నేవీ రాడార్ స్టేషన్ దామగుండంలో వద్దు : ఎంపీ రంజిత్ రెడ్డి

న్యూఢిల్లీ, వెలుగు: చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలోని దామగుండంలో నేవీ రాడార్ స్టేషన్ నిర్మాణం వద్దని, దానిని వేరే చోటుకి మార్చాలని కేంద్ర ప్రభుత్వానికి బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ ఎంపీ జి.రంజిత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై డిఫెన్స్‌‌‌‌‌‌‌‌ మినిస్ట్రీ పునరాలోచన చేయాలని శనివారం ఒక ప్రకటనలో కోరారు. దామగుండంలో రాడార్ స్టేషన్ నిర్మించడం వల్ల 400 ఏండ్ల పురాతనమైన రామలింగేశ్వర స్వామి ఆలయం, విలువైన అటవీ, ఔషధ వృక్షాలు కాలగర్భంలో కలిసే ప్రమాదం ఉందన్నారు.

ఈ రాడార్ స్టేషన్ ఏర్పాటయ్యాక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు. నియోజకవర్గంలోని పూడూరు మండల ప్రజలు తీవ్ర అభ్యంతరం తెలుపుతున్నట్లు వెల్లడించారు. ఈ అంశాన్ని శుక్రవారం రూల్ 377 కింద లోక్‌‌‌‌‌‌‌‌సభలో లెవనెత్తినట్లు చెప్పారు. స్థానిక ప్రజలు ఆందోళనలను పరిశీలించి, కేంద్ర రక్షణ తన నిర్ణయాన్ని మార్చుకోవాలని విజ్ఞప్తి చేశారు.