- కరెంట్ షాక్తో.. నవోదయ స్టూడెంట్ మృతి
- ఆస్పత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్న మరో ముగ్గురు
- ఖమ్మం జిల్లా పాలేరు జవహర్ నవోదయలో ఘటన
- కుటుంబసభ్యులు, విద్యార్థి సంఘాల ఆందోళన
కూసుమంచి, వెలుగు: ఖమ్మంలో దారుణం జరిగింది. కరెంట్ షాక్ తో ఓ స్టూడెంట్ మృతి చెందగా, మరో ముగ్గురు ఆస్పత్రిపాలయ్యారు. ఈ ఘటన కూసుమంచి మండలంలోని పాలేరు జవహర్ నవోదయ విద్యాలయంలో జరిగింది. స్కూల్లో శనివారం స్టూడెంట్లతో క్లీనింగ్ పనులు చేయించారు. అనంతరం నలుగురు స్టూడెంట్లు మెయిన్ గేటు దగ్గర ఇనుప బోర్డు ఏర్పాటు చేసేందుకు వెళ్లారు. అయితే ఆ మెయిన్ గేట్ పైనుంచే 11 కేవీ విద్యుత్ లైన్ ఉంది. స్టూడెంట్లు బోర్డు ఏర్పాటు చేస్తుండగా, అది పైన తీగలకు తగిలి షాక్ వచ్చింది. దీంతో బోర్డును, గేటును పట్టుకున్న నలుగురు స్టూడెంట్లకు షాక్ తగిలింది. గమనించిన స్థానికులు 108 అంబులెన్స్ కు సమాచారం ఇవ్వడంతో షాక్ కు గురైన స్టూడెంట్లను ఖమ్మం ఆస్పత్రికి తరలించారు.
అక్కడ ట్రీట్ మెంట్ పొందుతూ ఇంటర్ విద్యార్థి హలావత్ దుర్గా నాగేందర్ (16 ) మృతి చెందాడు. ఇతని సొంతూరు కోక్యా తండా. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాల నాయకులు విద్యాలయానికి చేరుకుని ఆందోళన చేశారు. ఫర్నీచర్, మెస్ అద్దాలు ధ్వంసం చేశారు. ప్రిన్సిపాల్ చంద్రబాబు నిర్లక్ష్యంతోనే స్టూడెంట్ చనిపోయాడని మండిపడ్డారు. ‘‘స్టూడెంట్ల బాగోగులను ప్రిన్సిపాల్ పట్టించుకోవడం లేదు.
గతంలో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ జరిగింది. అసలు విద్యాలయంలో ఏం జరుగుతున్నదో ఎవరికీ తెలియడం లేదు. జర్నలిస్టులు లోపలికి రాకుండా గేటు దగ్గర కాపలా పెడుతున్నారు” అని విద్యార్థి సంఘాల నేతలు చెప్పారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కూసుమంచి సీఐ కంది జితేందర్ రెడ్డి, కూసుమంచి, తిరుమలాయపాలెం, నేలకొండపల్లి ఎస్సైలు వచ్చి ఆందోళనకారులను చెదరగొట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.