
జమ్మూకాశ్మీర్లో ఉగ్రదాడి. టూరిస్ట్ స్పాట్ బైసారన్ లో టెర్రిరిస్టుల మారణహోమం. ఉగ్ర ముష్కరుల బుల్లెట్లకు 26 మంది బలయ్యారు. మంగళవారం అనంత్ నాగ్ జిల్లా పహల్గామ్ ఉగ్రదాడిలో దేశం ఒక్కసారిగా ఉలిక్కపడింది.పుల్వామా దాడి తర్వాత పెద్ద ఎత్తున పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రదాడి ఇది. నిన్న ఉగ్రదాడి తర్వాత టెర్రరిస్టుల ఘాతుకానికి సాక్ష్యంగా బయటికొచ్చిన తొలిఫోటో ఓ నేవీ అధికారిది.ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన భర్త నీర్జీవ శరీరం పక్కన కూర్చొని ఉన్న నవ వధువు ఫొటో టెర్రరిస్టుల దాష్టికానికి ముఖచిత్రంగా మారింది.
జమ్మూకాశ్మీర్ లోని పహల్గామ్ లో మంగళవారం ఉగ్రవాదులు 26మంది అమాయకపు టూరిస్టులను పొట్టనపెట్టుకున్నారు. టెర్రరిస్టుల బుల్లెట్లకు బలైన హర్యానాకు చెందిన 26 యేళ్ల నేవీ అధికారి నార్వాల్ విషాద గాధ అందరిని కలచివేసింది. నార్వాల్ పెళ్లై కేవలం ఏడు రోజులే.. భార్యతో హానీమూన్ కొచ్చిన నార్వాల్ ముష్కరుల తూటాలకు బలయ్యాడు. పాపం నార్వాల్ భార్య దిక్కుతోచనిస్థితిలో భర్త మృతదేహం పక్కన కూర్చొని రోదిస్తున్న ఫొటో..ఉగ్రదాడికి సాక్ష్యంగా నిలిచింది.
ఇటీవల కొచ్చిలో పోస్ట్ చేయబడిన 26 ఏళ్ల నేవీ అధికారి నార్వాల్ కు ఏప్రిల్ 16న వివాహం జరిగింది.అతని వివాహ రిసెప్షన్ ఏప్రిల్ 19న జరిగింది. వివాహం అనంతరం సెలవులో కాశ్మీర్‌లో వెళ్లిన నార్మాల్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయారని రక్షణ అధికారులు ధృవీకరించారు.
నార్వాల్ రెండేళ్ల క్రితమే భారత నావికాదళంలో చేరారు. అతని అకాల మరణం ఆయన కుటుంబాన్ని, స్థానిక సమాజాన్ని, రక్షణ రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. చాలా మంది పొరుగువారు, పరిచయస్తులు నార్వాల్‌ను ఉజ్వల భవిష్యత్తు ఉన్న యువ అధికారి అని భోరు విలపించారు.
అనంత్ నాగ్ పహల్గామ్ టెర్రిరిస్టు అటాక్ దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. అమాయకులైన టూరిస్టులపై ముష్కరుల దాడిని రాజకీయ నేతలు తీవ్రంగా ఖండించారు. జమ్మూ కాశ్మీర్ అంతటా ప్రజలు సంఘీభావం ప్రకటించి దాడికి నిరసనగా కొవ్వొత్తుల ప్రదర్శనలు నిర్వహించారు. బారాముల్లా, శ్రీనగర్, పూంచ్, కుప్వారా ,అఖూర్ ప్రాంతంలోని ఖోడ్ గ్రామాల్లో ఉగ్రదాడిని నిరసిస్తూ ఆందోళనలు నిర్వహించారు. జమ్మూలో బజరంగ్ దళ్ సభ్యులు కూడా నిరసన ప్రదర్శన నిర్వహించారు.
మరోవైపు పహల్గామ్ దాడిలో మహారాష్ట్రకు చెందిన ఐదుగురు టూరిస్టులు కూడా మరణించారని ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ప్రకటించారు. తెలంగాణలో ఐబీ అధికారి మనీష్ రంజన్, ఏపీలోని నెల్లూరు జిల్లాకు చెందిన మధుసూదన్ మృతి చెందారు. విశాఖకు చెందిన చంద్రమౌళి అనే వ్యక్తి కూడా ఉగ్రమూకల తుపాకీ తూటాలకు బలయ్యారు.