
- ఎక్కడ ఏర్పాటు చేస్తారో కొలిక్కిరాని వైనం
- జక్రాన్‌పల్లిలో ఏర్పాటు చేయాలంటున్న ఎంపీ అర్వింద్
- కలెక్టర్ నుంచి సర్కారుకు ల్యాండ్ సర్వే నివేదిక
- బోధన్‌కు షిఫ్ట్ చేయాలని స్థానిక ఎమ్మెల్యే ప్రయత్నం
నిజామాబాద్, వెలుగు : జిల్లాకు నవోదయ రెసిడెన్షియల్ పాఠశాల మంజూరైంది. కానీ ఎక్కడ ఏర్పాటు చేయాలన్న దానిపై ప్రజాప్రతినిధులు ఎవరికి వారే పైరవీలు చేస్తున్నారు. జిల్లాకు చెందిన నలుగురు ముఖ్య నేతలు తాము చెప్పిన చోటే స్కూలు ఏర్పాటు చేయాలని పంతం పడుతున్నారు. ఎంపీ అర్వింద్ జక్రాన్‌పల్లి మండలంలో ఏర్పాటు చేయాలని పట్టుదలతో ఉన్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి తన స్వగ్రామం అంకాపూర్‌లో స్కూల్ నిర్మిస్తే బాగుంటుందని ఇప్పటికే ప్రతిపాదించారు. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి తన సెగ్మెంట్లో నిర్మించాలని కోరుతున్నారు. తాజాగా బోధన్ ఎమ్యెల్యే సుదర్శన్‌రెడ్డి నవోదయను బోధనకు తరలించుకు వెళ్లే ప్రయత్నాలు ప్రారంభించారు.
కొత్తగా ఏడు నవోదయ స్కూళ్లు..
రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, సూర్యాపేట, మేడ్చల్-మల్కాజ్గిరి, జగిత్యాల, నిజామాబాద్ జిల్లాలకు కొత్త గా నవోదయ స్కూళ్లు గత ఏడాది మంజూరయ్యాయి. రాష్ట్ర సర్కార్30 ఎకరాల ల్యాండ్ ఇచ్చిన చోట కేంద్రం రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణాలు చేపడుతుంది. నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని జగిత్యాల జిల్లా నవోదయను కోరుట్లలో నిర్మించాలని నిర్ణయించారు. నిజామాబాద్ జిల్లాలో మాత్రం ప్రజాప్రతినిధుల మధ్య లొల్లి నడుస్తున్నది. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి నారాయణపూర్ శివారులో నిర్మించాలని కోరుతుండగా, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి అంకాపూర్‌ను తెరమీదకు తేగా ఎంపీ అర్వింద్ జోక్యంతో కొంత కూల్ అయ్యారు.
ఆర్మూర్ సెగ్మెంట్ పరిధిలోని జక్రాన్‌పల్లి మండలం కలిగోట్ విలేజ్‌లోని సర్వే నంబర్ 1063లో 30 ఎకరాల స్థలం ఉందని ఎంపీ అర్వింద్ ప్రతిపాదించారు. బోధన్, నిజామాబాద్ సిటీలో కేంద్రీయ విద్యాలయాలు ఉన్నందున నవోదయను మరోచోట ఏర్పాటు చేయాలని అర్వింద్ భావిస్తున్నారు. క్రమంలో కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు జనవరి 28న రాష్ట్ర ప్రభుత్వానికి పంపిన వివరాల ప్రకారం ఢిల్లీ నుంచి ఆఫీసర్ల టీం 15 రోజుల క్రితం వచ్చి కలిగోట్లోని సర్వే నంబర్ 1063 విజిట్ చేసి వెళ్లింది. ఇప్పుడు మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి ఆచన్‌పల్లిలోని నిజాం షుగర్ ఫ్యాక్టరీ సర్వే నంబర్ 690లోని ల్యాండ్‌ను నవోదయ స్కూల్ కోసం ప్రతిపాదించారు.
తాత్కాలిక స్కూల్ కోసం మూడు ప్రతిపాదనలు
నవోదయ రెసిడెన్షియల్ స్కూల్ బిల్డింగ్ నిర్మాణానికి ల్యాండ్ కిరికిరి ఇలా ఉండగా 2025–26 విద్యాసంవత్సరంలో స్కూల్ ప్రారంభించాలని నవోదయ విద్యా సమితి నిర్ణయించింది. పర్మినెంట్ బిల్డింగ్ పూర్తయ్యే వరకు తాత్కాలిక స్కూల్ ఏర్పాటు చేయాలని కోరింది. ఇందుకోసం నగరంలోని డైట్ కాలేజీ, డిచ్పల్లిలోని సీఎంసీ బిల్డింగ్, కేశాపూర్‌లో మూసివేసిన సుధీర్‌రెడ్డి ఇంజినీరింగ్ కాలేజీ బిల్డింగ్‌లను పరిశీలించారు.
ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనం
నిజామాబాద్, వెలుగు : నవోదయ స్కూల్‌ను బోధన్ తీసుకెళ్లడానికి ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి కుట్ర చేస్తున్నారని ఆరోపిస్తూ బుధవారం రాత్రి బీజేపీ నేతలు సిటీలో ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్ది కూడా శకుని పాత్ర పోషిస్తున్నారని ఆరోపించారు. ఎంపీ అర్వింద్ కృషితో జిల్లాకు నవోదయ స్కూల్ మంజూరైందన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రెసిడెంట్ దినేశ్, న్యాలం రాజు, పోతన్కర్ లక్ష్మీనారాయణ. బద్దం కిషన్, పద్మారెడ్డి, నాగరాజు, గడ్డం రాజు, ఇప్పకాయల కిషోర్, ఆనందరావు పాల్గొన్నారు.
పదేండ్ల డిమాండ్..
నవోదయ రెసిడెన్షియల్ స్కూల్స్‌లో క్వాలిటీ ఎడ్యుకేషన్ లభిస్తుందనే పేరుంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ఆధీనంలో అటానమస్‌గా పనిచేసే నవోదయ విద్యా సమితి (ఎన్వీఎస్) దేశంలోని ప్రతి జిల్లాలో ఒక రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేసింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని నిజాంసాగర్ మండలంలో 1986లో నవోదయ స్కూల్ ఏర్పడగా దానిని క్రమంగా ఆరో క్లాస్ నుంచి ఇంటర్ దాకా పెంచారు. ప్రతి ఏడాది ఆరో క్లాస్‌లో 80 సీట్ల భర్తీ కోసం ప్రవేశ పరీక్ష నిర్వహించగా ఉమ్మడి జిల్లా నుంచి సుమారు ఎనిమిది వేల మంది అటెండ్ అవుతున్నారు. జిల్లాల విభజన తరువాత కామారెడ్డి జిల్లా పరిధిలోకి నిజాంసాగర్ నవోదయ వెళ్లింది. నిజామాబాద్ జిల్లాకు మరో నవోదయ కావాలని విద్యార్థుల తల్లిదండ్రులు పదేండ్లుగా డిమాండ్ చేస్తున్నారు.