
ఆర్మూర్, వెలుగు : ఆర్మూర్ టౌన్‌లోని నవనాథ సిద్ధులగుట్ట మహాశివరాత్రి వేడుకకు ముస్తాబు అవుతోంది. నవ సిద్ధులు నడియాడిన ప్రాంతం కావడంతో ఈ గుట్టకు ప్రాముఖ్యత ఉంది. ప్రతిఏటా శివరాత్రికి వేల సంఖ్యలో భక్తులు తరలివస్తారు. ఈసారి శివరాత్రి వేడుకను అంగరంగ వైభవంగా జరిపేందుకు మందిర కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఘాట్‌రోడ్డు, మెట్ల మార్గాలను భక్తులు వచ్చేందుకు వీలుగా తయారు చేస్తున్నారు. మెట్ల మార్గంలో మధ్యలో గుహాలో ఉన్న శివాలయానికి, రామాలయానికి, దుర్గామాత, అయ్యప్ప మందిరాలకు రంగులు వేస్తున్నారు. దర్శనానికి వచ్చే భక్తులకు ఎండనుంచి ఉపశమనం కలిగించేలా సీలింగ్ ఏర్పాటు చేస్తున్నారు.
దారి పొడవునా తాగునీటిని అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. శివరాత్రి రోజున తెల్లవారుజామున నుంచి అర్ధరాత్రి వరకు శివాలయంలో పూజ కార్యక్రమాల కోసం ఆలయాన్ని సిద్ధం చేశారు. మరుసటి రోజు ఉపవాస దీక్షలు ఉన్నవారి కోసం ఉదయం నుంచే అన్నదానం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులను ఘాట్‌రోడ్డు ద్వారా నేరుగా గుట్టపైకి వెళ్లేలా చర్యలు చేపట్టారు. బస్సుల్లో భక్తులను ఉచితంగా గుట్టపైకి తీసుకెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నారు.