అపోజిషన్‌కి వాయిస్ లేకుండా చేయాలంటే జనం అవసరాల్ని జాగ్రత్తగా గమనిస్తుండాలి. ప్రభుత్వం తరఫున వాళ్లు ఏం కోరుకుంటున్నారో బేరీజు వేసుకోవాలి. నేషనల్ పాలిటిక్స్‌పై ఆసక్తి లేకపోయినా ఢిల్లీ లెవెల్‌లో ఏం జరుగుతోందో తెలుసుకుంటూ ఉండాలి. దేశంలో ప్రాంతీయ పార్టీలు సాగుతున్న బాటకు భిన్నంగా తమ పార్టీని నడపగలగాలి. ఈ లక్షణాలన్నీ ఫారిన్ రిటర్న్‌డ్ పొలిటీషియన్ నవీన్ పట్నాయక్‌లో పుష్కలం. వరుసగా అయిదోసారి అధికారంలోకి వచ్చినా, లోక్‌సభలో 12 సీట్లున్నా… ఎప్పుడూ కేంద్రంలో చక్రం తిప్పాలనే అత్యాశలకు పోలేదు.. పొలిటికల్‌గా సైలెంట్ నేచర్, పర్సనల్‌గా సింప్లిసిటీ నవీన్‌కి వరుస విజయాల్ని కట్టబెడుతున్నాయి.
ఒకప్పుడు రాజకీయాల పొడ ఏమాత్రం గిట్టని కుర్రాడు ఇప్పుడు ఒడిశాకు ఏకంగా ఐదో సారి ముఖ్యమంత్రి అయ్యారు. అయిష్టంగా, తండ్రి రాజకీయాలకు వారసుడిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన నవీన్ పట్నాయక్ ఐదోసారి బిజూ జనతాదళ్ ను అధికారంలోకి తీసుకువచ్చిన చరిత్రను సొంతం చేసుకున్నారు.
నవీన్ పట్నాయక్ 2000లో తొలిసారి ఒడిశా ముఖ్యమంత్రి గా బాధ్యతలు చేపట్టారు. వరుసగా నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినా, అవినీతి మరక అంటలేదంటారు రాజకీయ విశ్లేషకులు. జనంలో మిస్టర్ క్లీన్ గా పేరు తెచ్చుకున్నారు.
నవీన్ పట్నాయిక్ డిఫరెంట్స్టయిల్
మూస రాజకీయాలకు నవీన్ పట్నాయక్ పూర్తిగా భిన్నం. ఒడిశా ముఖ్యమంత్రిగా ఆయన కొత్త రాజకీయ కల్చర్ తీసుకువచ్చారు. ప్రభుత్వ యంత్రాంగంలో అన్ని స్థాయిల్లోనూ అవినీతికి బ్రేక్ వేయడానికి చర్యలు తీసుకున్నారు. ఓటేసిన ప్రజలకు నీతివంతమైన పాలన ఇవ్వడానికి తీవ్రంగా కష్టపడ్డారు. పాలనలో పారదర్శకతకు ప్రయారిటీ ఇచ్చారు. పార్టీ వేరు, పాలన వేరు అనే స్పష్టత ఇచ్చారు. ఎంత పెద్ద ప్రముఖుడైనా పరిపాలనలో అంచనాలకు తగ్గట్టు పనిచేయకపోతే మొహమాటం లేకుండా శాఖను మార్చేసేవారు. నవీన్ పట్నాయక్ డిఫరెంట్ పొలిటీషియన్. ప్రచారాలకు ఆర్భాటాలకు దూరం. ఎక్కడా భేషజాలకు పోరు. దేశంలోని సీనియర్ మోస్ట్ సీఎంల్లో ఒకరైనా బిహేవియర్ లో ఎక్కడా ఆ ఛాయలు కనిపించవు. నవీన్ పట్నాయక్ ది చాలా సింపుల్ లైఫ్ స్టయిల్. పెళ్లి చేసుకోలేదు. ఒడిశా ప్రజలే నా కుటుంబం అంటారాయన. ముఖ్యమంత్రిగా పాలనా వ్యవహారాలు చూడటానికే టైమ్ కేటాయిస్తారు. టైమ్ దొరికితే పుస్తకాలు చదువుతారు.
ప్రజలు మెచ్చిన స్కీమ్స్
జనాకర్షక పథకాలను సక్రమంగా అమలుచేస్తే ఓటమి ఉండదని దక్షిణ రాష్ట్రాలు ఎన్నోసార్లు రుజువు చేశాయి. ఎంజీఆర్, ఎన్టీఆర్, జయలలిత బలమైన ప్రతిపక్షాలనుకూడా తట్టుకుని ఓట్లను కొల్లగొట్టడానికి వాళ్లు అమలు చేసిన సంక్షేమ పథకాలే కారణం. ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ వరుసగా రెండోసారి గెలవడానికికూడా స్కీమ్‌ల ఇంప్లిమెంటేషనే కారణం. తూర్పున ఉన్న చిన్న రాష్ట్రం ఒడిశాలో మరోసారి నవీన్ పట్నాయక్ అధికారం చేపట్టడానికి సహకరించినవి సంక్షేమ పథకాలే.
అవినీతికి దూరంగా ఉండడం, ట్రాన్స్‌పరెంట్ ప్రభుత్వం, హిల్ ఏరియాల్లో మారుమూల గిరిజన గ్రామాలకు స్కీమ్‌లు అందేలా శ్రద్ధ చూపడం, ఎప్పటికప్పుడు సోషల్ చేంజెస్‌ని గమనిస్తూ వెల్‌ఫేర్ స్కీమ్‌లను ప్లాన్ చేసుకోవడం తదితర విషయాల్లో నవీన్ పట్నాయక్ చాలా జాగ్రత్తలు తీసుకుంటారు.
ఒడిశా ప్రయోజనాలకు ప్రయారిటీ
ముఖ్యమంత్రిగా ఎంత సీనియర్ అయినా నవీన్ పట్నాయక్ లో ప్రొఫైల్ మెయింటైన్ చేయడానికే ఇష్టపడతారు. అలా అని రాజకీయ ఎత్తుగడలు, వ్యూహాల్లో ఎవరికీ తీసిపోరు. 2000, 2004 ఎన్నికల్లో బీజేపీతో దోస్తానా చేశారు. 2009 ఎన్నికల్లో వ్యూహం మార్చారు. రాష్ట్రంలో నెలకొన్న కొన్ని ప్రత్యేక పరిస్థితుల కారణంగా బీజేపీతో తెగదెంపులు చేసుకున్నారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సాయం లేకుండా పోటీ చేసి ఒంటి చేత్తో బిజూ జనతాదళ్ ను గెలిపించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఎన్ని ఎత్తుగడలు వేసినా, ఎన్ని వ్యూహాలు పన్నినా అంతర్లీనంగా ఒడిశా ప్రయోజనాలే ప్రయారిటీగా ఉండేవి. లేటెస్ట్ గా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిజూ జనతా దళ్ అటు బీజేపీతో కానీ ఇటు కాంగ్రెస్ తో కానీ ఎలాంటి పొత్తు పెట్టుకోలేదు. ఒంటరిగా బరిలోకి దిగింది. అయినా 147 సీట్లున్న అసెంబ్లీలో 112 సీట్లు గెలుచుకుంది.