మా ఊరికి కరెంట్ ఎప్పుడొస్తది .. నాయకపు గూడ గ్రామస్తుల వినూత్న నిరసన

మా ఊరికి కరెంట్ ఎప్పుడొస్తది .. నాయకపు గూడ గ్రామస్తుల వినూత్న నిరసన
  • పోల్స్​ వేసేందుకు అనుమతించని ఫారెస్ట్ శాఖ 

ఆసిఫాబాద్, వెలుగు: స్వతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు గడిచినా తమ ఊరికి ఇప్పటికీ కరెంట్​సౌకర్యం లేదని, ఫారెస్ట్ అధికారులు పర్మిషన్ ఇవ్వక ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని తిర్యాణి మండలం గోవెన గ్రామ పంచాయతీ నాయకపు గూడ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యను అధికారులెవరూ పట్టించుకోవడంలేదని గ్రామస్తులు సోమవారం ఆసిఫాబాద్​లోని జిల్లా ఫారెస్ట్ ఆఫీస్ ముందు నోరు మూసుకొని వినూత్న రీతిలో నిరసన తెలిపారు.

 అనంతరం వారు మాట్లాడుతూ.. పట్టణాల్లో అరగంట  కరెంట్ పోతే ఇబ్బంది పడతారని, కానీ తమ గ్రామం దశాబ్దాల కాలంగా చీకట్లోనే మగ్గిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కరెంట్​సౌకర్యం కల్పించేందుకు అటవీ శాఖ అనుమతి ఇవ్వడం లేదని, గ్రామానికి కరెంట్ స్తంభాలు వేసుకోవడానికి అనుమతివ్వాలని ఏండ్లుగా వేడుకుంటున్నా మోక్షం లభించలేదని వాపోయారు. ఇప్పటికైనా అటవీశాఖ అధికారులు కనికరించి కరెంట్ స్తంభాలు వేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు.