సల్మాన్​పై కుట్ర కేసులో మరొకరి అరెస్టు

సల్మాన్​పై కుట్ర కేసులో మరొకరి అరెస్టు
  • బిష్ణోయ్ గ్యాంగ్ మెంబర్ సుఖాను పట్టుకున్న పోలీసులు
  • పాక్​లోని తన హ్యాండ్లర్ డాగర్​ నుంచి గన్స్ కొనుగోలుకు సుఖా ప్లాన్.

ముంబై: సల్మాన్ ఖాన్ హత్యకు కుట్ర కేసులో మరో నిందితుడిని నవీ ముంబై పోలీసులు అరెస్టు చేశారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ మెంబర్ సుఖా అలియాస్ సుఖ్బీర్ బల్బీర్ సింగ్​ను హర్యానాలో బుధవారం అదుపులోకి తీసుకున్నారు. 

బిష్ణోయ్ గ్యాంగ్​లోని ఇతర సభ్యులతో కలిసి సల్మాన్ ఖాన్​ను చంపేందుకు సుఖ్బీర్ సింగ్ కుట్ర చేశాడని పోలీసులు గురువారం తెలిపారు. పాకిస్తాన్​లో ఉన్న తన హ్యాండ్లర్ డాగర్​తో టచ్​లో ఉన్నాడని చెప్పారు. పాకిస్తాన్ నుంచి ఏకే 47, ఏకే 92, ఎం16 గన్స్ కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేశాడని పేర్కొన్నారు. ఎన్సీపీ లీడర్ బాబా సిద్ధిఖీ హత్య కేసులోనూ సుఖ్బీర్ సింగ్​ను విచారిస్తామని వెల్లడించారు. 

కాగా, సల్మాన్ హత్యకు కుట్ర జరిగిందని ఈ ఏడాది ఏప్రిల్​లో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇందులో గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్, అతని సోదరుడు అన్మోల్, సంపత్ నెహ్రా, గోల్డీ బ్రార్ తదితరులను నిందితులుగా చేర్చారు. ఈ కేసులో ఇప్పటి వరకు బిష్ణోయ్ గ్యాంగ్ మెంబర్స్ ఐదుగురిని అరెస్టు చేశారు. వీరిలో ధనంజయ్, గౌరవ్ భాటియా, వసీం చిక్నా, రిజ్వాన్ ఖాన్ అలియాస్ జావెద్, దీపక్ హవా సింగ్ అలియాస్ జాన్ ఉన్నారు.

లారెన్స్ వెనుక ఎవరైనా ఉన్నారా? 

బాబా సిద్ధిఖీని హత్య చేసిన లారెన్స్​ బిష్ణోయ్ గ్యాంగ్.. సల్మాన్ ఖాన్​ను కూడా చంపుతామని బెదిరించింది. అయితే దీనివెనుక గ్యాంగ్​స్టర్ లారెన్స్ బిష్ణోయ్ కాకుండా మరెవరో ఉన్నారని సల్మాన్ కుటుంబసభ్యులు, సన్నిహితులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

 ‘‘బయటున్న వ్యక్తులను చంపేందుకు జైల్లో నుంచి ఆపరేట్ చేయడం అంత ఈజీనా? అయినా సల్మాన్​ను భయపెట్టేందుకు బాబా సిద్ధిఖీని చంపాల్సిన అవసరమేంటి? ఆయనేం సల్మాన్​ కుటుంబసభ్యుడు కూడా కాదు. ఇదంతా చూస్తే ఏదో జరుగుతోందని అనిపిస్తుంది. దీని వెనుక ఉన్న అసలు దోషులెవరో తేల్చాలి” అని సల్మాన్ కుటుంబసభ్యులు కోరుతున్నారు.

నమస్తే లారెన్స్ భాయ్.. 

లారెన్స్ బిష్ణోయ్​కి సల్మాన్ మాజీ గర్ల్ ఫ్రెండ్ సోమీ అలీ సోషల్ మీడియాలో ఓ మెసేజ్ పెట్టారు. ‘‘నమస్తే.. లారెన్స్ భాయ్. మీరు జైలు నుంచి కూడా జూమ్ కాల్స్ మాట్లాడతా రని తెలిసింది. మీకు కొన్ని విషయాలు చెప్పాలి. అది మీ మంచి కోసమే. నాతో ఓసారి జూమ్ కాల్ మాట్లాడండి. ప్లీజ్.. మీ నెంబర్ ఇవ్వండి” అని ఆమె కోరింది.