శంషాబాద్​లో నవగ్రహ విగ్రహాలు ధ్వంసం

శంషాబాద్​లో నవగ్రహ విగ్రహాలు ధ్వంసం
  • తీవ్రంగా ఖండించిన బీజేపీ, హిందూ సంఘాల నేతలు
  • ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాశ్​గౌడ్ నిరసన 

శంషాబాద్, వెలుగు : శంషాబాద్​ఎయిర్​పోర్టు కాలనీలోని హనుమాన్ ఆలయం ముందున్న నవగ్రహ విగ్రహాల్లోని ఐదు విగ్రహాలను గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం అర్ధరాత్రి ధ్వంసం చేశారు. మంగళవారం ఉదయాన్నే స్వామివారి దర్శనానికి వెళ్లిన అయ్యప్ప మాలధారులు గమనించి ఆలయ కమిటీ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఆలయ కమిటీ సభ్యులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటికే విషయం తెలుసుకున్న బీజేపీ, హిందూ సంఘాల నాయకులు ఆలయం వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు.

శంషాబాద్ డీసీపీ రాజేశ్, అడిషనల్ డీసీపీ రామ్ కుమార్, శంషాబాద్ ఏపీపీ శ్రీనివాస్ ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి బందోబస్తు ఏర్పాటు చేశారు. హిందూ సంఘాల నాయకులతో మాట్లాడి పంపించారు. కొద్దిసేపటి తర్వాత విశ్వహిందూ పరిషత్ సభ్యులతోపాటు మరికొందరు హిందూ సంఘాల నాయకులు అక్కడికి చేరుకుని నిరసనకు దిగారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్​గౌడ్, ఎంపీ కొండా విశ్వేశ్వర్​రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దాడిని తీవ్రంగా ఖండించారు. విశ్వేశ్వర్​రెడ్డి మాట్లాడుతూ..

హిందూ దేవాలయాల మీద వరుస దాడులు జరుగుతున్నా సీఎం రేవంత్​రెడ్డి మౌనం వహించడానికి కారణం ఏమిటో తెలపాలన్నారు. శంషాబాద్ జోన్ డీసీపీ రాజేశ్​మాట్లాడుతూ.. సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామని, సంయమనం పాటించాలని కోరారు. నిందితులను పట్టుకుని కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాగే నవగ్రహ విగ్రహాల ధ్వంసాన్ని నిరసిస్తూ బీజేవైఎం, బీజేపీ, హిందూ సంఘాల నాయకులు శంషాబాద్​ బస్టాండ్​సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసనకు దిగారు.