మర్డర్​ కేసులో తొమ్మిది మంది అరెస్ట్

నల్గొండ అర్బన్, వెలుగు : మర్డర్​ కేసులో తొమ్మిది మందిని అరెస్టు చేసినట్లు నల్గొండ ఎస్పీ కె.అపూర్వరావు తెలిపారు. కేసు వివరాలను సోమవారం పోలీస్​ జిల్లా కార్యాలయంలో ఆమె మీడియాకు వెల్లడించారు. త్రిపూరారం మండలం జి. అన్నారం గ్రామానికి చెందిన ఇరిగి నవీన్ నాలుగేండ్లుగా అదే గ్రామానికి చెందిన మైనర్ అమ్మాయిని  ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతున్నాడు. దీంతో బాలిక తరపువారు నవీన్​ను హెచ్చరించారు. ఈ క్రమంలో ఈ ఏడాది మార్చి 20న అతడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. చికిత్స అనంతరం మళ్లీ బాలికను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. దీంతో అమ్మాయి తమ్ముడు మణిదీప్, అతడి స్నేహితుడు శివప్రసాద్ కలిసి నవీన్​ తీరు మార్చుకోవాలని, అమ్మాయి వెంట పడితే చంపేస్తామని బెదిరించారు.

ఈ విషయాన్ని నవీన్​ తన స్నేహితుడైన ఈట అనిల్ కుమార్ కు తెలిపాడు. దీనిపై మాట్లాడేందుకు ఇద్దరూ కలిసి ఈనెల 9న మధ్యాహ్నం మరో ఫ్రెండ్​ అయిన త్రిపురారం మండలం గుంటిపల్లి గ్రామంలోని తిరుమల్ ఇంటికి వెళ్లారు. బెదిరింపుల విషయమై మాట్లాడుకునేందుకు తిరుమల్​ఇంటికి రావాలని మణిదీప్, శివప్రసాద్ ను ఫోన్​ ద్వారా అనిల్​ కోరాడు. దీంతో మణిదీప్, శివప్రసాద్​తమ తరఫు వారితో కలిసి నవీన్​ను చంపాలని పథకం వేశారు. వెంటనే అందరూ కలిసి తిరుమల్​ఇంటికి వెళ్లారు. ఒక్కసారిగా అక్కడున్న ముగ్గురిపై దాడి చేయగా అనిల్, తిరుమల్​ తప్పించుకున్నారు. నవీన్​ కూడా పారిపోతుండగా మణిదీప్​తరఫువారు కర్రలు, కత్తితో వెంటాడి పొడిచి చంపేశారు. పోలీసులు విచారణ చేపట్టి తొమ్మిది మంది నిందితులను పట్టుకున్నారు. ఈ కేసులో త్రిపురారం మండలానికి చెందిన ఏ1 రామలింగం, రాజు, శివ ప్రసాద్, రాజేశ్, మణితేజ, కోటయ్య  సురేశ్​అలియాస్​రాముతో పాటు ఇద్దరు మైనర్లు ఉన్నారు. వీరందరినీ రిమాండ్ కు తరలించారు. కేసును ఎస్పీ అపూర్వరావు పర్యవేక్షణలో మిర్యాలగూడ డీఎస్పీ పి. వెంకటగిరి, హాలియా సీఐ గాంధీ నాయక్, నిడమనూరు  ఎస్సై​శోభన్ బాబు, త్రిపురారం ఎస్సై జి.శోభన్ బాబు సిబ్బందితో కలిసి ఛేదించారు.