సీఎంగా రికార్డు దిశలో నవీన్​ పట్నాయక్​

ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్(76) ముఖ్యమంత్రిగా 23 ఏండ్లను దాటుకుని పశ్చిమ బెంగాల్ సీఎం జ్యోతిబసుకున్న రికార్డును బద్దలు కొట్టి నవీన్ నాటౌట్ గా ముందుకు సాగుతున్నారు. పవన్ కుమార్ చామ్లింగ్ సిక్కిం సీఎంగా దాదాపు 24 ఏండ్ల 166 రోజులు పనిచేసి నెలకొల్పిన రికార్డును కూడా నవీన్ అధిగమించే అవకాశం ఉంది. ఢిల్లీలో విందులు, వినోదాల్లో క్రమం తప్పకుండా పాల్గొనే వ్యక్తిగా, రాజకీయాల్లో ఓనమాలు తెలియని వ్యక్తిగా ముద్రపడిన నవీన్ తనకంటూ ఒక ఇమేజ్ ను సృష్టించుకున్న తీరు గమనించదగింది. 


బిజూ పట్నాయక్ కు, ఆయన కుటుంబానికి సన్నిహితుడిగా ఐఏఎస్ అధికారి ప్యారీమోహన్ మహాపాత్రకు పేరుంది. రాజకీయాల్లోకి వచ్చిన మొదటి పదేళ్లలో తల్లి జ్ఞాన్ సలహా మేరకు నవీన్ ఆయన మాటను వేదంగా పాటించారు. ఆర్థిక వ్యవహారాల్లో అనుచిత ప్రవర్తనకుగాను నవీన్ 26 మందిని ఒక్కసారిగా మంత్రి పదవుల నుంచి తొలగించారు. ఈ ఉద్వాసన వెనుకనున్నది ప్యారీమోహనేనంటారు. నవీన్ అదృష్టం కొద్దీ ప్రజలు కూడా పొరపాటు నిర్ణయాలకు ప్యారీని, తెలివైన నిర్ణయాలకు నవీన్ ను బాధ్యులుగా భావిస్తూ వచ్చారు. బలమైన ప్రత్యర్థిగా ఎవరూ ఎదగకుండా ఈ ద్వయం జాగ్రత్తపడుతూ వచ్చింది. బిజూ క్యాబినెట్ లో రెండో స్థానంలో ఉండి, బీజేడీ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన బిజయ్ ని కూడా 2000 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నవీన్ పక్కకు తొలగించారు. నవీన్ 2012 మే నెలలో అధికారిక పర్యటనపై బ్రిటన్ వెళ్లినపుడు, ప్యారీ నేతృత్వంలో ఆయనపై తిరుగుబాటు యత్నం జరిగింది. కానీ, తక్షణం నవీన్ రాష్ట్రానికి వస్తూనే ముగ్గురు మంత్రులను తొలగించారు. ఇద్దరు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. చివరకు ప్యారీని కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఆ విధంగా వారిద్దరి మధ్యనున్న 12 ఏండ్ల స్నేహ బంధానికి తెరపడింది. 


బీజేపీకి ఎసరు
బీజేపీ, బీజేడీల మధ్య పొత్తు దాదాపు ఎనిమిదేండ్లు కొనసాగింది. అదే సమయంలో బీజేపీ పునాదులను కరిగించి వేయడంలో నవీన్ కు ప్యారీమోహన్ సలహాలు బాగా ఉపయోగపడ్డాయి. గెలవడానికి ఎక్కువ అవకాశమున్న సీట్లు బీజేడీకి వచ్చేటట్లు చేశారు.  ఆయన 2004 అలాగే 2009 ఎన్నికల్లో నవీన్ తరఫున ప్రధాన వ్యూహకర్తగా వ్యవహరించారు. కొందరికి చివరి నిమిషంలో టికెట్ లేదా మంత్రి పదవి ఇవ్వకపోడం నవీన్ ముద్రగా మారింది. ఈ లక్షణాన్ని కూడా ప్యారీమోహనే అలవరచారంటారు. కంథమాల్ అల్లర్లను(2008) సాకుగా చూపి బీజేపీతో పొత్తుకు బీజేడీ రాం రాం చెప్పేసింది. బీజేపీ తోడు లేకుండానే గెలవగలమని బీజేడీ 2009 ఎన్నికల్లో చాటుకుంది. గిరిజనుల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోకి ఆర్ఎస్ఎస్ కొంతవరకు చొచ్చుకువెళ్లింది. ఏకలవ్య విద్యాలయాల పేరుతో ఏకోపాధ్యాయ బడులు పెట్టి అక్షరాస్యతా వ్యాప్తికి కృషి చేస్తోంది. ఫలితంగా, బీజేపీ ఇక్కడ ప్రధాన ప్రతిపక్షంగా కొనసాగగలుగుతోంది. 


మరకలూ ఉన్నాయి
సుప్రీం కోర్టు నియమించిన కేంద్ర సాధికార కమిటీ సుమారు రూ.17,576 కోట్ల విలువ మేరకు అక్రమ గనుల తవ్వకానికి నవీన్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని పేర్కొంది. చిట్ ఫండ్ కంపెనీల అక్రమాలు కూడా నవీన్ ప్రభుత్వానికి మచ్చ తెచ్చాయి. సుప్రీం కోర్టులో అలోక్ జీనా వేసిన ప్రజాహిత వ్యాజ్యంతో  కొన్ని కుంభకోణాలు వెలుగుచూశాయి. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి అవసరమైనపుడు మద్దతు ఇవ్వడంలో నవీన్ ముందు ఉండటం వల్ల కేంద్ర సంస్థలు ఒడిశాలో అవకతవకలపై అంతగా దృష్టి పెట్టడం లేదనే విమర్శలూ ఉన్నాయి. ఢిల్లీ పెద్దల పిల్లలు చాలా మంది మాదిరిగానే నవీన్ కూడా డెహ్రాడూన్ లోని డూన్ స్కూల్ లో చదువుకున్నారు. ఇందిరా గాంధీ రెండో కుమారుడు సంజయ్ గాంధీ ఆయన క్లాస్ మేట్. నవీన్ అన్న ప్రేమ్ కు వివాహమైంది కానీ, నవీన్ బ్రహ్మచారిగానే ఉండిపోయారు. 

 

ఆయన ‘ది గార్డెన్ ఆఫ్ ఇండియా’, ‘ఎ సెకండ్ ప్యారడైజ్’, ‘ఎ డిజర్ట్ కింగ్ డమ్’ అనే మూడు పుస్తకాలు కూడా రాశారు.  అయితే ఆయనకు ఒరియా భాష రాకపోవడం గమనార్హం. మొత్తం147 స్థానాలున్న  ఒడిశా అసెంబ్లీలో ప్రస్తుతం బీజేడీకి114, బీజేపీకి 23,  కాంగ్రెస్ కు తొమ్మండుగురు సభ్యులున్నారు. మరొకరు సీపీఐ(ఎం) సభ్యుడిగా ఉన్నారు. శాసన మండలి లేదు. ఒడిశా నుంచి మొత్తం లోక్ సభ స్థానాలు 21 కాగా, బీజేడీకి13 మంది, బీజేపీకి ఎనమండుగురు సభ్యులున్నారు. 


పనితీరుతో ప్రశంసలు నవీన్ బాధ్యతలు చేపట్టే నాటికి ఒడిశా దివాలా అంచున ఉంది. ఆయన ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టడమే కాకుండా పేదల అనుకూల విధానాలను అమలుపరిచారు. చిన్న చిన్న అటవీ ఉత్పత్తులను సేకరించి విక్రయించుకునేందుకు గిరిజనులకు అనుమతిచ్చారు. పోడు భూములపై గిరిజనులకు హక్కు కల్పించారు. గిరిజన విద్యార్థులకు వసతి గృహాలు నిర్మించారు. మహిళా స్వయం సహాయక బృందాలకు ప్రాధాన్యమిచ్చారు. నిజం చెప్పాలంటే, ఎన్నికల ప్రచార ఖర్చులో భాగం అనుకుని కొంత మొత్తాన్ని ఆ బృందాలకు ఇవ్వాల్సిందిగా ఆయన తన పార్టీ అభ్యర్థులను ఆదేశిస్తారని చెబుతారు. ఒడిశా జనాభాలో వెనుకబడిన కులాలవారు దాదాపు 54 శాతం మంది ఉంటారు. షెడ్యూల్డు కులాల వారు17 శాతం, షెడ్యూల్డ్​ తెగల వారు 23 శాతం ఉంటారు.

 
పట్నాయక్ లు ఈ మూడు వర్గాల్లోకి రారు. అయినా, నవీన్ రెండు దశాబ్దాలకు పైనుంచి పదవిలో కొనసాగుతున్నారంటే, ఓటర్లు కులాలను బట్టి ఓట్లు వేయకపోవడం, నవీన్ చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలే అందుకు కారణం అనుకోవాలి. సంపన్న కుటుంబం నుంచి రావడం, పెళ్లాం, బిడ్డలు వంటి బాదరబందీ ఏవీ లేకపోవడం వల్ల నవీన్ కు డబ్బు అవసరం లేదని
(అవినీతికి పాల్పడరని) ప్రజల్లో ఒక క్లీన్ ఇమేజ్ ఉంది. 


రాజకీయ అరంగేట్రం
అస్కా స్థానానికి1997లో జరిగిన ఉప ఎన్నికలో గెలవడం ద్వారా11వ లోక్ సభలో అడుగుపెట్టడంతో నవీన్ రాజకీయ జీవితం మొదలైంది. ఐ.కె. గుజ్రాల్ ప్రభుత్వంలో సహాయ మంత్రిగా చేరాలనుకున్నారు కానీ, ఆ ప్రభుత్వ సుస్థిరతపై నమ్మకం లేకపోవడంతో మనసు మార్చుకున్నారు. 1999లో అస్కా నుంచే మళ్లీ ఎన్నికై అటల్ బిహారి వాజ్ పేయి ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రి అయ్యారు. తర్వాత, బిజూ జనతా దళ్(బీజేడీ)ని ఏర్పాటు చేసుకుని, రాష్ట్ర రాజకీయాల వైపు మరలి, 2000 సంవత్సరంలో ఒడిశా సీఎం అయ్యారు. అప్పటికే ఒడిశాలో కాంగ్రెస్ ప్రభుత్వాల పట్ల ఏర్పడిన వ్యతిరేకత,1999 లో వచ్చిన పెను తుపానును అప్పటి గిరిధర్ గమాంగో ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కోలేకపోవడం, బిజూ మృతి సానుభూతి నవీన్ అధికారంలోకి రావడానికి సాయపడ్డాయి. బీజేడీ ఏర్పాటులో బిజయ్ మహాపాత్ర, దిలీప్ రేలు నవీన్​కు సాయపడ్డారు. కానీ, ఆ తర్వాత వారిని ఆయన పార్టీ నుంచి తొలగించారు. 

- మల్లంపల్లి ధూర్జటి, సీనియర్​ జర్నలిస్ట్