హర్యానా సీఎంగా నేడు సైనీ ప్రమాణం : బీజేపీ శాసనసభా పక్ష నేతగా ఎన్నిక

హర్యానా సీఎంగా నేడు సైనీ ప్రమాణం : బీజేపీ శాసనసభా పక్ష నేతగా ఎన్నిక

చండీగఢ్: హర్యానా బీజేపీ శాసనసభాపక్ష నేతగా నాయబ్‌‌ సింగ్‌‌ సైనీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బుధవారం పంచకులలోని పార్టీ ఆఫీసులో జరిగిన సమావేశంలో సైనీని బీజేపీ లెజిస్లేటివ్ పార్టీ లీడర్ గా ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. ఆ వెంటనే కేంద్ర పరిశీలకుడిగా హాజరైన కేంద్రమంత్రి అమిత్‌‌షా, నాయబ్ సింగ్ సైనీతో కలిసి చండీగఢ్‌‌లోని రాజ్‌‌భవన్‌‌కు చేరుకుని గవర్నర్ బండారు దత్తాత్రేయను కలుసుకున్నారు.

ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరారు. దీంతో నాయబ్‌‌ సింగ్‌‌ సైనీ  గురువారం హర్యానా సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ఏడాది మార్చిలో మనోహర్ లాల్ ఖట్టర్ స్థానంలో సైనీ హర్యానా సీఎంగా బాధ్యతలు చేపట్టారు. పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే సైనీనే సీఎంగా కొనసాగిస్తామని ఎన్నికల ముందు బీజేపీ ప్రకటించింది.

హర్యానాలోని మొత్తం 90 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ 37 సీట్లు గెలుచుకోగా.. బీజేపీ 48 సీట్లు గెలుచుకుని వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చింది. దాంతో ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా సైనీనే లెజిస్లేటివ్ పార్టీ లీడర్​గా ఎన్నుకున్నారని అమిత్ షా వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ కార్యకర్తల తరఫున సైనీకి అభినందనలు తెలిపారు. హర్యానాలో బీజేపీ విజయానికి మోదీ ప్రభుత్వ విధానాలే కారణమని సైనీ అన్నారు.