బీడీఎస్‌‌ విద్యార్థిని కిడ్నాప్‌‌ కేసులో నవీన్ రెడ్డిని విచారిస్తున్న పోలీసులు

బీడీఎస్‌‌ విద్యార్థిని కిడ్నాప్‌‌ కేసులో నవీన్ రెడ్డిని విచారిస్తున్న పోలీసులు

ఆదిభట్ల పోలీస్‌‌స్టేషన్‌‌ పరిధిలోని మన్నెగూడలో బీడీఎస్‌‌ విద్యార్థిని కిడ్నాప్‌‌ కేసులో ప్రధాన నిందితుడు నవీన్‌‌ రెడ్డిని సరూర్ నగర్ SOT ఆఫీస్ లో విచారిస్తున్నారు. ఇవాళ నవీన్ రెడ్డిని పోలీసులు కోర్టులో హాజరుపర్చనున్నారు. నిన్న సాయంత్రం రాచకొండ పోలీసులు గోవాలోని కాండోలిమ్‌‌ బీచ్‌‌లో నవీన్ రెడ్డిని అరెస్ట్ చేసి, హైదరాబాద్ కు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. కిడ్నాప్ చేసిన రోజు సాయంత్రం విద్యార్థిని మన్నెగూడలో వదిలేసి గోవాకు పారిపోయాడు. ఈ కేసులో 36 మందిని FIRలో చేర్చగా నవీన్ తో కలిపి 34 మందిని అరెస్ట్ చేశారు. 

నవీన్ రెడ్డి వద్ద నుంచి ఐదు సెల్​ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. యువతిని కిడ్నాప్ చేసిన తర్వాత నవీన్‌‌ రెడ్డి కర్నాటకకు వెళ్లాడు. అక్కడి నుంచి హుబ్లీ, పణజీ మీదుగా గోవా వెళ్లాడు. అక్కడే హైదరాబాద్‌‌కు చెందిన వ్యక్తి కాటేజ్‌‌లో దిగాడు. కాటేజ్ యజమానికి ఆధార్ కార్డ్‌‌ ఇవ్వడంతో పాటు దాడి వివరాలు చెప్పాడు. మొబైల్ నంబర్ ట్రేస్‌‌ చేసిన రాచకొండ పోలీసులు.. మంగళవారం సాయంత్రం 6 గంటల సమయంలో నవీన్‌‌ రెడ్డిని అరెస్ట్ చేశారు. 

మరోవైపు.. యువతి కిడ్నాప్ కేసులో పరారీలో ఉన్న మిగతా నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో A2 మహమ్మద్ వాజిద్ రుమెన్, A5 సిద్దు, A6 చందు ఉన్నారు. వీరితో పాటు మరో ఇద్దరు అనుమానితులను ఆదిభట్ల పోలీస్ స్టేషన్ నుండి ఎల్బీనగర్ SOT కార్యాలయానికి తరలించారు. ప్రస్తుతం వీరిని పోలీసులు అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. 


ఐదుగురిపై కస్టడీ పిటిషన్

ఇప్పటికే అరెస్ట్ చేసిన నిందితుల్లో ఐదుగురిని కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ఇబ్రహీంపట్నం కోర్టులో మంగళవారం పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. దాడి చేసిన వారిలో ఏ3 -భానుప్రకాష్, ఏ4 రాథోడ్ సాయినాథ్‌‌, ఏ8 గానోజి ప్రసాద్‌‌, ఏ9 కోతి హరి, ఏ30 -బోని విశ్వేశ్వర్‌‌‌‌లను ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్​పై బుధవారం వాదనలు జరుగనున్నాయి. వైశాలి ఇంటిపై దాడి, కిడ్నాప్‌‌కు సంబంధించి కీలక సమాచారం రాబట్టాల్సి ఉందని పిటిషన్​లో పోలీసులు పేర్కొన్నారు. రిమాండ్​లో ఉన్న నిందితుల నుంచి ప్రాసిక్యూషన్‌‌కు సంబంధించిన వివరాలు రికార్డ్ చేయాల్సి ఉందని కోర్టుకు వివరించారు.

వైశాలి కిడ్నాప్‌‌ కోసం మాస్టర్ ప్లాన్‌‌..  

కోర్టుకు అందజేసిన రిమాండ్‌‌ రిపోర్ట్‌‌లో పోలీసులు కీలక వివరాలు వెల్లడించారు. కిడ్నాప్‌‌కు వారం రోజుల కిందే నవీన్​ రెడ్డి ప్లాన్​ చేశాడు. తన ఫ్రెండ్స్‌‌ రుమాన్‌‌, సిద్దు, చందు, సాయినాథ్‌‌, నాగరాజు కీలకంగా వ్యవహరించారు. దాడి, కిడ్నాప్‌‌ ఎలా చేయాలి..? ఎక్కడికి పారిపోవాలి..? అందుకోసం ఎలాంటి ఏర్పాట్లు చేసుకోవాలి..? అన్నదానిపై ముందే మాట్లాడుకున్నారు. ప్లాన్‌‌ ప్రకారం దాడి చేశాక నవీన్‌‌ రెడ్డికి చెందిన వోల్వో కారులో విద్యార్థిని కిడ్నాప్ చేశారు. చందు డ్రైవింగ్‌‌ చేస్తుండగా సిద్దు ముందు సీట్‌‌లో కూర్చున్నాడు.

యువతిని మధ్య సీట్లో కూర్చొబెట్టుకుని నవీన్‌‌రెడ్డి, రుమాన్‌‌, సాయినాథ్‌‌, నాగరాజు దాడి చేశారు. అరిస్తే పేరెంట్స్​ను చంపేస్తామని బెదిరించారు. పోలీసులను డైవర్ట్ చేసేందుకు నవీన్‌‌రెడ్డి ఫోన్​ను మరో కారులో వేసి విజయవాడ రూట్‌‌లో పంపించారు. వోల్వో కారును సాగర్‌‌‌‌ రూట్‌‌లో తీసుకెళ్లారు. పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు బాధితురాలిని మరో కారులో పంపించాడు. మన్నెగూడ ఆర్టీఏ ఆఫీస్‌‌ వద్ద ఆమెను వదిలి రుమాన్‌‌, సిద్దు, చందు, సాయినాథ్‌‌, నాగరాజు ఎస్కేప్‌‌ అయ్యారు. నవీన్‌‌రెడ్డి తన వోల్వో కారును శంషాబాద్‌‌ ఓల్డ్‌‌ విలేజ్‌‌ సమీపంలో వదిలి పారిపోయాడు.