హౌసింగ్​ సొసైటీల్లో200 పోలింగ్ కేంద్రాలు : నవదీప్ రిన్వా

  • ఓటింగ్ శాతాన్ని పెంచడమే మా టార్గెట్
  • యూపీ ప్రధాన ఎన్నికల అధికారి నవదీప్ రిన్వా 

లక్నో: ఉత్తరప్రదేశ్‌‌లో ఓటింగ్ శాతాన్ని మరింత పెంచేందుకు పట్టణ ప్రాంతాల్లోని హౌసింగ్ సొసైటీల్లో 200కు పైగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు యూపీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్(సీఈవో) నవదీప్ రిన్వా వెల్లడించారు. ఓటింగ్ శాతానికి సంబంధించి ఉత్తరప్రదేశ్ దేశంలోనే  మొదటి స్థానంలో ఉందని తెలిపారు. ఆదివారం నవదీప్ రిన్వా మాట్లాడుతూ.." ఉత్తరప్రదేశ్‌‌లో 2019 లోక్‌‌సభ ఎన్నికల్లో ఓటింగ్ శాతం 59.11% మాత్రమే. 

దీంతో పలు సిటీ ఏరియాల్లో  తక్కువ నమోదైన ఓటింగ్ శాతాన్ని పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నం. అందులో భాగంగా ప్రజలు ఓటు వేయకుండా నిరోధించే అన్ని రకాల అడ్డంకులను తొలగించేలా చర్యలు తీసుకున్నం. ప్రతి ఓటరుకు 2 కి.మీ.పరిధిలోనే పోలింగ్ స్టేషన్ ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నం. గేటెడ్ కమ్యూనిటీలు, హౌసింగ్ సొసైటీల్లోనూ పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నం. ఓటరు అక్షరాస్యత కార్యక్రమం చేపట్టాం" అని వివరించారు. 

15 కోట్ల మంది ఓటర్లు

ఉత్తరప్రదేశ్‌‌లో ఈసారి 15.30 కోట్ల మందికి పైగా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని నవదీప్ రిన్వా తెలిపారు. " సోన్‌‌భద్ర జిల్లాలోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు మినహా మిగతా ప్రాంతాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరుగుతుంది. సోన్‌‌భద్రలోని రాబర్ట్స్‌‌గంజ్ (ఎస్సీ) లోక్‌‌సభ స్థానానికి జూన్ 1న ఏడో విడతలో ఎన్నికలు జరుగుతాయి. 

ఇక రాష్ట్రంలో 1.62 లక్షల పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఎన్నికలకు 3.24 లక్షల ఈవీఎంలు అవసరం అవుతాయి.మొత్తంగా ఉత్తరప్రదేశ్‌‌లో ఈసారి పోలింగ్ శాతం 60 శాతానికి మించుతుంది. వేసవి నేపథ్యంలో పోలింగ్ స్టేషన్ల వద్ద తాగునీరు, క్యూలో నిలబడి ఉన్న ఓటర్లకు నీడ ఉండేలా చూడాలని మేం డీఈవోలను కోరాం. సీనియర్ సిటిజన్లు, గర్భిణులు, శారీరక వికలాంగులైన ఓటర్ల కోసం ఏర్పాట్లు చేయాలని సూచించాం. పోలింగ్ సిబ్బంది కోసం కూడా మెడికల్ కిట్‌‌లను అందించనున్నాం" అని నవదీప్ రిన్వా  పేర్కొన్నారు.