అలంపూర్, వెలుగు: ఐదో శక్తిపీఠంగా విరాజిల్లుతున్న జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాల్లో ఆదివారం దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆదివారం స్వామివారి ఆనతి స్వీకరణ, యాగశాల ప్రవేశం, గణపతి పూజ, పుణ్యహవాచనం, రుత్విక్ వర్ణం, మహాకలశ స్థాపన, అగ్ని ముఖం కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం అంకురార్పణ, ధ్వజారోహణం కార్యక్రమాన్ని నిర్వహించి ఉత్సవాలను ప్రారంభించారు. ఈవో పురేందర్ కుమార్, ఆలయ చైర్మన్ చిన్న కృష్ణయ్య, అర్చకులు పాల్గొన్నారు. జోగులాంబ అమ్మవారు 9 రోజుల పాటు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఇబ్బంది కలగకుండా చలువ పందిళ్లు, తాగునీటి సౌకర్యం కల్పించినట్లు ఈవో తెలిపారు.
మొదటి రోజు శైలపుత్రి దేవిగా..
శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు జోగులాంబ అమ్మవారు శైలపుత్రి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చారు.
ఉమామహేశ్వర క్షేత్రంలో..
అచ్చంపేట: మండలంలోని రంగాపూర్ గ్రామ సమీపంలోని నల్లమల కొండలపై వెలసిన శ్రీశైల ఉత్తరద్వారంగా పిలిచే ఉమామహేశ్వర క్షేత్రంలో నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మొదటిరోజు శైలపుత్రి అలంకరణతో అమ్మవారు దర్శనమిచ్చారు. ఆలయ చైర్మన్ కందూరు సుధాకర్, ఈవో శ్రీనివాసరావుతో పాటు భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.
తుల్జా భవానీమాత ఊరేగింపు
నాగర్ కర్నూల్ టౌన్: నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పట్టణంలో తుల్జా భవానీ అమ్మవారి విగ్రహ ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. హనుమాన్ టెంపుల్ నుంచి మెయిన్ రోడ్ మీదుగా సంత బజార్ వరకు శోభాయాత్ర జరిగింది. బొడ్రాయి వద్ద అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించారు. అలాగే వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించారు.