ఇస్లామాబాద్: పాకిస్తాన్ ఎన్నికల సంఘం గురువారం జరిగిన సార్వత్రిక ఎన్నికల తుది ఫలితాలను ప్రకటించింది. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రానందువల్ల.. వివిధ పార్టీలు కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కసరత్తు ప్రారంభించాయి. బిలావల్ జర్దారీ భుట్టోకు చెందిన పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ, ముత్తాహిదా క్వామీ మూవ్‌మెంట్ పాకిస్తాన్ పార్టీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మాజీ ప్రధాని నవాజ్‌షరీఫ్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఆ పార్టీల నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు.
మ్యాజిక్ ఫిగర్133 సీట్లు
పాక్ జాతీయ అసెంబ్లీలో మొత్తం 336 సీట్లు ఉన్నాయి. ఇందులో 266 స్థానాలకు నేరుగా ఎన్నికలు నిర్వహిస్తారు. మరో 70 స్థానాలను మైనారిటీలకు, మహిళలకు కేటాయిస్తారు. ఓ స్థానంలో అభ్యర్థి చనిపోవడంతో 265 సీట్లకే గత గురువారం ఎన్నికలు నిర్వహించారు. ఓట్ల లెక్కింపు తర్వాత ఈసీ 264 స్థానాల ఫలితాలను ప్రకటించింది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ ఇండిపెండెంట్అభ్యర్థులు 101 సీట్లలో విజయం సాధించారు. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పాక్ ముస్లిం లీగ్- నవాజ్ పార్టీ 75 సీట్లు సాధించింది. బిలావల్ జర్దారీ భుట్టోకు చెందిన పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ)కి 54 సీట్లు వచ్చాయి. ముత్తాహిదా క్వామీ మూవ్‌మెంట్ పాకిస్తాన్(ఎంక్యూఎంపీ) పార్టీకి17 సీట్లు రాగా, మిగిలిన12 స్థానాలను చిన్న పార్టీలు కైవసం చేసుకున్నాయి. పాక్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే జాతీయ అసెంబ్లీలో పోటీ చేసే 265 స్థానాల్లో133 సీట్లు గెలవాల్సి ఉంటుంది.
మళ్లీ నవాజే పీఎం?
ఇమ్రాన్ ఖాన్ పార్టీకి చెందిన అభ్యర్థులందరూ ఇండిపెండెంట్‌గా పోటీ చేయడం వల్ల.. 75 స్థానాల్లో విజయం సాధించిన నవాజ్ షరీఫ్ పార్టీ టెక్నికల్‌గా అతిపెద్ద పార్టీగా అవతరించింది. దీంతో ఆయన ప్రభుత్వ ఏర్పాటుకు పావులు కదపడం మొదలు పెట్టారు. ఆర్మీ మద్దతుతో పాటు మరో రెండు పార్టీలను కలుపుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పీపీపీ, ఎంక్యూఎంపీ నేతలతో నవాజ్ షరీఫ్ సోదరుడు షహబాజ్ షరీఫ్ చర్చిస్తున్నారు. చర్చలు ఫలిస్తే మూడు పార్టీల ఎమ్మెల్యేల(146) తో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడనుంది. పీపీపీతో చర్చలు విఫలమైతే.. ఎంక్యూఎంపీ, ఇండిపెండెట్లు, ఇతర చిన్న పార్టీలతో కలిసి సర్కారును ఏర్పాటు చేయాలని నవాజ్భావిస్తున్నారు.