
శివ్వంపేట వెలుగు: ‘అమ్మా నీకు దండం పెడతాం.. దయచేసి పార్ట్ బీ సమస్యలు తీర్చండి’ అంటూ కొందరు రైతులు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డికి మొర పెట్టుకున్నారు. శివ్వంపేట మండలం నవాపేటలో బుధవారం నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.
గ్రామానికి చెందిన రైతులు ఎమ్మెల్యే వద్దకు చేరుకుని తమ గోడు వెల్లబోసుకున్నారు. తమ భూములను పార్ట్ బీలో పెట్టడంతో రైతు బంధు, రైతు బీమా, రుణమాఫీ అమలుకావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఎమ్మెల్యే, కలెక్టర్కు దరఖాస్తులు ఇచ్చినా సమస్య పరిష్కారం కాలేదన్నారు.
తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఎమ్మెల్యే స్పందిస్తూ గ్రామస్తులంతా తీర్మానం చేసి ఇస్తే.. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని చెప్పారు. అనంతరం సికింద్లాపూర్ లో కొత్తగా నిర్మించిన పంచాయతీ భవనాన్ని సునితారెడ్డి ప్రారంభించారు. గ్రామదేవతల ప్రతిష్ఠలో పాల్గొన్నారు.