోతోంది. పిన్ నంబర్‌ను కొట్టాల్సిన పని లేకుండా కార్డు మీద వేలు పెట్టగానే పేమెంట్ అయిపోయేలా సరికొత్త ‘వేలిముద్ర ఏటీఎం కార్డు’ రాబోతోంది. బ్రిటన్‌కు చెందిన నాట్‌వెస్ట్ బ్యాంక్, జెమాల్టో అనే టెక్నాలజీ కంపెనీతో కలిసి ఈ సరికొత్త బయోమెట్రిక్ డెబిట్ కార్డును తీసుకొస్తోంది. ఇప్పటికే దానిని బ్రిటన్‌లో చాలా చోట్ల టెస్ట్ చేసింది. దానికి మంచి స్పందన కూడా వచ్చింది. భద్రతకు భద్రతతో పాటు, ఈజీగా పేమెంట్స్ అవుతుండడంతో యూజర్లూ దానికి ఓకే చెప్పేస్తున్నారు. దీంతో వచ్చే ఏడాది నుంచే ఈ వేలి ముద్రల డెబిట్ కార్డులను తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తోంది సంస్థ. కార్డులోనే ఇన్‌బిల్ట్‌గా ఫింగర్ ప్రింట్ సెన్సర్‌ను కంపెనీ పెట్టింది. కార్డు ఎనేబుల్ కావడానికి ముందుగా పలు యాంగిళ్లలో వేలి ముద్రను కార్డుపై రికార్డు చేయాల్సి ఉంటుంది. ఫింగర్‌ప్రింట్ సెన్సర్‌పై వేలిని ఎలా పెట్టినా రీడ్ చేసేందుకు వీలుగానే అనేక కోణాల్లో వేలి ముద్రను రికార్డు చేస్తారు. ఈ ఫింగర్ ప్రింట్ కార్డు.. హ్యాకర్లుగానీ, సైబర్ నేరగాళ్లుగానీ ఆర్థిక మోసాలకు పాల్పడకుండా కాపాడుతుంది. ఇది పనిచేయడానికి చార్జింగ్ కూడా అవసరం లేదు. కార్డు లోపలే చిన్నపాటి లూప్‌ను ఫింగర్‌ప్రింట్ సెన్సర్‌కు కలుపుతారు. అదే దానికి పవర్ ఇస్తుంటుంది. కార్డును ఎలాంటి పరికరాలకూ లింక్ చేయాల్సిన అవసరం లేదని, దాన్లోనే అన్ని ఫీచర్లుంటాయని జెమాల్టో ఎండీ హొవార్డ్ బెర్గ్ చెప్పారు. ఫింగర్ ప్రింట్లను బయటి వ్యక్తులెవరూ తీసుకోలేరన్నారు. ఈ కార్డుల కోసం అదనపు చార్జీలనూ భరించేందుకు ఖాతాదారులు రెడీగా ఉన్నారని నాట్‌వెస్ట్/ఆర్బీఎస్ బ్యాంక్ ఆఫ్ స్ట్రాటజీ అండ్ఇన్నోవేషన్ డైరెక్టర్ జార్జినా బల్కెలీ చెప్పారు. కొందరు మాత్రం అందుకు ఒప్పుకోవట్లేదన్నారు. అయితే, ఈ కార్డులు వాడేందుకు వీలుగా రీటెయిల్ షాపు యజమానులు కూడా టెక్నాలజీని అప్‌గ్రేడ్ చేసుకోవాల్సి ఉంటుందని ఆమె చెప్పారు.
200 మందితో టెస్టు
నిజానికి ఇప్పటికే కార్డును పీవోఎస్ టెర్మినళ్లలో పెట్టకుండా డైరెక్ట్‌గా స్కాన్ చేసి పేమెంట్ చేసే సౌకర్యం బ్రిటన్‌లో అమలవుతోంది. అయితే, అది అంతగా క్లిక్ కాలేదు. చాలా మంది దానిని వాడుకోవట్లేదు. దీంతో మరింత మెరుగైన సేఫ్టీ ఫీచర్లతో కార్డులు అందించేందుకు నాట్‌వెస్ట్ బ్యాంకు ముందుకొచ్చింది. జెమాల్టోతో కలిసి బయోమెట్రిక్ కార్డులను తయారు చేయించింది. 200 మంది కస్టరమర్లకు ఇచ్చి టెస్ట్ చేయించింది. టెస్టుల్లో అది సక్సస్ అవడంతో వచ్చే ఏడాది నుంచి పూర్తిస్థాయిలో తీసుకొచ్చేందుకు రెడీ అవుతోంది. అయితే, ఇప్పుడే కాదు, అంతకుముందు 2017లో దక్షిణాఫ్రికా, గత ఏడాది ఇటలీలో జెమాల్టో ఈ బయోమెట్రిక్ కార్డులను టెస్ట్ చేసింది. అయితే, కార్డుపై నేరుగా కస్టమర్ ఫింగర్ ప్రింట్‌ను రిజిస్టర్ చేసుకోవడానికి లేదు. బ్యాంకుకు వెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. భవిష్యత్తులో ఫోన్ నుంచి వినియోగదారుడే వేలి ముద్రను రిజిస్టర్ చేసుకునేలా టెక్నాలజీని అభివృద్ధి చేస్తామని జెమాల్టో చెబుతోంది.