- వేగంగా సాగుతున్న వరద ముంపు శాశ్వత పరిష్కార చర్యలు
- ఐదు యూనిట్లుగా విడిపోయి పనులు స్పీడప్
- 04 ఏండ్లలో కదలని పనులు.. 04 నెలల్లో చేసేలా అడుగులు
- రాజకీయ జోక్యం లేకపోవడంతో రంగంలోకి ఆఫీసర్లు
వరంగల్, వెలుగు: గ్రేటర్ వరంగల్లో నయీంనగర్ నాలా జూన్ 15 నాటికి అందుబాటులోకి రానుంది. సమ్మయ్య నగర్ నుంచి కేయూసీ రోడ్డులోని హనుమాన్‍నగర్ బ్రిడ్జి వరకు ఉండే నాలా ఆక్రమణల కూల్చివేత దాదాపుగా పూర్తయింది. ఈ ప్రధాన నాలాను 80 మీటర్ల వరకు విస్తరించి ఇరువైపులా రిటైనింగ్ వాల్ సైతం నిర్మిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వరద ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడానికి అనుకున్న గడువులోగా పూర్తి చేయడానికి లోకల్ ఎమ్మెల్యేతో పాటు జిల్లా కలెక్టర్, గ్రేటర్ కమిషనర్ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. జూన్ చివర..జులై మొదటి వారంలో వానలు మొదలయ్యే నాటికే వర్క్స్ మొత్తం పూర్తి చేసేలా జూన్ 15 డెడ్‍లైన్ పెట్టుకోవడంతో పనులు జెట్ స్పీడుతో సాగుతున్నాయి.
ఫిబ్రవరిలో నాలా.. ఏప్రిల్‍లో పెద్దమోరీ వర్స్క్
రాష్ట్రంలో డిసెంబర్ 7న కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిరాగానే గ్రేటర్ వరంగల్లో మేజర్ సమస్యగా భావించే నయీంనగర్ నాలాపై పాలకులు దృష్టి సారించారు. వరదముంపు చర్యల్లో భాగంగా కావాల్సిన రూ.90 కోట్ల నిధులు కేటాయించారు. ఫిబ్రవరి 7న నయీంనగర్ నాలా ఆక్రమణల తొలగింపు, నాలా వెడల్పు, ఇరువైపులా రిటైనింగ్ వాల్ కట్టే పనులకు ఎమ్మెల్యే నాయిని రాజేందర్‍రెడ్డి శంకుస్థాపన చేశారు. అదేటైంలో హనమకొండ_కరీంనగర్ మార్గంలో ఇరుకుగా ఉన్న నయీంనగర్ పెద్ద మోరీ విస్తరణకు సైతం అడుగులు వేశారు. ఏప్రిల్ 5న బ్రిడ్జిని కూల్చివేసి కొత్తదానికి శంకుస్థాపన చేశారు. రూ.8.5 కోట్ల స్మార్ట్ సిటీ ఫండ్స్ కేటాయించారు. దీంతో పాటు దాదాపు మరో రూ.7 కోట్లతో మంచినీటి సప్లైకి సంబంధించిన వర్స్క్ చేపట్టారు.
ఐదు యూనిట్లుగా..పనులు స్పీడప్
గ్రేటర్ వరంగల్లో గడిచిన ఐదారేండ్లుగా వరద ముంపు సమస్య పెరిగింది. దీంతో నాలుగేళ్ల క్రితం నయీంనగర్ నాలాను వెడల్పు చేస్తామనే పేరుతో నాటి మున్సిపల్ మంత్రి కేటీఆర్ శిలాఫలకం వేశాడు. నాలుగేండ్లు గడిచినా పనులు ముందుకుసాగలేదు. కాగా, సిటీ మునకకు కారణమవుతున్న ఈ పనులను నాలుగు నెలల్లో పూర్తి చేయాలని ప్రస్తుత ప్రభుత్వం సీరియస్‍గా తీసుకోవడంతో..పనులు అంతే స్పీడుతో జరుగుతున్నాయి.
మొత్తం పనులను ఐదు యూనిట్లుగా విభజించారు. ఇందులో రాజాజీ నగర్ బ్రిడ్జి ఏరియా, నయీంనగర్ నాలా పెట్రోల్ పంప్, చైతన్య కాలేజీ నుంచి బొక్కలగడ్డ బ్రిడ్జి, కేయూసీ రోడ్డులోని హనుమాన్‍నగర్ బ్రిడ్జి వద్ద పనులను యూనిట్లుగా విభజించి ఎవరికివారుగా పనులను వేగవంతం చేశారు. ఇక గతంలో 16 మీటర్ల వెడల్పుతో ఉన్న నయీంనగర్ పెద్ద మోరీ బ్రిడ్జిని 24.5 మీటర్లకు విస్తరించే పనులను మరో టీం చూసేలా ప్లాన్ చేశారు. ఏదేమైనా చెప్పిన గడువులోగా పనులు పూర్తి చేసేలా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‍రెడ్డి, హనుమకొండ కలెక్టర్ సిక్తా పట్నాయక్, గ్రేటర్ కమిషనర్ అశ్విని తానాజీ వాఖడే ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షిస్తున్నారు.
జూన్‍లో పక్కాగా నాలా పనులు పూర్తయితయ్
ఈ ఏడాది నుంచి హనుమకొండ సిటీలో వరద ముంపు సమస్య ఉండొద్దనే.. ఎమ్మెల్యే అవగానే నాలా విస్తరణ పనులకు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చినం. కావాల్సిన ఫండ్స్‍తో ఫిబ్రవరి నాలా, ఏప్రిల్‍లో నయీంనగర్ పెద్దమోరీ పనులు స్టార్ట్ చేసినం. బీఆర్‍ఎస్ ప్రభుత్వం నాలుగేండ్లుగా చేయని పనులను నాలుగు నెలల్లో చేసి చూపిస్తాం. ఏదేమైనా జూన్ 15 వరకు నాలా విస్తరణ, ఇరువైపులా గోడ, నయీంనగర్ కొత్త బ్రిడ్జి పనులను పూర్తి చేస్తాం.
- పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‍రెడ్డి.